ఈ ఆరుగురు మహిళల్లో పార్లమెంటుకు వెళ్లేదెవరు?

తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా, పార్లమెంటులో మాత్రం వారి ప్రాతినిధ్యం పెరగడం లేదు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మహిళల ప్రాతినిధ్యం అంతంతమాత్రమే.

By :  Admin
Update: 2024-04-05 13:24 GMT

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌, నిజామాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌,మహబూబాబాద్‌, ఖమ్మం,ఆదిలాబాద్, పెద్దపల్లి,నల్గొండ, భువనగిరి, వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయినా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆరుగురు మహిళా అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. గత పార్లమెంటులో తెలంగాణ లోని మహబూబాబాద్ స్థానం నుంచి మాలోతు కవిత ఒక్కరే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు మహిళలు ఎంపీలుగా ఉన్నారు. తెలంగాణలోని మెదక్ నుంచి ఇందిరాగాంధీ ఎన్నికయ్యారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరికి రాజ్యసభలో అవకాశం కల్పించింది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు నోటిఫికేషన్ వెలువడినా ఇంకా ఆ బిల్లు అమలు కాకపోవడంతో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందటం లేదు.

- 17 పార్లమెంట్ స్థానాల్లో ఆరు సీట్లలో మహిళలు ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ముగ్గురు మహిళలకు టికెట్లు కేటాయించింది.
- బీజేపీ పార్టీ తెలంగాణలో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దించింది. మరో వైపు బీఆర్ఎస్ ఒక మహిళా సిట్టింగ్ అభ్యర్థికి పార్టీ టికెట్ ఇచ్చింది.
- మహిళా ఓటర్లు సగభాగం కంటే అధికంగా ఉన్నా, కేవలం ఆరుగురు మహిళలే ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 3,30,00,088 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,64,10,227 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య 1,65,87,134 ఉన్నారు.
- తెలంగాణ నుంచి పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి),డీకే అరుణ(మహబూబ్ నగర్), ఆత్రం సుగుణ (ఆదిలాబాద్), డాక్టర్ కడియం కావ్య(వరంగల్),మాలోతు కవిత (మహబూబాబాద్), కొంపెల్ల మాధవీలత (హైదరాబాద్) పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో నిలచిన ఆరుగురు మహిళా అభ్యర్థుల్లో పార్లమెంటుకు వెళ్లే వారెవరో ఓటరు తీర్పు ఇవ్వనున్నారు.

భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చిన సునీతా
తన భర్త, సీనియర్ రాజకీయ నాయకుడైన పట్నం మహేందర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాల్లోకి వచ్చిన సునీతా మహేందర్ రెడ్డి మొట్టమొదటిసారి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా ఎన్నికల బరిలోకి దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా పనిచేసిన సునీతకు పరిపాలన అనుభవం ఉంది. గ్రాడ్యుయేషన్ చేసిన సునీతా మొదట తెలుగుదేశంపార్టీలో, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. తాజాగా తన భర్త ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరి అనూహ్యంగా ఎంపీ అభ్యర్థినిగా రంగంలోకి దిగారు.

పాలమూరు బరిలో దిగిన డీకే అరుణ
మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థినిగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణ పోటీ చేస్తున్నారు. భర్త డీకే భరత్ సింహారెడ్డిది రాజకీయ కుటుంబం కావడంతో అరుణ జడ్‌పీ‌టీసీగా రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం గద్వాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి, వైఎస్సార్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. బీజేపీలో సీనియర్ నాయకురాలైన డీకే అరుణ ఎంపీ బరిలో నిలిచారు.

ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన సుగుణ
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా ఉపాధ్యాయురాలైన ఆత్రం సుగుణ మొదటి సారి రాజకీయాల్లో చేరి పోటీ చేస్తున్నారు. బీఏ,బీఈడీ చదివిన సుగుణ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. సుగుణ భర్త భుజంగరావు మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన సుగుణ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు.

సామాజిక సేవ నుంచి రాజకీయాల్లోకి డాక్టర్ కడియం కావ్య
వరంగల్ ఎంపీ స్థానం నుంచి పీజీ వైద్యురాలైన కడియం కావ్య బరిలోకి దిగారు. ఈమెకు బీఆర్ఎస్ ఎంపీ పార్టీ టికెట్ ఇచ్చినా దాన్ని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొని ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. తన తండ్రి మాజీ ఎంపీ, మాజీమంత్రి కడియం శ్రీహరి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కడియం కావ్య ట్రస్టును ఏర్పాటు చేసి పాఠశాల బాలికలకు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయడంతోపాటు బాలికల ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. డాక్టర్ కావ్య సామాజిక సేవల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు.

తండ్రి రెడ్యానాయక్ రాజకీయ వారసురాలిగా మాలోతు కవిత
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ అభ్యర్థిని అయిన మాలోతు కవిత మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థినిగా పార్లమెంట్ బరిలోకి దిగారు. తన తండ్రి రెడ్యానాయక్ నుంచి వచ్చిన రాజకీయ వారసత్వంతో మాలోతు కవిత గతంలో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి ఒక టర్మ్ ఎంపీగా పనిచేశారు. వ్యాపారం ఉన్న కవిత మరోసారి ఓటర్ల తీర్పు కోసం ముందుకు వచ్చారు.

హైదరాబాద్ బరిలో కొంపెల్ల మాధవీలత
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మహిళా పారిశ్రామికవేత్త అయిన కొంపెల్లి మాధవీలత మొట్టమొదటి సారి ఎన్నికల బరిలోకి దిగారు. పీజీ వరకు చదివి హైదరాబాద్ నగరంలో విరించి హాస్పిటల్ చైర్మన్ గా ఉన్న మాధవీలత రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. సామాజిక కార్యకర్తగా, హిందూ సంస్కృతిపై ప్రసంగాలు చేసిన అనుభవం ఉన్న మాధవీలత అలా బీజేపీలో చేరి...ఇలా హైదరాబాద్ ఎంపీ టికెట్ ను కైవసం చేసుకున్నారు. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో వై నాట్ హైదరాబాద్ అంటూ బీజేపీ నేతలు సీనియర్లను కాదని కొత్త అభ్యర్థిని అయిన మాధవీలతను ఎన్నికల బరిలోకి దించారు. హిందూ ఓట్లను ఏకీకృతం చేయడం ద్వారా విజయం సాధించవచ్చనే ఆత్మవిశ్వాసంతో మాధవీలత ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు.

13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం
తెలంగాణ రాష్ట్రంలో 13 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన జాబితా వెల్లడించింది. కరీంనగర్‌ పార్లమెంట్ నియోజకవర్గంలో 9,14.332 మంది, నిజామాబాద్‌ లో 8,90,411మంది, జహీరాబాద్‌లో 8,33,849, మెదక్‌ లో 9,18,027, మహబూబ్‌నగర్‌లో 8,48,293, నాగర్‌కర్నూల్‌లో 8,70,694,మహబూబాబాద్‌ లో 8,80,316, ఖమ్మంలో 8,40,006,ఆదిలాబాద్ లో 8,41,250, పెద్దపల్లిలో 8,05,755,నల్గొండలో 8,76,538, భువనగిరిలో 9,04250 మంది, వరంగల్‌ పార్లమెంటు నియోజకవర్లంలో 9,23,541మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ 13 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా అన్నీ స్థానాల్లో మహిళా అభ్యర్థులను రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దించలేదు.

మహిళా ఓటర్లపై రాజకీయ పార్టీల దృష్టి
తెలంగాణలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మహిళా ఓట్ల కోసం యత్నిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అమలు చేసింది. తెలంగాణలో ముగ్గురు మహిళలకు కాంగ్రెస్ ఎంపీ టికెట్లు కేటాయించింది. మరో వైపు బీఆర్ఎస్ కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు హామీలు గుప్పిస్తోంది. బీజేపీ కూడా మహిళలకు రాజకీయాల్లోనూ 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో తీసుకువచ్చిన చట్టాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మూడు ప్రధాన పార్టీలు మహిళల ఓట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓట్లు ఏ పార్టీకి పడబోతున్నాయి. ఎన్నికల బరిలో నిలచిన ఆరుగురు మహిళల్లో ఎంత మంది విజయ తీరాలకు చేరుతారనేది జూన్ 4వతేదీ ఓట్ల లెక్కింపు పర్వం దాకా వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News