ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి కేటాయిస్తారు?

ఏపీలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు. ఆ రెండు స్థానాలు సీఎం చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ.

Update: 2024-06-19 14:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో మొన్నటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీమ్‌లో ఎవరికి చోటు దక్కుతుంది, ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు, ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశాలు ప్రస్తుతం పాతపడగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీలుగా ఎవరికి అవకాశం కల్పిస్తారు, టీడీపీ నేతలకే చాన్స్‌ ఇస్తారా, లేక కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీ నాయకులకు అవకాశం కల్పిస్తారా అనేవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇవి రెండు ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అయినవే. ఇద్దరు ఎమ్మెల్సీలు 2024 ఎన్నికలకు ముందు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన సీ రామచంద్రయ్య ఆ పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో ఆయనపై మార్చి 11న అనర్హత వేటు పడింది. అదేవిధంగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మరో నేత, మాజీ ఐపీఎస్‌ అధికారి ఇక్బాల్‌ తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక్బాల్‌ రాజీనామాను శాసనమండలి చైర్మన్‌ మోషేను రాజు ఏప్రిల్‌ 5న ఆమోదించారు. ఈ నేపథ్యంలో సీ రామచంద్రయ్య, ఇక్బాల్‌ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాస్తవంగా 2027 మార్చి 29 వరకు వీరి ఇరువురి పదవీ కాలం ఉంది. ఈ నెల 25న దీనికి సంబంధించి ఉప ఎన్నికల ప్రకటన వెలువడనుంది. నాటి నుంచి జూలై 2వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 5వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. జూలై 12న ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని నాలుగు రాష్ట్రాల పరిధిలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జూలై 12న కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ఆ మేరకు మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఏపీలో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. తమ ఎమ్మెల్సీ పదవులను సైతం లెక్క చేయకుండా, జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహార శైలి నచ్చక, వైఎస్‌ఆర్‌సీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సీ రామచంద్రయ్య, ఇక్బాల్‌కే తిరిగి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తమకు ఎమ్మెల్సీలుగా తిరిగి అవకాశం కల్పిస్తేనే టీడీపీలో చేరుతామనే ఒప్పందంతోనే టీడీపీలోకి వచ్చారని, దీంతో వారికే ఆ స్థానాలు దక్కుతాయనే వాదన కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
మరో వైపు మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆ పార్టీ సీనియర్‌ నేతలు నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, టీడీపీలో అత్యంత కీలక నేత మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్, ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో టికెట్లు దక్కని పలువురు సీనియర్‌ నేతలు కూడా ఆశావాహుల జాబితాలో ఉన్నారనే టాక్‌ కూడా ఆ పార్టీలో వినిపిస్తోంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించి, సీట్ల సర్థుబాటులో ఎలాంటి భేషజాలకు పోకుండా తక్కువ సీట్లతో సర్థుకున్న జనసేనకు, మరో కూటమి భాగస్వామి అయిన బీజేపీకి చెరోకటి కేటాయిస్తారా? అనే అంశం కూడా చర్చగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది కూటమి భాగస్వాముల్లో ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News