ఎన్నికల ప్రచారానికి ఈ ముగ్గురు ఎందుకు దూరంగా ఉన్నారు?
ఏపీ బీజేపీలో ఆ ముగ్గురు నేతలు ఎన్నికల ప్రచారంలో కానరాకుండా పోయారు. సీట్లు దక్కక పోవడమే కారణమా?
Byline : G.P Venkateswarlu
Update: 2024-05-09 08:39 GMT
భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ముఖ్యమైన నాయకులు నెల రోజులుగా ఎక్కడా కన్పించడంలేదు.. మాట్లాడటంలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు విలేకరులతో మాట్లాడుతూ హడావుడి చేయడం దేశంలో అత్యధిక మేజార్టీతో తిరిగి బీజేపీ వస్తుందని చెప్పుకుంటూ ముందకు సాగారు. ఆ ముగ్గురు ఈ రాష్ట్రంలో సీట్లు ఆశించారు. వారికి ఈ ఎన్నికల్లో సీట్లు దక్కలేదు. అసంతృప్తికి గురైన వీరు ప్రధాని మోదీ సభల వద్ద కూడా కన్పించడంలేదు. ఆ ముగ్గురు ఎవరనుకుంటున్నారా? బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నర్సింహారావు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్‌రెడ్డి.
అధ్యక్షరాలితో సోముకు సఖ్యతలేదా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో సఖ్యతలేకపోవడం వల్లే ఆ ముగ్గురు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నట్టు సమాచారం. అధికార ప్రతిపక్షాలపైకి ఒంటికాలిపై లేచే జీవీఎల్ నర్శింహారావు, సోము వీర్రాజులు కిమ్మనకపోవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీకి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ పదవులు కూడా దక్కాయి. ఎమ్మెల్సీ అయిన సోము వీర్రాజు మూడేళ్లపాటు తెలుగుదేశం పార్టీ మంచి పరిపాలన అందించిందన్నారు. 2019 జరిగిన ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చెప్పట్టిన సోము వీర్రాజు మాటలో మార్పు వచ్చింది. అధికారపార్టీపై పోరాటం చేయాల్సిన సోము పవర్‌లేని ప్రతిపక్షమైన టీడీపీని టార్గెట్ చేశాడు. చంద్రబాబు పాలన అంతా అవినీతి మయమని గగ్గోలు పెట్టాడు. ఆ తర్వాత 2024 ఎన్నికలకు ఆరు నెలలకు ముందు దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ పెద్దలు అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అప్పటి నుంచి సోము వీర్రాజు కన్పించడం మానేశాడు. ప్రస్తుత ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్తిగా పోటీ చేస్తున్న పురందేశ్వరి అక్కడ సోము వీర్రాజు ఏర్పాటు చేసిన పార్టీ ఆఫీసు కాకుండా సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు, పురందేశ్వరి మధ్య ఉన్న విబేధాల వల్లే వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేలా దారితీశాయని చెబుతున్నారు. సోము వీర్రాజుకు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా పురందేశ్వరి అడ్డుపడ్డారనే వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే సోము పార్టీ కార్యక్రమాలు మినహా దగ్గుబాటి పురందేశ్వరి నిర్వహించే కార్యక్రమాలను దూరంగా ఉండటం గమనర్హం.
కన్పించని జీవీఎల్..
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీఎల్ నర్శింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈయన కూడా టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. విశాఖపట్నంపై ప్రత్యేక పోకస్ పెట్టారు. విశాఖ ఎంపీ టిక్కెట్ కోసం జీవీఎల్ చేయని ప్రయత్నం లేదు. ఏడాది ముందు విశాఖ కేంద్రంగా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆయనకు బీజేపీ ఎంపీ టిక్కెట్ వస్తుందనే ప్రచారం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ఆ సీటు బీజేపీకి కాకుండా టీడీపీకి దక్కింది. టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్‌ను ఎంపీగా ప్రకటించింది. బీజేపీలో విశాఖ నుంచి జీవీఎల్ కీలకంగా మారితే కేంద్ర స్థాయిలో తన పట్టు తప్పుతుందనే భయంతోనే పురందేశ్వరి తన బావ చంద్రబాబుతో చెప్పి ఆ సీటు టీడీపీకి దక్కేలా చక్రం తిప్పారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యలోనే జీవీఎల్ సైతం పురందేశ్వరి నాయకత్వంలోని పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.
ఏపీలో కూటమి అవకాశమే లేదన్న విష్ణువర్థన్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలతో బీజేపీ కూటమి కట్టే అవకాశమే లేదని విష్ణువర్థన్‌రెడ్డి చాలాసార్లు చెప్పారు. ఏపీలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేస్తుందని పలుమార్లు ప్రకటించారు. ఈయన అనంతపురం జిల్లాలో ఏదో ఒక చోట సీటు ఇస్తే పోటీ చేయాలని ఆశపడ్డారు. పార్టీ ఆయనకు సీటు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది. కనీస ఓటు బ్యాంకు కూడా లేదని, అటువంటప్పుడు సీటు ఇచ్చి పార్టీ అబాసుపాలు కావడం ఎందుకని ఆ పార్టీ పెద్దలు భావించినట్టు సమాచారం. ఈయనకు సీటు దక్కకపోవడంతో ఎన్నికల వ్యవహరంలో కన్పించడం లేదనే చర్చ సాగుతోంది.
వారి మౌనం.. వైసీపీకి అనుకూలం..
సోము వీర్రాజు, జీవీఎల్ నర్శింహారావు, విష్ణువర్థన్‌రెడ్డి ముగ్గురు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసినవారే. అధికార వైఎస్సార్‌సీపీపై ఎప్పుడూ పెద్దగా విమర్శలు చేయలేదు. బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి రాజకీయంగా తన బావ చంద్రబాబును కలుపుకొని దూకుడు పెంచి ఎన్నికల వైఎస్సార్‌సీపీని ఎండగడుతుండటంతో ఈ ముగ్గురు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్టు బీజేపీలోనే చర్చ సాగుతోంది. వీరి మౌనం ఒక రకంగా వైఎస్సార్‌సీపీకే అనుకూలమనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.