ఏపీ విభజన చట్టం హామీలు తీర్చెదెన్నడు?  

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం కింద విభజన హామీలిచ్చి జూన్ 2వతేదీ నాటికిపదేళ్లు గడచింది.అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను మోదీ నెరవేర్చలేదు.

Update: 2024-05-31 13:19 GMT

అది 2014వ సంవత్సరం ఫిబ్రవరి 18వతేదీన భారత లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 బిల్లును అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ బిల్లు ఫిబ్రవరి 20వతేదీన రాజ్యసభలో ఆమోదించారు.ఈ బిల్లును అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మార్చి 1వతేదీన ధృవీకరించి,మార్చి2న అధికారిక గెజిట్‌లో ప్రచురించారు.దీంతో ఈ చట్టం ప్రకారం 2014 జూన్2వతేదీన తెలంగాణ ఆవిర్భవించింది.

- ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమం ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా పార్లమెంట్ విభజించింది. భారత పార్లమెంటు చట్టం రెండు రాష్ట్రాల సరిహద్దులను నిర్దేశించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇంకా అందని ద్రాక్షగా మారింది. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నిధులు విడుదల చేయలేదు.
- ఈ చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులను ఎలా విభజించాలో నిర్ణయించింది .కొత్త తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ను శాశ్వత రాజధానిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా హోదాను నిర్దేశించింది.
- ‘‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను దాదాపు నెరవేర్చాం’’ అంటూ గతంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఈ ప్రకటనపై తెలంగాణ నేతలు,ప్రజలు మండిపడుతున్నారు.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదేళ్లు పూర్తి అయినా విభజన హామీలు మాత్రం నెరవేరలేదు.
- విభజన హామీల్లో గిరిజన విశ్వవిద్యాలయం ఒక్కటే నెరవేర్చారు. ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ యూనివర్శిటీ కోసం 331 ఎకరాలను, తాత్కాలిక వసతి కోసం భవనాలను కేటాయించింది.

31 సార్లు సంప్రదింపులు జరిపినా...
కేంద్రం మధ్యవర్తిగా ఉంటూ పలు అంశాలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో 31 సార్లు సమీక్షలు జరిపామని పార్లమెంట్‌లోనే కేంద్రం పేర్కొంది.రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో జరిపిన తాత్కాలిక నదీ జలాల కేటాయింపులనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు సగం వాటా రావాలని పోరాడుతున్నా కేంద్రం పరిష్కారం చూపించలేదు.

రెండు రాష్ట్రాల మధ్య సంస్థల విభజన ఏది?
విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9,10 లోని రెండురాష్ట్రాల మధ్య సంస్థల విభజన పదేళ్లు అయినా త్రిశంకు స్వర్గంలోనే ఉంది.కేంద్ర ప్రభుత్వం చర్చలు,కమిటీల పేరిట కాలయాపనలు తప్ప జరిగిందేమీ లేదని తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
తెలంగాణ నిధులు ఏపీకి బదలాయింపు
2014-15వ సంవత్సరంలో తెలంగాణకు రావాల్సిన సీఎస్‌ఎస్‌ నిధులు రూ.495 కోట్లను కేంద్రం పొరబాటున ఏపీకి బదలాయించింది. వాటిని వెనక్కి ఇప్పించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. రూ.500 కోట్లే వెనక్కి తేలేనివారు వందల సార్లు సమీక్షలు, సంప్రదింపులు చేసినా ఫలితం ఏముందని రాగిడి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటు ఏది?
తెలంగాణ పురోగతి కోసం ఖమ్మంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని కేంద్రం స్పష్టంగా విభజన చట్టంలో పేర్కొంది.పదేళ్లు గడచినా స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటులో ఇంతవరకు ఎలాంటి ముందడుగు పడలేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి, తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించాలని కోరుతూ తాను పార్లమెంటులో పలుసార్లు ప్రస్థావించినా కేంద్రం నుంచి స్పందన లేదని ప్రస్థుత ఖమ్మం సిట్టింగ్ ఎంపీ, పార్లమెంటులో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. విభజన హామీలను నెరవేర్చాలని తాను పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించినా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ఆయన ఆరోపించారు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు
తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450 కోట్లు ఇస్తామని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది.ఈ హామి ఇచ్చి పదేళ్లు గడచినా కేవలం నాలుగేళ్లకు మాత్రమే నిధులు ఇచ్చింది.ఇంకా 2014-15, 2019-20, 2021-22, 2022-23కు సంబంధించిన ఐదేండ్ల నిధులు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ హామి మర్చారు...
కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని పెడతామని కేంద్రం స్వయంగా విభజన చట్టంలో హామీ ఇచ్చింది.ఈ హామీని తొమ్మిదేళ్లు నానబెట్టి చివరికి రైల్వే వ్యాగన్‌ ఉత్పత్తికి కేంద్రం అంగీకరించింది. ఇటీవల ప్రధాని మోదీ కాజీపేటలో వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.

తెలంగాణ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏది?
తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుకుగానీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకుగానీ జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు కోరినా కేంద్రం నుంచి ఫలితం లేదు.

నీళ్లు,నిధులు,నియామకాలు అందేదెన్నడు?
నీళ్లు,నిధులు,నియామకాలు…ఃఇవే ప్రధాన ఎజెండాలుగా యావత్ తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఆవిర్భావంతో మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు మనకే దక్కుతాయని, మన వనరులు మనమే పూర్తిగా సద్వినియోగం చేసుకోవచ్చని నాలుగు కోట్ల మంది ప్రజలు ఎంతో ఆశపడ్డారు.సబ్బండ వర్ణాల పోరాటం,అమరుల త్యాగ ఫలంతో 2014 జూన్ 2 న ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది.పదేళ్లు అయినా తెలంగాణ ప్రజల ఆశలు నెరవేరలేదు.తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు అయిన సందర్భంగా తెలంగాణలో ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కారు హయాంలో నైనా తమ ఆశలు నెరవేర్చాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.


Tags:    

Similar News