ఏపీలో బెట్టింగ్‌ ముఠా గుట్టు రట్టు.. ఎక్కడంటే?

ఏపీలో బెట్టింగ్‌ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. యాప్‌ సాయంతో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

Update: 2024-10-17 16:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో భారీ బెట్టింగ్‌ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గుట్టుగా నిర్వహిస్తున్న ఈ దందాను విశాఖపట్నం పోలీసులు బట్టయలు చేశారు. యాప్‌ ద్వారా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ దందాలో ఇప్పటి వరకు ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి వందల సంఖ్యలో డెబిట్‌ కార్డులు, బ్యాంకు చెక్‌ బుక్‌లు, 10 ల్యాప్‌ టాప్‌లు, 8 డెస్క్‌ టాప్‌లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఒక కారును, మరో బైకును స్వాధీనం చేసుకున్నారు.

విశాఖ పోలీస్‌ కమిషనర్‌ ఈ దందా వివరాలను వెల్లడించారు. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాల్‌ సెంటర్‌ ముసుగులో సైబర్‌ నేరాల కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఎవ్వరికీ అనుమానాలు రాకుండా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం వన్‌ టౌన్‌లో ఈ దందా నడుస్తోంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించడంతో నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్జీ తెలిపారు. ఈ ముఠా సభ్యులకు చైనాతో సంబంధాలున్నాయని, వివిధ రకాల పేర్లతో బెట్టింగ్‌ యాప్‌లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆర్బీఐ అనుమతి లేకుండానే బెట్టింగ్‌ యాప్‌ నిర్వహిస్తున్నారని, బెట్టింగ్‌ ద్వారా వచ్చిన సొమ్మును చైనా, తైవాన్‌ దేశాలకు చేరవేస్తున్నారని సీపీ తెలిపారు. దాదాపు 800 ఖాతాలతో వీరు లావాదేవీలు నిర్వహిస్తున్నారని వివరించారు. 
Tags:    

Similar News