సత్తెనపల్లిలోని మాజీ మంత్రి అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయం బోసిపోయింది. ఎప్పుడూ జనంతో కళకళలాడుతూ కనిపించిన కార్యాలయం గురువారం ఒక్కసారిగా ఉస్సురుమంటూ కనిపిస్తోంది. కార్యాలయానికి తాళం వేశారు. పార్టీ కం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించే ఈ కార్యాలయానికి ఇప్పటి వరకు తాళం వేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కరు కూడా మంత్రిగారి క్యాంపు కార్యాలయానికి వచ్చే సాహసం చేయలేదు. ఆయన కార్యాలయానికి కాస్త దూరంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు అక్కడక్కడా తిరుగుతూ ఎవరైనా మంత్రి గారి క్యాంపు కార్యాలయానికి రాకపోతారా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు వీరు ఎదురు చూస్తున్నారని ఆరా తీస్తే... అవసరమైతే తగాదా పెట్టుకునేందుకు వచ్చారనేది చుట్టుపక్కల వారు చెబుతున్న మాట. ఇదంతా ఎందుకనుకున్న రాంబాబు సర్థుకున్నారు. అక్కడ ఎవ్వరి కంటా పడకుండ గుంటూరుకు చేరుకున్నారు. ఉన్నట్లుండి ఒక్కసారిగా మంత్రి గారితో పాటు ఆయన అనుచర గణం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వాతావారణం కనిపిస్తోంది. మంత్రులు ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారని ఆరా తీస్తే ఎవరి ఇంట్లో వారు ఉన్నారు. అత్యంత సన్నిహితులను రక్షణగా పెట్టుకుని కూర్చున్నారు. ఒక విధంగా తన ఇంట్లో తానే దాక్కున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పైగా నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు ఎవరైనా కనిపిస్తే హేళనగా మాట్లాడుతున్నారు. కొందరు వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఇంతకు మునుపెన్నడూ రాష్ట్రంలో లేవు. కానీ ఈ ఎన్నికల తరువాత కూడా తెలుగుదేశం కార్యకర్తల్లో గుండె లోతుల్లో నుంచి ఆగ్రహావేశాలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ముగ్గురికి పైన చర్చ మొదలైందంటే వాదనలు కూడా చెలరేగుతున్నాయి.
మండల కేంద్రాల్లో ఉన్న సాక్షి విలేకరుల సరిస్థితి పెనం పై నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా వీరిని ఈక ముక్కలా చూశారు వైఎస్సార్‌సీపీ నాయకులు. అధికారం పోయిన తరువాత తెలుగుదేశం, జనసేన అనుకూలురు బాగా జరిగిందా? అంటూ అవమానంగా మాట్లాడటం చూడటాన్ని గ్రామీణ విలేకరులు కూడా తట్టుకోలేకపోతున్నారు. ఒక విలేకరి ది ఫెడరల్ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సార్ బయటకు వెళ్లటం లేదని మాట్లాడారు. ఎందుకు ఒంట్లో బాగోలేదా అని నేను కాస్త అమాయకంగా మాట్లాడాను. అటువంటిదేమీ లేదు సార్ బయటకు వెళ్లి అవమాన పడేకంటే ఇంట్లోనే ఉండటం మంచిదని, అందుకే కదలటం లేదని తన బాధనను వ్యక్తం చేశారు. మంత్రి గారి కార్యాలయం పరిస్థితి ఏమిటని తెలుసుకునేందుకు ఫెడరల్ ప్రతినిధి ఫోన్ చేయగా ఆ విలేకరి బాధ చెప్పనలవి కాకుండా ఉంది. ఆ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలోని అన్ని మండలాల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయని చెప్పక తప్పదు.
ఎందుకీ పరిస్థితి?
మాజీ మంత్రి అంబటి రాంబాబు మంత్రి పదవిని సరదాగా తీసుకున్నారు తప్ప సీరియస్‌గా తీసుకోలేదనే విమర్శ ఉంది. నీటి నిల్వకు, పారుదలకు మధ్య తేడా ఏమిటనేది కూడా మంత్రికి తెలియదని పలువురు ఎద్దేవా చేయడం విశేషం. మంత్రిగారి నియోజకవర్గంలో చిన్న పని కూడా చేయించిన దాఖలాలు లేవు. అవన్నీ పెద్దలు చూసుకుంటారు మనకెందుకబ్బా అంటూ దాట వేసే వారని స్థానిక కార్యకర్తలు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి కూడా కనీస శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవనేది కూడా జనంలో ఉన్న విమర్శ. అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతుంటే నృత్యాలు, చిందులు వేసే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనటం ఆశ్చర్యాన్ని కలిగించిందని నీటి పారుదల రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. గురజాల నియోజకవర్గానికి కాసు మహేష్ రెడ్డి తీసుకొచ్చిన నిధులు కూడా తీసుకురాలేకపోయారనే విమర్శ ఉందంటే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నియోజకవర్గ ప్రజలు ఎంత వ్యతిరేకతతో ఉన్నారో అర్థమవుతోంది.
ఆళ్ల నానిదీ ఇదే పరిస్థితి
ఇవే పరిస్థితులు మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ ప్రసాద్ (నాని) ఇంటి వద్ద కూడా ఉన్నాయి. మొదటి నుంచీ ఈయన జనంతో కలిసే వారు కాదనే విమర్శ ఉంది. అందులో నిజం కూడా లేకపోలేదు. కనీసం వచ్చిన వారిని పలకరించి కూర్చోమని కూడా చెప్పేవాడు కాదనే విమర్శ ఉంది. ప్రస్తుతం ఈయన కూడా ఒక విధంగా తనకు తాను గృహ నిర్బంధంలో ఉన్న పరిస్థితిని తెచ్చుకున్నారు. బయటకు వస్తే ఎక్కడ దాడులు జరుగుతాయోననే భయాందోళలో నానీ ఉన్నారు. గుంటూరు వెస్ట్‌లో పోటీ చేసిన విడదల రజినీ పరిస్థితి కూడా ఇదే. చుట్టూ రక్షణగా తన వారు తప్ప ఓడిన వారిని ఓదారుద్దామని వచ్చే వారు కూడా ఇంటి వద్ద కనిపించలేదు. ఎవరు తనవారో ఎవరు పరాయి వారో తెలుసుకోలేని స్థితిలో ఉన్న మాజీ మంత్రులు ఎవరైనా ఇంటి వద్దకు వచ్చారంటే పనేంటో కనుక్కోమని, అక్కడి నుంచి వెనక్కి పంపిస్తున్నారు. పలకరిద్దామని వచ్చామని చెప్పినా వినటం లేదు. తర్వాత కలుద్దాం వెళ్లండంటూ పంపిస్తున్నారు. అలా కాకుండా కొందరు అసలు మంత్రుల క్యాంపు కార్యాలయా వద్ద నుంచి పూర్తిగా నిష్క్రమించారు. ఎప్పుడూ ఈ మంత్రుల ఇండ్ల ముందు, రోడ్ల వెంట బారులు తీరిన కార్లు ఒక్కసారిగా మాయమయ్యాయి. జనం కూడా ఒక్కసారిగా మాయమయ్యారు.
స్వీయ రక్షణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వీయ రక్షణలో ఉన్నారు. ఎవరికి వారు తమకు ఎప్పుడు ఎటువంటి హాని జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమకు రక్షణ పెంచాలంటూ డీజీపీని వేడుకుంటున్నారు. ఐదేళ్ల కాలంలో మంత్రులుగా ఉన్న వీరు ప్రజల మన్ననలను ఎందుకు చూరగొనలేకపోయారనేది కూడా చర్చకు దారి తీసింది. అన్నీ తన చేతుల్లో పెట్టుకుని నేను చూసుకుంటానని చెప్పిన అపద్దర్మ ముఖ్యమంత్రి సైతం ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు ఎదురవుతున్న అవమానాలు చూసీ చూడనట్లు వదిలేశారు.
జగన్ ఇంటి వద్ద కూడా తగ్గిన సందడి...
కొందరు నేతలు ఓడినా... గెలిచినా వారి ఇంటి వద్ద ఎప్పుడూ జనం ఉంటూనే ఉంటారు. ఎందుకంటే జనానికి వారంటే నమ్మకం. వారు ఏ అధికారికి చెప్పినా పనులు జరుగుతాయనే విశ్వాసం. అందుకే ఎప్పుడూ వారిని నమ్ముకుని ఉంటారు. జగన్ సీఎంగా ఉన్నన్ని రోజులు క్యాంపు కార్యాలయం వద్ద ఒక్క రోజు కూడా నేరుగా జనాన్ని కలిసిన సందర్భాలు లేవు. అర్జీలు తీసుకునేందుకు కట్టకింది భాగాన ఒక రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఆ షెడ్డు వద్ద గ్రిల్స్‌కు లోపలివైపున ఉన్న వారికి అర్జీ అందించి వెళ్లాలి. పైగా ఆ అర్జీ తీసుకుని అక్కడికి చేరాలంటే పోలీసుల నుంచి నానా ఇబ్బందులు, పలు రకాల చెకింగ్‌లు ఉండేవి. ఇప్పుడు అక్కడ అర్జీ ఇచ్చే వారు కాదు కదా.. మామూలుగా ఎప్పుడూ సీఎం కార్యాలయానికి వచ్చే అధికారులు కూడా కనిపించకపోవడం విశేషం.