ఏపీ నెక్ట్స్ డీజీపీ ఎవరు? సీనియరా? జూనియరా?
ఈ నెలాఖరు నాటికి ప్రస్తుత డీజీపీ ద్వారకాతిరుతమలరావు పదవీ విరమణ చేయనున్నారు.;
By : Admin
Update: 2025-01-23 06:13 GMT
ఆంధ్రప్రదేశ్ నూతన పోలీసు బాస్ ఎవరు అనేది అటు పోలీసు వర్గాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ఈ నెలఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త బాస్ ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. రేస్‌లో ముగ్గురు అధికారులు పోటీలో ఉన్నట్లు సమాచారం. అయితే సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకొని డీజీపీని నియమిస్తారా? తమకు ఇష్టం వచ్చిన వారిని డీజీపీని చేస్తారా? అనేది కూడా ఆసక్తి కరంగా మారింది.
తొలి సారి సీనియారిటీని బేస్ చేసుకొని నీరభ్‌కుమార్ ప్రసాద్, ద్వారకా తిరుమలరావులను, సీఎస్, డీజీపీలగా నియమించిన కూటమి ప్రభుత్వం రెండో సారి దానిని పట్టించుకోలేదు. సీఎస్ నియామకంలో సీనియారినీ తుంగలో తొక్కొరు. జూనియర్ అయిన అధికారికి సీఎస్ పదవి కట్టబెట్టారు. ఆరుగురు సీరియన్ అధికారులను కాదని తర్వాత స్థానంలో ఉన్న కే విజయానంద్‌ను తీసుకొచ్చి సీఎస్ చైర్‌లో కూర్చో పెట్టారు.
డీజీపీ నియామకంలో కూడా ఇదే జరగొచ్చనే టాక్ పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీనియారిటీలో అందరి కంటే ప్రథమ స్థానంలో ఉన్న 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఈ నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. దీంతో నూతన డీజీపీని నియమించాల్సి ఉంది. ద్వారకా తిరుమలరావు తర్వాత సీనియారిటీ స్థానంలో మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నారు. ఈయన 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్నారు. తర్వాత స్థానంలో హరీష్‌కుమార్ గుప్తా ఉన్నారు. ఈయన 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఈయన డీజీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత పీ సీతారామాంజనేయులు ఉన్నారు. ఈయన కూడా 1992వ బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి.
సీతారామాంజనేయులు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు సినీ నటి కాదంబరి జెత్వాని కేసులో కూడా ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీతారామాంజనేయులకు డీజీపీగా కష్టమే. ఇక మిగిలింది మాదిరెడ్డి ప్రతాప్, హరీష్‌కుమార్ గుప్తా. వీరిద్దరిలో హరీష్ కుమార్ గుప్తా వైపే కూటమి సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో కూడా ఈయన డీజీగా వ్యవహరించారు. ఎన్నికల్లో కూటమికి సహకరించారనే సానుకూల దృక్పథం కూడా కూటమి పెద్దలకు ఉంది. డీజీపీ కావడానికి ఇది కలిసొచ్చే అంశంగా చర్చించుకుంటున్నారు.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను పక్కన పెట్టి ద్వారకా తిరుమలరావును డీజీగా నియమించారు. సీనియారిటీలో తొలి స్థానంలో ఉన్న మాదిరెడ్డి ప్రతాప్ తెలుగు అధికారి అయినప్పటికీ, ఉత్తరాదికి చెందిన హరీష్ కుమార్ గుప్తా వైపే కూటమి సర్కార్ మొగ్గు చూపుతుందనే టాక్ ఉంది. ఈయన అయితే తమకు అనుకూలంగా ఉంటారని, రెడ్ బుక్ అమలు సులువు అవుతుందని భావిస్తున్నారు.