కురుపాం గిరిజన గురుకులంలో విషాదానికి బాధ్యులు ఎవరు?
85 మంది గురుకుల విద్యార్థినులు కామెర్ల బారిన పడ్డారు. ఇద్దరు మృతి చెందారు. 28 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ఇందుకు ప్రభుత్వ సమాధానం ఏమిటి?
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కలుషిత త్రాగునీరు వల్ల జాండిస్ (పచ్చ కామెర్లు) వ్యాప్తి చెందడంతో 85 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రోజు రోజుకు వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరుగోతంది. గత వారం వ్యవధిలోనే 10వ తరగతి విద్యార్థినులైన అంజలి, కల్పన ప్రాణాలు కోల్పోగా, మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వీరిని పరిశీలించేందుకు మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆదివారం ఆస్పత్రిని సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంఘటనపై స్పందించి విచారణకు ఆదేశించారు. ఇది కేవలం వైద్య సంక్షోభం కాదు. గిరిజన పిల్లల విద్య, ఆరోగ్య, సంక్షేమంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి.
తాగు నీరు కలుషితానికి కారకులు ఎవరు?
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఈ గురుకుల పాఠశాలలో 200కి పైగా గిరిజన బాలికలు చదువుతున్నారు. రెండు వారాలుగా విద్యార్థినుల్లో జ్వరం, వాంతులు, కడుపు నొప్పి, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి జాండిస్ లక్షణాలు కనిపించడంతో ఆందోళన వ్యక్తమైంది. మొత్తం 85 మంది విద్యార్థినులు ఈ వ్యాధికి గురయ్యారు. వారిలో 38 మంది తీవ్రంగా బాధపడుతున్నారు. గత వారంలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థినులు అంజలి (16), కల్పన (15) చికిత్స లోపంతో మృతి చెందారు. జులై 2024 నుంచి ఈ జిల్లాలో 11 మంది గిరిజన విద్యార్థులు వివిధ ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయారు.
ఆర్వో ప్లాంటు ఎందుకు మూల పడింది?
వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రధాన కారణం కలుషిత నీరు తాగటం. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 'నాడు-నేడు' పథకం కింద ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు ఇప్పుడు పనికి రాకుండా పోయాయి. రెండు నెలలుగా మెయింటెనెన్స్ లేకపోవడంతో విద్యార్థినులు వర్షపు నీటితో కలిసిన బోర్‌వెల్ నీటిని తాగుతున్నారు. పాఠశాలలో శానిటేషన్ సరిగా లేదు. పోషకాహారం అందటం లేదు. వైద్య సిబ్బంది లేకపోవడం మరో సమస్య. ఆదివారం కురుపాం గ్రామంలో నీటి నమూనాలు సేకరించి, విద్యార్థులకు రక్త పరీక్షలు చేస్తున్నారు. పెడియాట్రిక్ వైద్య బృందం పరిశోధనలో ఈ వ్యాధి కలుషిత నీటి వల్లే బ్యాక్టీరియా వ్యాపించిందని నిర్ధారించింది.
47 మంది విద్యార్థినుల పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం 19 మంది విద్యార్థినులు పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర పరిస్థితిలో ఉన్న 28 మందిని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. వారి క్రియాటినిన్, యూరియా లెవల్స్ అధికంగా ఉండటంతో డయాలసిస్ చేస్తున్నారు. ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ "విద్యార్థినుల పరిస్థితి మెరుగుపడుతోంది, కానీ మూల కారణాన్ని గుర్తించాలి" అని తెలిపారు.
తల్లిదండ్రుల తీవ్ర నిరసన
సంఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రులు పాఠశాల ముందు నిరసనకు దిగారు. అధికారులను కట్టివేసి, "మా పిల్లల ప్రాణాలకు రక్షణ ఇవ్వండి" అని డిమాండ్ చేశారు. ఆక్రూపకుమారి (అంజలి తల్లి) మాట్లాడుతూ, "పాఠశాలలో మంచి నీళ్లు, అన్నం లేదు. మంత్రులు వచ్చి పరిశీలిస్తారు కానీ సమస్యలు పరిష్కరించరు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీ గుమ్మ థనుజ రాణి, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వ తీరును, అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పు పట్టారు. "కూటమి ప్రభుత్వం 15 నెలల్లో గిరిజన పాఠశాలలను మరణ కారిడార్‌గా మార్చింది" అని ఆరోపించారు.
విద్యార్థులు చనిపోయినా గిరిజన మంత్రికి పట్టదా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, కురుపాం సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. "ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. విద్యార్థినులకు అత్యుత్తమ చికిత్స కల్పించండి. సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించండి" అని ఆదేశించారు. ఈ సమావేశంలో మహిళా, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని పరిస్థితిని వివరించారు.
మంత్రి సంధ్యారాణి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినులను సందర్శించి, అవసర వైద్య సహాయం కల్పించేలా ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పార్వతీపురం ఆసుపత్రిలో చేరిన విద్యార్థినుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. "గిరిజన బాలికల ఆరోగ్యం మా మొదటి ప్రాధాన్యత. అన్ని అవసర చర్యలు తీసుకుంటాం" అని మంత్రి సంధ్యారాణి తెలిపారు.
ఈ మంత్రులకు చీమకుట్టినట్లు కూడా లేదు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్ లు సంఘటన గురించి వివరాలు తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు గిరిజన ప్రాంతాల అభివృద్ధి బాధ్యతలు తీసుకున్నప్పటికీ గిరిజనుల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్‌కు ఈ విషయంలో కీలక పాత్ర ఉండాలి. గతంలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనల్లో (జూలై 2025) ఆయన చికిత్స ఏర్పాట్లు చేశారు కానీ, ఈసారి ఆయన స్పందన సరిగా లేదని, గిరిజన ప్రాంతాలపై ఉప ముఖ్యమంత్రికి ఉన్న ఆలోచన వైద్య రంగంపై ఆ శాఖ మంత్రికి లేదనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.
విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడానికి కారకులు ఎవరు?
ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విద్యా వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసింది. 90 శాతం ఐటీడీఏ పాఠశాలల్లో సురక్షితమైన తాగు నీరు లేదు. గత ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్లు 'కూటమి' పాలనలో నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదు, రాష్ట్ర స్పాన్సర్డ్ నిర్లక్ష్యమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జులై 2024 నుంచి ఈ జిల్లాలో 11 మంది విద్యార్థులు కేవలం అనారోగ్య కారణాలతో మరణించడం ఆందోళనకరం. ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ దీని ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది ప్రశ్నార్థకం. గిరిజన ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు, వైద్య సిబ్బంది నియామకం, మంచినీటి సరఫరా మెరుగుపరచడం అత్యవసరం. లేకపోతే మరిన్ని విషాదాలు తప్పవు.
ప్రభుత్వానికి పెద్ద దెబ్బ
రాజకీయంగా ఈ సంఘటన కూటమి ప్రభుత్వానికి పెద్ద దెబ్బ. వైఎస్ఆర్‌సీపీ పాలనలో ప్రారంభమైన 'నాడు-నేడు' పథకం ఇప్పుడు విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం మెయింటెనెన్స్ బాధ్యతలు విస్మరించడం వల్ల సమస్యలు పెరిగాయి. ఆర్థికంగా 2025 ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖకు రూ. 155.97 కోట్లు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ కోసం కేటాయించారు. ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ఈ నిధుల కేటాయింపు జరిగింది. ఇది సానుకూల అడుగు, కానీ ఇలాంటి సంఘటనల తర్వాతే ఫండింగ్ పెరగడం వ్యవస్థాగత లోపాలను సూచిస్తుంది. కేంద్రంలోనూ 2025-26 బడ్జెట్‌లో ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి 45.79 శాతం పెంచి రూ. 14,925.81 కోట్లు కేటాయించారు. ఎడ్యుకేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషియో-ఎకనామిక్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు. కానీ ఈ ఫండ్స్ గ్రౌండ్ లెవల్‌లో సక్రమంగా వినియోగం జరగటం లేదని ఈ సంఘటన నిరూపిస్తోంది.
గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ విఫలం
గిరిజన సమాజాన్ని సామాజిక, విద్యా, వైద్యం, ఆర్థికంగా ఎదుగుదల కోసం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ శాఖ వాస్తవంలో విఫలమైంది. కేంద్ర స్థాయిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య సమస్యలు (కలుషిత నీరు, పోషకాహార లోపం) పునరావృతమవుతున్నాయి. ఏకలవ్య గురుకులాల్లో సాధారణ రాష్ట్ర గురుకులాల కంటే నిధులు ఎక్కువ ఇస్తారు. మెనూ భిన్నంగా ఉంటుంది. అయినా అక్కడ కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల తీరు గిరిజన బాలికల భవిష్యత్తును దెబ్బతీసింది. నిలువునా ప్రాణాలు పోయేలా చేసింది. ఎందుకంటే వారు ఇప్పటికే సమాజంలో వెనుకబడిన వర్గాలు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే మానిటరింగ్ సిస్టమ్స్, రెగ్యులర్ ఆడిట్స్, కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగే అవకాశం పెద్దగా ఉండేది కాదు. తమ రాజకీయ అవసరాలు తీరితే చాలని పాలకులు అనుకుంటే గిరిజన సమాజం మరింత నష్టపోతుంది.
గురుకులం అంటేనే ఇల్లు లాంటిది... మరి అక్కడే ఈ పరిస్థితి ఉంటే ఎలా...?
గురుకులం అంటే హాస్టల్ వార్డెన్, వాచ్ మెన్, వంట మనుషులు, స్వీపర్లు ఉంటారు. వీరు ఇంట్లో ఎటువంటి కార్యకలాపాలు జరుపుకుంటామో అదే విధంగా చూస్తారు. మరి వీరంతా ఏమి చేస్తున్నారు. ఇద్దరు చనిపోయే వరు, వాంతులు, విరోచనాలు అవుతున్నా వీరెందుకు పట్టించుకోలేదు. రెసిడెన్సియల్ స్కూలు కాబట్టి విద్యార్థులు తాగే నీటినే ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది కూడా తాగాలి. వారెందుకు ఈ నీరు తాగటం లేదు. పిల్లలకు మాత్రమే మంచి నీరు అందకుండా వారికి ఎలా అందుతోంది? ఎంత దౌర్బాగ్య పరిస్థితి.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాధ్యత ఇంతేనా?
పైగా విజయనగరం జిల్లాలకు చెందిన గిరిజన మంత్రి విద్యార్థుల బాగోగులపై నిత్యం పర్యవేక్షణ చూపాల్సింది పోయి ముఖ్యమంత్రి కలుగ జేసుకుని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలని చెప్పే వరకు మంత్రి వెళ్లలేదంటే సమాజానికి ఏమని సందేశం ఇస్తున్నారు. మంత్రి గారు ఉదయం సాయంత్రం పరిశుభ్రత పాటిస్తే సరిపోతుందా? విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకంగా మారాల్సిన వారు, వారి గురించి కనీసం పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.