ఇద్దరు సీఎంల భేటీ ఎందుకు? చంద్రబాబు ఎందుకు పారిపోయారు?: అంబటి రాంబాబు

ఆంధ్ర, తెలంగాణ సీఎంల భేటీపై మాజీ మంత్రి అంబటి రాంబాబు పలు అనుమానాలు లేవనెత్తారు. మరోసారి ఆంధ్ర ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

Update: 2024-07-08 12:16 GMT

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సమావేశం అయ్యారో ప్రజలకే కాదు వారికి కూడా అర్థమైనట్లు లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు చురకలంటించారు. ఈ సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని కూడా అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ విమర్శలు గుప్పించారు. ‘‘రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు అంటే చర్చించడానికి చాలా సమస్యలు ఉంటాయని, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ మధ్య అనేక అంశాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, వాటి గురించి చంద్రబాబు ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు అంబటి రాంబాబు. ఒకవేళ నిజంగా రాష్ట్రానికి మేలు చేసే అంశాలను లేవనెత్తి ఉంటే.. ఇప్పటి వరకు ఎందుకు వాటి విషయంలో చర్చల ఫలితాలు ఎవరూ.. ఎక్కడా ప్రకటించలేదని, చర్చకు సంబంధించిన అన్ని విషయాలను అంత రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని నిలదీశారు. చర్చల్లో వ్యక్తిగత లాభాలు ఏమీ లేకుంటే వెంటనే చర్చించిన ప్రతి అంశం, చర్చల ఫలితంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

‘‘నాగార్జునసాగర్ కుడి కెనాల్‌కు నీళ్లు రావాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంలు ఎందుకు చర్చింలేదు. టీటీడీ బోర్డు, ఆదాయంలో వాటా కావాలని, పోర్టుల్లో కూడా వాటా కావాలని తెలంగాణ కోరింది. అసలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ సారాంశాన్ని ఎందుకు రహస్యంగా ఉంచారు? అంత అవసరం ఏమొచ్చింది? ఏపీ ప్రజలకు చంద్రబాబు ఈసారి ఏం ద్రోహం చేయబోతున్నారు?’’ అంటూ వ్యాఖ్యానించారు.

డిమాండ్లకు ఓకే చెప్పినట్లేనా

‘‘ఏపీ, తెలంగాణ రెండూ రెండు కళ్ళు అంటే అర్థం ఏంటి? తెలంగాణ డిమాండ్లకు చంద్రబాబు ఓకే చెప్పారనే దీని అర్థమా? నాగార్జునసాగర్‌కు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు? డ్రగ్స్ గురించి చర్చించాం అంటే డ్రగ్స్ అనేది రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కలిసి చర్చించాల్సినంత పెద్ద సమస్యా?’’ అంటూ దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ చొరవతో అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని అంబటి గుర్తు చేశారు.

పోలవరం అందుకు ఆలస్యం కాలేదు

‘‘జగన్ చొరవతోనే పోలవరం విషయంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశాతో ఉన్న వివాదాలు పరిష్కారం అయ్యాయి. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లను మార్చడం, రివర్స్ టెండరింగ్‌కు పిలుపివ్వడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కాలేదు. చంద్రబాబు.. నది మధ్యలో కాఫర్ డ్యామ్ కట్టడం, అసలు కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ నిర్మించాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు చేయడం వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం’’ అని చెప్పుకొచ్చారు.

ఆంధ్రకు అన్యాయం జరిగింది

‘‘విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం జరిగింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి పది సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. మరి దానిని వినియోగించుకోకుండా చంద్రబాబు ఎందుకు పారిపోయి వచ్చారు? బస్సులో నివాసం ఉంటూ పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చంద్రబాబు తప్పు చేసినందుకే మెడ పట్టుకుని తెలంగాణ నుంచి గెంటేశారు. అందుకే రాష్ట్రానికి రావాల్సినది ఏదీ కూడా రాలేదు. వాటిని తీసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు బాబు. ఇప్పుడు తెలంగాణ సీఎంతో భేటీ అయినప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా మరోసారి ఆంధ్రకు అన్యాయం చేస్తున్నారు’’ అని మండిపడ్డారు.

మొన్నటి సీఎంల సమావేశంలో చంద్రబాబు ఏం చర్చించారు? రూ.7 వేల కోట్లకుపైగా రావాల్సిన విద్యుత్ బిల్లుపై ఎందుకు చర్చించలేదు? నాగార్జునసాగర్‌లో నీరు విడుదల చేయడానికి కూడా తెలంగాణపై ఆధారపడాలా? శ్రీశైలంలో విద్యుత్ సరఫరా విషయంపై ఎందుకు చర్చించలేదు? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.

అంబటికి నెటిజన్ల కౌంటర్లు

ఇన్ని రావాల్సి ఉంటే.. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అడగలేదు? ఇప్పుడే ఇన్ని సమస్యలు ఉన్నాయాని గుర్తుకొచ్చాయా? జగన్‌ది రామ రాజ్యం అంటూ ఎన్నికల ప్రచారంలో కబుర్లు చెప్పినప్పుడు కూడా ఇవన్నీ గుర్తుకు రాలేదా? అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. నిజమే.. చంద్రబాబు.. సీఎంల భేటీని రహస్యంగా ఉంచడం తప్పే.. కానీ గత ఐదేళ్లలో విభజన హామీల్లో వేటిని నెరవేర్చడానికి వైసీపీ పాటుపడిందో ముందు మీరు చెప్పాలంటూ మరికొందరు నిలదీస్తున్నారు. అయితే వీటిపై వైసీపీ నుంచి ఎటువంటి స్పందన లేదు.

Tags:    

Similar News