రాజమండ్రి రాజు ఎవరు?

రాజమండ్రిలో తప్పని త్రిముఖ పోటీ. ఎన్డీఏ తరఫున పురందేశ్వరీ..బీసీకి చెందిన శ్రీనివాసులు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి.. కాంగ్రెస్‌ నుంచి రుద్రరాజు బరిలోకి దిగారు.

Update: 2024-04-13 10:09 GMT

జి విజయ కుమార్

రాజమండ్రి పార్లమెంట్‌ స్థానం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంతో మంది మహామహులు పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కులాలకు అతీతంగా రాజమండ్రి పార్లమెంట్‌ వాసులు నాయకులను తమ అక్కున చేర్చుకున్నారు. ఇక్కడ నుంచి కాపులు.. కమ్మలు.. బ్రాహ్మణులు గెలుపొందారు. 2024లో జరగనున్న ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈ పార్లమెంట్‌ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. 2019లో ఐదు అసెంబ్లీ స్థానాల్లో
వైఎస్‌ఆర్‌సీపీ గెలవగా రాజమండ్రి రూరల్, సీటీల నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2024 ఎన్నికల్లో ఇది కాస్తా తారుమారయ్యే అవకాశాలున్నాయి. రాజమండ్రి సిటీ, రూరల్‌ వైఎస్‌ఆర్‌సీపీకి అంతగా అనుకూల వాతావరణం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే గతంలో గెలిచిన ఐదు నియోజక వర్గాల్లోను మూడు నియోజక వర్గాల్లో టీడీపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ నియోజక వర్గాలు గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచింది. ఈ రెండు నియోజక వర్గాలు ఎస్సీ రిజర్వుడు. ఈ నియోజక వర్గాల్లో పేరుకు మాత్రమే ఎస్సీ ఎమ్మెల్యేలు పని చేస్తారు. పెత్తనం మాత్రం కమ్మ సామాజిక వర్గం నుంచి ఉంటుంది. నిడదవోలులో గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలిచినప్పటికీ ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదనేది స్థానికుల మాట. ఇలా ప్రతి నియోజక వర్గంలోను పోటా పోటీగా ఉంది. ఎన్నికల ప్రచారం కూడా ఊపందుకుంది.
వ్యూహం మార్చిన పురందేశ్వరి
రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ మద్ధతుతో గతంలో రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచింది. తిరిగి ఇప్పుడు టీడీపీ మద్ధతు ఉండటం వల్ల పురందేశ్వరీకే కాలం కలిసొస్తుందనే ప్రచారం సాగుతోంది. అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం, నియోజక వర్గాల్లో కమ్మ సామాజిక వర్గం డామినేషన్‌ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అనపర్తి నియోజక వర్గంలో బిజెపీకి సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సీటును పొత్తులో బిజెపీకి కేటాయించారు. ఒక మాజీ సిపాయికి బిజెపీ టికెట్‌ ఇచ్చింది. దీంతో టీడీపీ నుంచి తిరుగుబాటు మొదలైనట్లు సమాచారం. అందుకని పురందేశ్వరి వ్యూహం మార్చారు. ఈ సీటును టీడీపీకే కేటాయించి గతంలో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన రామకృష్ణారెడ్డికే సీటు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మర్పు వల్ల బిజెపీకి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి సీటును కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
రాజమండ్రి పార్లమెంట్‌ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గూడూరు శ్రీనివాస్‌ పోటీకి దిగారు. ఈయన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. గత ఎన్నికల్లో గౌడ్‌ సామాజిక వర్గానికి చెందిన మార్గాని భరత్‌ను గెలిపించుకున్న వైఎస్‌ఆర్‌సీపీ ఈ సారి కూడా బిసీ అయిన శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని గెలిపించి చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంతో డాక్టర్‌ శ్రీనివాసులును సీఎం వైఎస్‌ జగన్‌ రంగంలోకి దించారు. వైద్యుడుగా ఆయనకు మంచి పేరు ఉంది. రాజకీయాలలో మాత్రం ఆయనకు ఓనమాలు తెలియవు. మరి రాజమండ్రి పార్లమెంట్‌లో ఈ డాక్టర్‌ వైద్యం రాజకీయానికి సరిపోతుందా.. తన వైపునకు పార్లమెంట్‌ ప్రజలను తిప్పుకోగలరా అనేది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ.
కాంగ్రెస్‌ నుంచి గిడుగు
కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు రంగంలోకి దిగారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ను విసిరేసిన ఏపీ ప్రజలు పదేళ్ల తర్వాత జరగుతున్న ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ను ఆదరిస్తారా అనేది వేచి చూడాలి. రుద్రరాజు అమలాపురం వాసి. ఈయన కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. అంటే రాజమండ్రి పార్లమెంట్‌ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీల నుంచి బిసీ అభ్యర్థులు పోటీ చేస్తుంటే.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరీ ఎన్డీఏ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. గత ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని గెలిపించిన చరిత్ర రాజమండ్రి పార్లమెంట్‌కు ఉంది. ఎస్సీ, ఎస్టీలు మినహా ఓసీ, బీసీలకు ఈ పార్లమెంట్‌ ఇప్పటి వరకు ఆదరణ కల్పించింది.
ముగ్గురి మధ్య తీవ్ర పోటీ జరిగే అవకాశముంది
పురందేశ్వరిని బిజెపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే అక్కడి ఓటర్లు భావిస్తున్నారనడంలో సందేహం లేదు. ఈమెది ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామం. అయితే ఎన్టీఆర్‌ కుమార్తె కావడం.. కాంగ్రెస్‌ పార్టీలో కేంద్ర మంత్రిగా పని చేయడం.. ప్రస్తుతం బిజెపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉండటం వల్ల రాష్ట్ర ప్రజలకు నోట్లో నాలుకున్న వ్యక్తిగా ఉన్నారు. గెలుపు ఓటములను పరిశీలించినప్పడు గెలుపు ఎన్డీఏ వైపే ఓటర్లు మొగ్గు చూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Tags:    

Similar News