అమరావతి రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యేదెప్పుడు?
ఏపీ రాజధాని అమరావతికి భూములు లిచ్చిన రైతులకు చేయాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. 25,186 ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉంది.
Byline : G.P Venkateswarlu
Update: 2024-07-08 04:21 GMT
అమరావతికి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు జరగాల్సిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ప్రభుత్వం సకాలంలో తన పనిని తాను పూర్తి చేయలేకపోయింది. భూములు తీసుకుని ఏడేళ్లు గడిచినా ఇంకా రిజిస్ట్రేషన్‌లు చేసి ఇవ్వలేక పోయిందంటే ఇందులో ఎవరి తప్పు ఎంత ఉందో అర్థం అవుతుంది. భూములు ఇచ్చిన రైతులకు కమర్శియల్ ప్లాట్లు కొన్ని, రెసిడెన్సియల్ ప్లాట్లు కొన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్లాట్లు మాత్రం వేశారు. ఇంకా రోడ్లు, ఇతర అభివృద్ధి జరగలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కనీసం భూమి రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయలేకపోయింది. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడుదల చేసిన స్వేతపత్రంలో పేర్కొన్నారు.
అమరావతిలో రిజిస్ట్రేషన్‌లు జరగాల్సిన రైతుల ప్లాట్లు 25,186
రాజధాని అమరావతిలో పూలింగ్ భూముల పరిధి 217 చదరపు కిలో మీటర్లు ఉంది. మొత్తం 53,748 ఎకరాల్లో రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద 34,281 ఎకరాలు ప్రభుత్వం సేకరించింది. ఇందులో 33,836 ఎకరాల భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉన్నాయి. ఇంకా రైతుల నుంచి 4,300 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఈ భూములకు సంబంధించి రైతులకు నివాస ప్రాంత ప్లాట్లు 37,479, వాణిజ్య సముదాయ ప్లాట్లు 25,931 ప్లాట్లు కలిపి మొత్తం 63,410 పాట్లు రైతులకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలి. ఈ ప్లాట్లలో 22,592 నివాస ప్రాంత ప్లాట్లను 15,632 వాణిజ్య ప్లాట్లను ఇప్పటి వరకు రైతులకు రిజిస్ట్రేషన్‌లు చేయించి ఇచ్చారు. మొత్తంగా 38,224 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యాయి. ఇంకా 25,186 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు జరగాల్సి ఉంది. కొందరు రైతులు కోర్టుల్లో కేసులు వేశారు. ఆ కేసులను వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. భూ సమీకరణకు సమ్మతిస్తూ కొందరు రైతులు భూమిని ఇవ్వడంతో పాటు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని కొందరు రైతులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ఇటీవల చెప్పారు.
రిజిస్ట్రేషన్‌లకు సానుకూలంగా సీఎంను కలిసిన రైతులు
అమరావతికి భూములు ఇచ్చిన రైతులు 1,631 రోజులు పోరాటం నిర్వహించారు. అమరావతిని రాజధానిగా చేయడం లేదని వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రకటించారు. కేవలం లెజిస్లేటివ్ రాజధానిగా మాత్రమే ఉంటుందని చెప్పారు. దీంతో ఆందోళనకు దిగిరి రైతులు సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆందోళన వివిధ రూపాల్లో కొనసాగించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు వెంటనే చేయించుకుంటామని రైతులు ముందుకు వస్తున్నారు. త్వరలోనే ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ల కార్యక్రమం పూర్తవుతుందని ముఖ్యమంత్రి స్వేతపత్రంలో పేర్కొన్నారు.
ప్లాట్ల అభివృద్ధికి రూ. 16,071 కోట్లు
పాట్లు అభివృద్ది చేసేందుకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కోర్టు కేసులు పూర్తయి, ప్లాట్ల మధ్య రహదారులు, డ్రైనేజీలు, ఇతర పనులు పూర్తయ్యే సరికి కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వేసిన 63,410 ప్లాట్లను అభివృద్ధి చేయాలంటే రూ. 16,071 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2019 నాటికి అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ. 410.73 కోట్లు ఖర్చు చేసింది. కొన్ని చోట్ల వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో రహదారుల ఫార్మేషన్ జరిగింది. అయితే తిరిగి అవన్నీ కనిపించకుండా చదునయ్యాయి. ఈ ఐదు వందల కోట్లు కూడా మట్టిపాలైనట్లేనని చెప్పొచ్చు. ప్లాన్ ప్రకారం ప్లాట్ల రాళ్లు, రోడ్లు ఫార్మేషన్ చేసిన ప్రాంతాలు వెతికి ఒక దారికి అధికారులు తీసుకొస్తున్నట్లు స్వేతపత్రంలో సీఎం పేర్కొన్నారు.