సూళ్లూరుపేటలో ఈసారి ఎవరి సుడి తిరుగుతుందో!

సుళ్ళూరుపేట ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక గెలుపు ఎవరిదో అంచనా వేయడం కాస్తతంత కష్టంగానే ఉంది. అందుకు కారణాలేంటంటే..

Update: 2024-04-13 12:55 GMT

సూళ్లూరుపేట ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఉండేది. ఇప్పుడు తిరుపతి జిల్లాలోకి మారిపోయింది. జిల్లా మారినా పరిస్థితుల్లో మాత్రం మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మా బతుకులింతే అని నియోజకవర్గ ప్రజలు ఎందుకంటున్నారు? సూళ్లూరుపేటలో రాజకీయ, సామాజిక, ఆర్థిక, ప్రజల జీవన పరిస్థితుల ముఖచిత్రం ఇలా ఉంది..సూళ్లూరుపేట నియోజకవర్గంలోనే శ్రీహరికోట ఉంది. ఇక్కడే భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఉంది. 1962లో సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇప్పటికి 12 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, వైసీపీ 2 సార్లు విజయం సాధించాయి.

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2 లక్షల 31 వేల 638 మంది ఉన్నారు. మహిళలు 1 లక్షా 17 వేల 850 మంది ఉంటే, పురుషులు 1 లక్షా 13 వేల 736 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కిలివేటి సంజీవయ్య గెలుపొందారు. వైసీపీకి 1 లక్షా 19 వేల 627 ఓట్లు వస్తే, టీడీపీ అభ్యర్థి పరస వెంకటరత్నయ్యకు 58 వేల 335 ఓట్లు వచ్చాయి. దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలుపొందింది.

నియోజకవర్గంలో ఎస్సీలు అధికంగా ఉంటారు, తర్వాత బీసీలు, ఆ తర్వాత ఓసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికి రెడ్ల పెత్తనం ఎక్కువ. గెలిచిన ఎమ్మెల్యేలు వారి కనుసన్నల్లోనే ఉంటారు. ఇక 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పదికి పది సీట్లు వైసీపీ గెలుపొంది క్లీన్ స్వీప్ చేసింది. గతంలో ఇక్కడ నుండి గెలుపొందిన పసల పెంచలయ్య, పరస వెంకటరత్నయ్య గెలుపొంది మంత్రులయ్యారు. కానీ నియోజకవర్గానికి చేసింది శూన్యమనే విమర్శలైతే ఉన్నాయి.

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారత అంతరిక్ష కేంద్రం శ్రీహరికోట, ఈ నియోజకవర్గంలోనే ఉంది. భారతదేశానికి అవసరమయ్యే టెక్నాలజీ పరంగా, ఇంకా అంతరిక్ష పరిశోధనల నిమిత్తం రకరకాల దేశ, విదేశీ రాకెట్లను షార్ కేంద్రం నుండి నింగిలోకి పంపుతూ ఉంటారు. ఇటీవల ఇక్కడ నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో భారతదేశం పేరు ప్రపంచమంతా మార్మోగిపోయింది. రాకెట్ లాంచింగ్ సమయంలో శ్రీహరికోట కళకళలాడుతూ ఉంటుంది. వేలాదిమంది ప్రజలు అక్కడకు చేరుకుని రాకెట్ లాంచింగ్‌ను వీక్షిస్తుంటారు.

భారతదేశానికే ప్రతిష్టాత్మకమైన… ఇస్రో... సూళ్లురుపేటలో ఉండటం ఇక్కడి వారందరికీ గర్వకారణమని చెప్పాలి. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ప్రముఖ పర్యాటక కేంద్రం పులికాట్ సరస్సూ ఇక్కడే ఉంది. అలాగే నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం ఉంది. శీతాకాలంలో విదేశ పక్షులు ఇక్కడికి వస్తుంటాయి. ఎందుకంటే వారి దేశాలన్నీ విపరీతమైన మంచుతో నిండిపోయి ఉండటంతో ఆహారం దొరక్క బృందాలుగా ఏర్పడి మన దేశానికి వస్తూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ అతిథుల రాకను గుర్తించి ప్రతి ఏడాది పక్షుల పండుగను నిర్వహిస్తోంది. సూళ్లూరుపేట పట్టణంలో కాళంగి నది ఒడ్డున 5 వ శతాబ్దంలో నిర్మించిన చెంగాలమ్మ తల్లి ఆలయం ఉంది. ఆంధ్రా-తమిళనాడు నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వస్తే తమ ఆదాయం రెండింతలు అవుతుందని భక్తులు విశ్వసిస్తారు.

రాజకీయ నాయకులు, పార్టీలు అధికారం కోసం పాకులాడటమే కానీ, ఇక్కడ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. గత పదేళ్లుగా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. ఒకవైపున శ్రీహరికోట, మరోవైపు పారిశ్రామిక వాడ శ్రీ సిటీ అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో అన్నచందంగానే సూళ్లూరు పేట మారింది. సూళ్లూరుపేటలో వరుసగా రెండు దఫాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలవుతున్నారు. దేశానికి మంచి పట్టున్న నియోజకవర్గంగా పేరుంది. అయితే పరస వెంకటరత్నయ్యకు ఇక్కడ నుంచి ఆరు సార్లు అధిష్టానం అవకాశమిచ్చింది. అయితే ఆయన మూడు సార్లు విజయం సాధించారు. ఒకసారి మంత్రి కూడా అయ్యారు.

ప్రస్తుతం చంద్రబాబు సర్వేలు చేసిన ఫలితంగా అభ్యర్థిని మార్చారు. నెలవల విజయశ్రీకి ఇచ్చారు. చంద్రబాబు చెబుతున్నట్టు యువత, మహిళలకు పెద్ద పీట వేశారని నాయకులు చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఆస్థాన విద్వాంసుడిగా మారిన పరస వెంకటరత్నయ్య ఈ మార్పుని అంగీకరించలేకపోతున్నారు. దాంతో పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇవి చల్లార్చడానికి అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ప్రస్తుతం ఫలించడం లేదు.

గ్రూపు తగాదాలు మామూలేనా?

అధికార పార్టీ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన కిలివేటి సంజీవయ్య పరిస్థితి కూడా నియోజకవర్గంలో అంత ఆశాజనకంగా లేదు. తనకి అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నలిగిపోతున్నారు. మూడోసారి అతనికి సీటు ఇవ్వడాన్ని పార్టీలో కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. పార్టీ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ముందే రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. దీంతో వైసీపీలో కూడా తెలుగుదేశం పార్టీ తరహాలాగే మారింది. ప్రస్తుతం రెండు పార్టీల్లో కూడా రెండేసి వర్గాలు తయారయ్యాయి. ఎవరు గెలుపు కోసం సహకరిస్తారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

తమిళనాడుకు దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దశాబ్దాలుగా తాగునీటి సమస్య తీరలేదు. అటు చంద్రబాబు, ఇటు జగనన్న పరిపాలనలో కూడా మంచినీటి సమస్య తీరలేదని ప్రజలు వాపోతున్నారు. ఎవరొచ్చినా మాకు నీళ్లు కావాలి. అవిస్తేనే ఓటు వేస్తామని అంటున్నారు. ఇకపోతే సూళ్లూరు పేట పట్టణవాసులు డ్రైనేజీ సమస్యలతో అల్లాడుతున్నారు. డ్రైవర్ కాలనీ అంతా డ్రైనేజీ కాలనీగా మారిపోయింది. డ్రైనేజీ కోసం కాలువ తవ్వి ఐదేళ్లుగా అలా వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికలప్పుడు నాయకులు వస్తున్నారు. మురుగు కాల్వల నుంచి కాపాడమని ప్రజలు వేడుకుంటున్నారు. వారు అరచేతిలో చూపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం కాలువ కడతామని అక్కడ తవ్వి వదిలేశారు. అది అలాగే ఉండిపోయింది. ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. డంపింగ్ యార్డు ఒకటి ఊరికి దరిద్రంగా మారింది. మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెచ్చి ఇక్కడ జాతీయ రహదారి పక్కనే వేసేస్తున్నారు. 15 ఏళ్లుగా డంపింగ్ యార్డు దుర్గంధంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆ దుర్వాసన ఊరంతా వ్యాపిస్తూ ఉంటుంది. వర్షాకాలమైతే చెప్పలేం. దీని కారణంగా అంటు రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు.

దేశంలోనే పేరుపొందిన పారిశ్రామిక ప్రాంతం శ్రీ సిటీ ఇక్కడే ఉంది. అక్కడ కూడా సమస్యల కుప్పగా మారిపోయింది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో విలవిల్లాడుతోంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే సూళ్లూరుపేటకు అక్షరాలా సరిపోతుంది. గొప్పగా చెప్పుకోవడానికి తప్ప నియోజకవర్గానికి ఒరిగింది శూన్యం. దేశ విదేశాల నుంచి ప్రముఖులు శ్రీహరికోటకు వస్తుంటారు. వారు ఈ దారిలోంచే, ఈ దుర్గంధాల మధ్య నుంచే వెళుతుంటారు. శ్రీ సిటీకి కూడా ప్రముఖ వ్యాపారాలు వస్తుంటారు. వారి పరిస్థితి అంతే. ఇలాంటివి ఉన్నచోట సూళ్లూరు పేట ఎలా ఉండాలి? అద్దంలా మెరిసిపోవాలని అంటున్నారు. మరి నాయకులేమిటో? ఆ పార్టీలేమిటో, వాళ్లు చెప్పే గొప్పలేమిటో? సూళ్లూరుపేట చూస్తున్న వారికి బోధపడదు. ప్రజల్లో మార్పు రానంతవరకు రాజకీయ పార్టీలు, నేతల్లో మార్పులు రావని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags:    

Similar News