Sigachi Blast |జాడలేని కార్మికుల కోసం రోదిస్తున్న కుటుంబ సభ్యులు
సిగాచి ఫార్మా పేలుడు జరిగి గురువారం నాటికి నాలుగు రోజులైనా ఇప్పటి వరకు పదిమంది కార్మికుల జాడ తెలియలేదు.;
By : Shaik Saleem
Update: 2025-07-03 05:22 GMT
పేలుడు ధాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాల ముక్కలు...కాలిన కార్మికుల ఎముకలు... కాలి బూడిదగా మారిన కార్మికుల శరీర అవయవాలు...పేలుడుతో ఎగసిపడిన మాంసం ముద్దలు మంటల్లో కాలి బూడిదగా మారిన వైనం...భవనం కుప్పకూలడంతో చెల్లాచెదురైన కాంక్రీటు శిథిలాలు...పరిశ్రమలో యంత్రపరికరాలు పేలిపోయి మారిన ఇనుప ముక్కలు...రేకుల ముక్కలు...ఎటూ చూసినా కనిపించిన శిథిలాలు...ఇదీ పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు అనంతరం కనిపించిన దృశ్యాలు...
ఈ దృశ్యాలు చూసిన వారికి ఎవరికైనా కన్నీళ్లు రాక మానవు. పాశమైలారం ఐడీఏ ఫేజ్ 1లోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు ధాటికి ఎగసిన అగ్ని కీలల్లో 40 మంది కార్మికులు సజీవంగా సమాధి అయ్యారు.మరో 33 మంది తీవ్రంగా గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఘోర పేలుడు ఘటన
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారంలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబరు 20,21లలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో (Sigachi Pharma Blast ) జూన్ 30వతేదీన ఉదయం 9.20 గంటలకు జరిగిన ఘోర పేలుడు ఘటన తర్వాత మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఫ్యాక్టరీలో టాబ్లెట్లు, క్యాప్సూల్స్ తయారీలో వాడేందుకు మైక్రోక్రిస్టలీన్ సెల్యూలోజ్ పౌడరు (Microcrystalline Cellulose Powder) ను సిగాచి పరిశ్రమలో ఉత్పత్తి చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగినపుడు పరిశ్రమ లోపల 143 మంది కార్మికులున్నారు.
పది మంది కార్మికుల ఆచూకీ ఏది?
సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన తర్వాత మరో పదిమంది కార్మికుల ఆచూకీ లభించడం లేదని వారి బంధువులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ఘటన జరిగినపుడు 143 మంది మంది కార్మికులు పరిశ్రమ లోపల ఉన్నారు. వీరిలో 40 మంది మరణించగా 33 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిశ్రమలో శిథిలాల కింద ఎవరైనా కార్మికులు ఉన్నారేమోనని అనుమానం వ్యక్తం చేసినా వారి శిథిలాల్లో ఎలాంటి మృతదేహాలు లభించలేదని సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పాశమైలారం దుర్ఘటనకు సంబంధించి సిగాచి ఇండస్ట్రీస్‌పై కేసు నమోదు చేశారు. ఈ కంపెనీ యజమాని అమిత్ రాజ్ సిన్హా, సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు.
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ఘోర పేలుడు ఘటన జరిగిన సిగాచి ఫార్మా పరిశ్రమలో శిథిలాల తొలగింపు గురువారం ఉదయం కూడా కొనసాగుతుంది. రేకులు, భవన శిథిలాలు, ఇనుప ముక్కలను రెస్క్యూ బృందాలు తొలగించాయి. పేలుడు ఘటన జరిగాక ఎన్ డీ ఆర్ఎఫ్, ఎస్ డీ ఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక శాఖ, పోలీసు, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల బృందాలకు చెందిన 100 మంది శిథిలాల తొలగింపు పనుల్లో పాల్గొంటున్నారు. శిథిలాల్లో లభించిన కార్మికుల ఎముకలు, మాంసపు ముద్దలను ఫోరెన్సిక్, డీఎన్ఏ పరీక్షకు పంపించారు. జూన్ 30వతేదీన పేలుడు జరగ్గా వంద మంది నాలుగురోజుల పాటు శ్రమించి సిగాచి పరిశ్రమలో శిథిలాలను తొలగిస్తున్నారు. గురువారం సాయంత్రానికి శిథిలాల తొలగింపు ముగుస్తుందని సంగారెడ్డి పోలీసు అధికారి ఒకరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
బాధితుల కుటుంబసభ్యుల ఆందోళన
సిగాచి పేలుడు ఘటనలో మరో పదిమంది కార్మికులు జాడ కనిపించడం లేదు. దీంతో గల్లంతైన కార్మికుల ఆచూకీ చెప్పాలంటూ కార్మికుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. అధికారులు డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. మరో 18 మృతదేహాలను గుర్తుపట్టాల్సి ఉంది. సిగాచి పరిశ్రమ ముందు కార్మికుల కుటుంబ సభ్యులు గురువారం ఆందోళన చేశారు. తన తమ్ముడు జి వెంకటేష్ అనే కార్మికుడి జాడ లేదని అతని అన్న ఆవేదన వ్యక్తం చేశారు. తాను డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చినా ఇప్పటికి జాడలేదని ఇద్దరు యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా పది మంది కార్మికులు గల్లంతు కావడంతో శిథిలాల కింద దొరికిన ఎముకలను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబసభ్యులు, ఆచూకీ తెలియక ఆందోళన చెందుతున్న బంధువులు గురువారం పరిశ్రమ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తమ వారికి ఏమైందో చెప్పాలంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని, గల్లంతైన వారిని గుర్తించడంలో అధికారులు విఫలమవుతున్నారని బాధితులు ఆరోపించారు.
నాలుగు రోజులు జరిగినా జాడ ఏది?
పేలుడు ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా, తమ వారి ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంపై కార్మిక కుటుంససభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసి, సంబంధిత సమాచారాన్ని వెంటనే అందించాలని ప్రభుత్వాన్ని, అధికారులను వేడుకున్నారు. మరోవైపు, ఈ దుర్ఘటనలో మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో వైద్యులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మృతుల బంధువుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి, వాటితో సరిపోల్చిన తర్వాతే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో కొంత ఆలస్యం అవుతోందని అధికారులు చెబుతున్నారు.