నిలకడలేని అంబటి.. ఆయన భవితవ్యం ఏంటో!
క్రికెట్‌లో నిలకడలేకుండా కెరీర్‌ను పాడు చేసుకున్న ఆటగాడు అంబటి రాయుడు. పాలిటిక్స్‌లో కూడా అదే పంథాను అనుసరిస్తున్న అంబటి రాజకీయ భవిష్యత్తు ఏంటి..
By : S Subrahmanyam
Update: 2024-04-24 17:47 GMT
అంబటి రాంబాబు.. ఎంతో స్కిల్ ఉన్నా తన అస్థిర మనస్తత్వం వల్ల అంతగా రాణించలేకపోయిన క్రికెటర్. దాంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నాడు. ఇటీవల బయటకు వచ్చి రాజకీయ అరంగేట్రం చేశాడు. ఆఖరికి రాజకీయాల్లో కూడా ఆయనకు నిలకడ లేకుండానే ఉన్నాడు. తొలుత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ఆయన రోజుల వ్యవధిలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యాడు. ఇప్పటివరకు మరే ఇతర పార్టీలో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అలా ఉంటూ మొన్నటికి మొన్న జనసేన స్టార్ క్యాంపెయినర్‌గా మరోసారి రాజకీయ యవనికపై తలుక్కుమన్నాడు. ఇప్పుడు ఎక్కడ ప్రచారం చేస్తున్నాడో ఎవరికీ తెలియడం లేదు.
గుంటూరు నుంచి పోటీ
వైసీపీలో చేరిన అంబటి.. తాను గుంటూరు నుంచి పోటీ చేస్తున్నానని, తనను అందరూ ఆశీర్వదించాలని వెల్లడించారు. కానీ దానికి సంబంధించి వైసీపీ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పోటీ చేస్తానన్న అంబటి మాత్రం వారం రోజులకే పార్టీ నుంచి తప్పుకున్నాడు. తాను త్వరలో దుబాయ్ వేదికగా జరిగే టీ-20 సిరీస్‌లో పాల్గొననున్నట్లు చెప్పారు. దీంతో అందరూ కూడా క్రికెట్‌పై దృష్టి పెట్టడానికే అంబటి.. రాజకీయాలకు దూరం జరిగారని అనుకున్నారు. ఇంతలోనే అంబటి మరో సడెన్ డెసిషన్ తీసేసుకున్నారు. ఒక్కసారిగా జనసేనాని పవన్ కల్యాణ్‌తో కలిసి కనిపించాడు.
పవన్‌తో భేటీ
అంతా దుబాయ్ వెళ్తాడు అనుకున్న అంబటి వైసీపీకి టాటా చెప్పిన కొన్ని రోజుల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ ముందు వెలిశాడు. పవన్ కల్యాణ్ రెండు మూడు గంటలపాటు భేటీ అయ్యాడు. దాంతో ఏంటి సంగతీ అంటూ అంతా గుసగుసలు రేకెత్తడంతో వాటిపైన స్పందించాడు. ‘‘నా ఆలోచన.. వైసీపీ ధోరణి ఉత్తర దక్షిణ ధృవాల మాదిరిగా ఉన్నాయి. అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగానే ఉండాలని అనుకున్నాను. కానీ నా మిత్రులు, కుటుంబీకులు, శ్రేయోభిలాషులు అందరూ ఒక్కసారి పవన్ కల్యాణ్‌ను కలవమని చెప్పారు. అందుకే ఈరోజు పవన్ కల్యాణ్‌ను కలిశాను’’అని వివరించారు. ప్రస్తుతం రాజకీయాల విషయంలో అంబటి ప్రవర్తనపై ప్రజలు, అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ట్వీట్‌తో వైరల్
అంబటి రాయుడు.. జనసేనలో చేరనున్నాడన్న వార్తలు జోరందుకున్న క్రమంలో అంబటి చేసిన ఒక ట్వీట్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే ‘సిద్ధం’ అంటూ అంబటి చేసిన ట్వీట్. ఇది కాస్తా వైరల్ కావడం.. అతడి తీరుపై అభిమానులు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడు తన ట్వీట్‌పై వివరణ ఇచ్చాడు. ‘పవన్ అన్నను సీఎం చేయడం సిద్ధం. కలిసి సాదిద్దాం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దాంతో కొందరు అభిమానులు శాంతించినా.. ఇలాంటి దూకుడు, ఆలోచన రహిత పనులు మానుకోవాలంటూ మరికొందరు కాస్తంత గట్టిగానే రిప్లైలు ఇచ్చారు. కెరీర్‌ను కూడా ఇలానే పాడు చేసుకున్నావని, ఇప్పటికైనా సరిగ్గా మసులుకో అని హితవు చెప్పారు.
కెరీర్‌లో కూడా అంతే
అంబటి తనకు ఎంత టాలెంట్ ఉన్నా ఇలానే కెరీర్ విషయంలో కూడా ముందూ వెనకా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుని కెరీర్‌ను పాడు చేసుకున్నాడని అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. లేకుంటే ఆయన టీమిండియాలో కీలక ప్లేయర్‌గా ఎదిగి ఉండేవాడని, తన దూకుడు వల్లే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడని ఆగ్రహించిన వారు కూడా ఉన్నారు. ఇప్పటికైనా అంబటి తన నిర్ణయా విషయంలో ఆచితూచి అడుగులు వేయడం నేర్చుకోవాని హితవు చెప్పిన వారూ ఉన్నారు. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా తన చంచల మనస్తత్వ వైఖరిని అంబటి మార్చుకోలేదంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు మండిపడ్డారు.
అంబటిపై బీసీసీఐ నిషేధం
క్రికెట్ చరిత్రలో 21 ఏళ్లకే బీసీసీఐ నిషేధాన్ని ఎదుర్కొన్న తొలి ఆటగాడిగా కూడా అంబటి ఘనత సాధించాడు. అందుకు కూడా అతడు దూకుడు తనమే కారణం. అంబటి రంజీలు ఆడుతున్న సమయంలో అతడికి అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ కుమారుడు అర్జున్ యాదవ్‌కు భారీ గొడవ జరిగింది. వారిద్దరు కొట్టుకున్నారని కూడా వార్తలు వచ్చాయి. దాంతో శివలాల్ నుంచి అంబటి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. రెబల్‌గా మారాడు.అందులో భాగంగానే బీసీసీఐకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియన్ క్రికెట్ లీగ్(ఐసీఎల్) చేరాడు. దాంతో బీసీసీఐ అతడిపై నిషేధం ప్రకటించింది. ఆ తర్వాత కొంతకాలానికి బీసీసీఐ అతడికి క్షమాభిక్ష పెట్టడంతో దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. 2013లో తొలిసారి ఇండియా జర్సీ ధరించి మైదానంలోకి దిగాడు. ఆ తర్వాత 2015లో అవకాశం కల్పించిన స్టాండ్‌బై ప్లేయర్‌గా కూర్చోబెట్టింది బీసీసీఐ. అందుకు ఆగ్రహించిన అంబటి పూర్తిగా క్రికెట్‌లో గుడ్‌బై చెప్పాడు.
ఇప్పుడు పాలిటిక్స్‌లో కూడా
అంబటి అదే పంథాను పాలిటిక్స్‌లో కూడా అనుసరిస్తున్నాడు. దాంతో పాలిటిక్స్‌లో దుందుడుకు ప్రవర్తన మేలు చేయదని, ఆచితూచి అడుగులు వేయాలంటూ హితవు పలుకుతున్నారు అభిమానులు. ప్రస్తుతం అంబటి రాయుడు.. జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పటికైనా తన దూకుడు తగ్గించి నిలకడగా రాణిస్తాడా లేకుంటా క్రికెట్‌లో మాదిరిగానే పాలిటిక్స్‌లో కూడా అటూఇటూ కాకుండా పోతాడా అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.