బీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది ?

అప్పటివరకు కేసీఆర్ కన్నా ఎక్కువ కష్టపడింది హరీష్ రావే అన్న విషయం అందరికీ తెలుసు.;

Update: 2025-05-14 11:28 GMT
Competition for BRS reins

ఎవరు అవునన్నా కాదన్నా ప్రాంతీయపార్టీలన్నవి అధినేతల ప్రైవేటు ఆస్తుల్లాంటివే. ఈవిషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదు. తెలుగుదేశంపార్టీ, వైఎస్సార్టీసీ, బీఆర్ఎస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను గమనిస్తే ఈ విషయం స్పష్టమైపోతుంది. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్(BRS) లో కుర్చీలాట పెరిగిపోతున్నట్లుంది. కుర్చీలాట అంటే కేసీఆర్(KCR) తర్వాత పార్టీఅధ్యక్ష పదవి ఎవరికి అన్న పోటీ అన్నమాట. పైకి అధ్యక్షపదవిపై పార్టీలో ఎలాంటి పంచాయితీలు లేవని కేటీఆర్, హరీష్ రావు, కవితలు ఎన్నయినా చెప్పవచ్చు. అయితే పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కుర్చీలాట తీవ్రమవుతున్నదన్న సంకేతాలనే పంపుతోంది. ఇపుడిదంతా ఎందుకంటే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతు పార్టీ అధ్యక్ష బాధ్యతలు కేటీఆర్ కు అప్పగించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పటమే.

హరీష్ పై క్లారిఫికేషన్ ఇవ్వగానే అందరిలోను అనుమానాలు పెరిగిపోయాయి. ఎందుకంటే పార్టీపగ్గాలు అంటే కేసీఆర్ తర్వాత ఎవరు అన్న చర్చ జరిగినపుడు కేటీఆర్(KTR) తో పాటు హరీష్ పేరుపైన కూడా చర్చజరిగింది. నిజానికి కేటీఆర్ కన్నా హరీష్(Harish Rao) కే పార్టీ నేతల మద్దతున్నదన్న చర్చ కూడా ఒకపుడు జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. కేసీఆర్ పార్టీ పెట్టినపుడు పక్కనున్నది, పార్టీకోసం రాత్రనక, పగలనక కష్టపడింది హరీషే కాని కేటీఆర్ కాదు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న కేటీఆర్, కవిత(Kavitha) ప్రత్యేక తెలంగాణ(Telangana) వచ్చేయటం ఖాయమన్న బలమైన సంకేతాలు కనబడిన తర్వాతే తెలంగాణకు వచ్చి ఉద్యమంలో భాగమయ్యారు. అప్పటివరకు కేసీఆర్ కన్నా ఎక్కువ కష్టపడింది హరీష్ రావే అన్న విషయం అందరికీ తెలుసు.

అందుకనే పార్టీపగ్గాల విషయంలో నేతల్లో మెజారిటి యాక్సెప్టెన్సీ హరీష్ వైపే ఉందన్న ప్రచారం బాగా ఉంది. అయితే కేసీఆర్ వారసుడి హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వటంతో పార్టీ మీద కేటీఆర్ పట్టు పెంచుకున్నారు. ఒకవైపు మెజారిటి నేతల్లో హరీష్ కున్న బలం, జనాల్లో ఉన్న క్రేజు, మరోవైపు వారసుడి హోదాలో కేటీఆర్ పార్టీపగ్గాలకు సమాన అర్హతులన్నట్లుగా సంకేతాలు కనబడుతున్నాయి. పైన చెప్పుకున్నట్లుగా కేసీఆర్ వారసుడి హోదాలో పార్టీపగ్గాలు కేటీఆర్ చేతికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడే మరో సమస్య కనబడుతోంది. అదేమిటంటే కేసీఆర్ వారసులుగా కేటీఆర్ తో పాటు కవిత కూడా పోటీలో ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi liquor scam) లో ఇరుక్కుని తీహార్ జైలు నుండి బెయిల్ పై విడులయ్యాక కొంతకాలం కామ్ గా ఉన్న కవిత తర్వాత స్పీడు పెంచారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొంతకాలంగా కవిత పార్టనేతగా కాకుండా జాగృతి(Jagruthi) అధ్యక్షురాలిగానే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. పదేళ్ళ పాలనలో సామాజిక తెలంగాణను సాధించుకోలేకపోయామని కవిత చేసిన ప్రకటన బీఆర్ఎస్ లో పెద్ద చర్చకు కారణమైంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సామాజికతెలంగాణను సాధించుకోలేకపోయామని అంటే అర్ధమేంటి ? 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నది తండ్రి కేసీఆరే కదా. అంటే సామాజికతెలంగాణను సాధించటంలో కేసీఆర్ ఫెయిలయ్యారని చెప్పకనే చెప్పారు. దీంతోనే కవితకు తండ్రి కేసీఆర్ మీద బాగా అసంతృప్తి ఉందన్న విషయం బయటపడింది.

పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కటంలేదన్న అసంతృప్తి కవితలో బాగా పెరిగిపోతున్నట్లుంది. అందుకనే జాగృతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో లాగ నేతల అంతరగం బాహాటం కాకపోయినా అంతర్గతంగా మాత్రం కుర్చీలాట బాగా పెరిగిపోతోంది. కేసీఆర్ ఏమో నేతలకు అందుబాటులో ఉండటంలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ నేతలను కలుస్తున్నారు కాని పార్టీ బలోపేతానికి నేతలందరిని కూర్చోబెట్టి సమీక్షలు మాత్రం చేయలేకపోతున్నారు. అందుకనే (Revanth) రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కేటీఆర్ పోరాటంలో ఎక్కువభాగం సోషల్ మీడియాకు, మీడియా సమావేశాలకే పరిమితమైపోయింది. దీంతోనే బీఆర్ఎస్ లో ఏమి జరుగుతోంది అన్న విషయం చాలామందికి అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News