కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా? మీ మదం తగ్గిస్తా! చంద్రబాబు వార్నింగ్
వివేకాను మీరు చంపి నన్ను'నారా సురడంటారా'? మదం పట్టి కొవ్వెక్కి చస్తున్నారా? కొవ్వు తగ్గిస్తా, ఏ ముసుగులో ఉన్నా విడిచే ప్రసక్తే లేదని చంద్రబాబు హెచ్చరించారు.
By : The Federal
Update: 2024-11-07 10:18 GMT
"హు కిల్డ్ బాబాయ్" అని ఊరూవాడా చెప్పిన టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డల జోలికొస్తే వదిలే ప్రసక్తే లేదన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమార్తెలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్లను వదిలిపెట్టాలా? ఏరీపారెస్తామని హెచ్చరించారు. అసలింతకీ చంద్రబాబుకి ఇంత కోపం ఎందుకొచ్చిందీ?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నవంబర్ 6న జరిగిన మంత్రిమండలి సమావేశంలో తన కూతుళ్లపై పెట్టిన అసభ్యకర పోస్టుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి మంత్రులందరూ చలించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన నవంబర్ 7న తుళ్లూరు మండలం తాళాయపాలెంలో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయమై రెచ్చిపోయారు. తీవ్ర స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా బాధ్యులపైనా, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పైనా విరుచుకుపడ్డారు.
ఆయన ఏమన్నారంటే "ఆడబిడ్డలు జోలికి వస్తే మిమ్మల్ని (వైసీపీ) వదిలి పెట్టే ప్రసక్తే లేదు. వైసీపీ సోషల్ మీడియా సైకోలు ఏ ముసుగులో ఉన్నా.. వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. వైసీపీ లాంటి పార్టీలో ఉండే వారి ఇళ్లలోని ఆడబిడ్డలూ ఈ తరహా పోస్ట్‌లు పెట్టే వారిని ప్రశ్నించాలి. మదం, కొవ్వు ఎక్కి కొంత మంది సోషల్ మీడియాలో అసభ్యకర పోస్ట్‌లు పెడుతున్నారు. నా కుటుంబ సభ్యులతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమార్తెలపై సైతం అభ్యంతరకర పోస్టులు పెట్టారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బాధపడ్డారు. ఇటువంటి పోస్ట్‌లు పెట్టిన వాళ్ళును వదిలి పెట్టాలా?"
వైసీపీ వాళ్ల సొంత పత్రిక సాక్షి. ఆ పేరిట పత్రిక ప్రతి రోజు అసత్యా కథనాలు రాస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు.. సాక్షి పత్రికలో ఏ కథనం వెలువడిందో అందరికీ తెలుసునన్నారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికి హత్య చేసి.. తనపై వాళ్ల పత్రికలో "నారా సుర రక్త చరిత్ర" అంటూ రాశారని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.
"మమ్మల్ని మానసికంగా దెబ్బ తీసేందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అందుకు కారణమైన వారినెవ్వరిని వదిలి పెట్టే ప్రసక్తే లేదు. నాతో ఆడుకోవాలని చూడొద్దు. అలా చేస్తే ఎవరిని వదిలి పెట్టను. కొవ్వు ఎక్కిన వారి కొవ్వు తగ్గిస్తా. పోలీస్ వ్యవస్థ సైతం ఆలోచించుకోవాలి. నేరస్తుల కంటే మీరు అప్పర్ హ్యాండ్‌లో ఉండాలి" అన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగా ఉండాలని తాను మరోసారి చెబుతున్నానని పోలీసులకు స్పష్టం చేశారు. బావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే ఎవరిపైనా అయినా మీ ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతారా? అంటూ వైసీపీ కేడర్‌ను సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
అసభ్యకరపోస్టులు ఎవరెవరిపైన...
గత ప్రభుత్వ హయాంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డి.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్ నేత వంగలపూడి అనితపై తీవ్ర అభ్యంతరక పోస్టులు పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై జుగుఫ్సాకర పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఆ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డిని కడపలోని చిన్న చౌక్ పోలీసులు మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. అంతలో స్థానిక ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. దీంతో 41 ఏ నోటీసులు ఇచ్చి రవీందర్ రెడ్డిని వదిలి వేశారు. అయితే ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో రవీందర్ రెడ్డిపై పోలీసు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రొద్దుటూరు పోలీసులు సైతం రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు చిన్న చౌక్ పీఎస్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రవీందర్ రెడ్డిని విడిచి పెట్టేయడంతో.. ఈ వ్యవహారం పోలీసుల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతోపాటు సీఐలపై ప్రభుత్వం బదిలీ వేటు పడింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.