హైడ్రా ఏర్పాటుకు అసలు కారణమిదేనా ?
వివాదంలో ఉన్న భూములను గ్యారెంటీగా తీసుకోవటానికి ఏ బ్యాంకు కూడా అంగీకరించదు.
కొద్దిరోజులుగా తెలంగాణాలో హైడ్రా చుట్టే రాజకీయలు తిరుగుతున్నాయి. ఆక్రమణలు తొలగించటం, కబ్జాల్లో ఉన్న చెరువులు, కుంటలను హైడ్రా తొలగించి తిరిగి వాటన్నింటినీ ప్రభుత్వం పరిధిలోకి తీసుకొస్తుండటమే ఇన్ని సంచలనాలకు కారణమవుతోంది. కబ్జాలు, ఆక్రమణలు అందులోను చెరువులు, కుంటలను కూడా అక్రమిస్తున్నారంటే ఆక్రమణలదారుల వెనుక రాజకీయనేతల మద్దతుంటుందనటంలో సందేహంలేదు. ఆక్రమణల తొలగింపు, చెరువులు, కుంటలను తిరిగి స్వాధీనం చేసుకోవటం వరకు ఓకే మంచిదే. గతంలో చెరువులు, కుంటల ఆక్రమణల విషయంలో కోర్టులు ఇచ్చిన ఆదేశాలే ఇపుడు హైడ్రా చర్యలకు దన్నుగా నిలుస్తున్నది. కాబట్టి కబ్జాలకు క్లియర్ చేయాలని అనుకుంటున్న హైడ్రాకు కోర్టు కూడా మద్దతుగా నిలుస్తుంది. జన్వాడలో కేటీఆర్ ఫాంహౌస్ జోలికి హైడ్రా రాకుండా బిల్డర్ ప్రదీప్ రెడ్డి వేసిన కేసును హైకోర్టు కొట్టేయటం హైడ్రాకు నైతిక మద్దతు ఇచ్చినట్లయ్యింది.
ఇదంతా బాగానే ఉంది అసలు హైడ్రా ఏర్పాటు చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ? ఆక్రమణలు, కబ్జాలు ఇపుడు కొత్తగా మొదలుపెట్టిందేమీ కాదు. దశాబ్దాలుగా అధికారుల మద్దతుతో రాజకీయనేతల దన్నుతో ఇవన్నీ జరుగుతున్నవని అందరికీ తెలుసు. అలాంటిది ఇపుడు మాత్రమే ఆక్రమణల తొలగింపుకు కొత్తగా రేవంత్ హైడ్రాను ఎందుకు ఏర్పాటుచేసినట్లు ? ఎందుకంటే దీనికి సమాధానం మూసీ నది సుందరీకరణ అనేచెప్పాలి. మురికికూపం అయిపోయిన మూసీనదిని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. దీనికయ్యే వేల కోట్లరూపాయలను అప్పుగా ఇవ్వటానికి ప్రపంచబ్యాంకు, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. అయితే అప్పిచ్చేవారు షరతులు పెట్టడం సహజమే కదా ? అదే పద్దతిలో తామిచ్చే రుణాలకు గ్యారెంటీ చూపించాలని షరతు విధించాయని సమాచారం.
అందుకనే మూసీకి రెండువైపులా ఆక్రమణలను క్లియర్ చేస్తే ప్రభుత్వ స్వాధీనమయ్యే భూములనే తనఖా పెట్టాలని రేవంత్ ఆలోచించారు. ఎందుకంటే వివాదంలో ఉన్న భూములను గ్యారెంటీగా తీసుకోవటానికి ఏ బ్యాంకు కూడా అంగీకరించదు. తన ఆలోచన ఆచరణలోకి రావాలంటే ముందు ఆక్రమణలు క్లియర్ కావాలి. ప్రభుత్వ లెక్కప్రకారం మూసీనదికి రెండువైపులా 56 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. అలాగే వేలాది నిర్మాణాలు అక్రమంగా వెలిశాయి. అక్రమనిర్మాణాలను, కబ్జాలకు గురైన చెరువులను క్లియర్ చేసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాదాపు 120 కోట్ల చదరపు అడుగుల భూమి అందుబాటులోకి వస్తుంది. ఆక్రమణలు తొలగించి సుందీరకరణ పనులు మొదలైతే భూముల ధరలు ఆకాశాన్ని దాటిపోవటం ఖాయం. అప్పుడు బ్యాంకులు అడిగినట్లుగా ప్రభుత్వ భూమినే గ్యారెంటీగా పెట్టవచ్చు.
ఎలాగూ మూసీకి రెండువైపులా ఉన్న చెరువుల ఆక్రమణలను క్లియర్ చేయాలని అనుకున్నారు కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులను కబ్జాల్లో నుండి బయటకు తీసుకురావాలని రేవంత్ అనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమిటంటే ఫ్యూచర్ సిటి(ఫోర్త్ సిటి) ఏర్పాటు విషయంలో కూడా కబ్జాల్లో ఉన్న భూములు, ఆక్రమణల్లో ఉన్న చెరువులు క్లియర్ అయి తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం అవుతాయి. అప్పుడు ఫోర్త్ సిటీ ఏర్పాటుకు అవసరమైతే ఈ భూములను ఉపయోగించుకోవచ్చు. కుత్బుల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఆక్రమణల్లో ఉన్న వేలాది చెరువులు, కబ్జాల్లో ఉన్న వందలాది ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారు.
రేవంత్ ఆలోచన ప్రకారం ఇదంతా జరగాలంటే ఇపుడున్న రేవిన్యు, మున్సిపాలిటి, ఇరిగేషన్ శాఖలతో అయ్యేపనికాదు. అందుకనే తగినంత పోలీసు అధికారులు, సిబ్బందిని ఇచ్చి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాధ్ ను కమీషనర్ గా నియమిస్తు రేవంత్ హైడ్రాను ఏర్పాటుచేశారు.
ఆక్రమణలు, కబ్జాల క్లియరెన్సులో రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయని రేవంత్ కు బాగా తెలుసు. ఒత్తిళ్ళని తట్టుకుని కబ్జాలు, ఆక్రమణలను క్లియర్ చేయగలిగితే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫోర్త్ సిటి ఏర్పాటుతో తన పేరు తెలంగాణాలో చిరస్ధాయిగా నిలిచిపోతుందని రేవంత్ డిసైడ్ అయ్యారు. హైడ్రా ద్వారా మాత్రమే ప్రభుత్వానికి వేలాది ఎకరాలు తిరిగి స్వాధీనం అవుతాయని రేవంత్ అంచనా వేసుకున్నారు. అందుకనే భవిష్యత్తు ఇమేజిని దృష్టిలో పెట్టుకునే ఇపుడు హైడ్రాకు రేవంత్ ఫుల్లు పవర్స్ ఇచ్చారు. రేవంత్ అనుకున్నట్లే రాజకీయంగా హైడ్రా యాక్టివిటీస్ సంచలనంగా మారి గోల గోల అయిపోతోంది. ముందుముందు ఏమవుతుందో తెలీదు కాని ఇప్పటికైతే రేవంత్ వెనక్కు తగ్గటంలేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.
Tel