ఎంసెట్ కౌన్సెలింగ్ పై ‘లోకేష్’ ఏమి సమాధానం చెబుతాడు?
ఈఏపీ సెట్ లో ఓపెన్ కేటగిరీలో అడ్మిషన్ కు అర్హత ఉన్నా... రిజర్వేషన్ పేరు చెప్పి ఎందుకు పక్కకు నెట్టారు?;
సాంకేతిక విద్యాశాఖ (Technical Education) లో అధికారుల తీరు విద్యార్థుల జీవితాలను తారు మారు చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్స్ ల్లో చేరే విద్యార్థుల జీవితాలు ఎంతో బాగుంటాయని తల్లిదండ్రులు కలలు కంటున్నారు. మంచి మెరిట్ ఉన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అందుకునేందుకు మంచి విద్యావిధానమని అందరూ భావిస్తున్నారు. అయితే అధికారుల తప్పిదాలు, అందులోనూ ఐఏఎస్ ల తీరు పలు విమర్శలకు దారి తీస్తోంది.
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖను తాను కావాలని కోరుకున్నట్లు పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన ఆశయాలు, ఆశలు ఇక్కడ అమలు కావడం లేదు. ఎంసెట్ కౌన్సెలింగ్ లో ఓపెన్ కేటగిరీ సీట్లలో రిజర్వేషన్ కులాలు, మహిళా రిజర్వేషన్ వారికి అవకాశం లేకుండా ఎంసెట్ కన్వీనర్ తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు దారితీసింది. ఓపెన్ కేటగిరీలో ఎవరైనా మెరిట్ మార్కులు వచ్చిన వారు దరఖాస్తు చేసుకుంటారు.
కానీ ఎంసెట్ కౌన్సెలింగ్ లో రూపొందించిన విధి విధానాలు మహిళలు 33.3 శాతం మంది రిజర్వేషన్ కేటగిరీలోనే దరఖాస్తు చేసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ, పీహెచ్సీ వంటి రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీలోనే దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించడంతో ఓపెన్ కేటగిరీలో అవకాశం ఉన్నా అక్కడ రిజర్వేషన్ కు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఈ కారణంగా ఓపెన్ కేటగిరీలో సీటు పొందాల్సిన వారు రిజర్వేషన్ కేటగిరీలోకి రావడంతో సాధారణ మెరిట్ ఉన్న రిజర్వేషన్ అభ్యర్థులు అవకాశాన్ని కోల్పోయారు. ఇందుకు నిర్వాహకులే కారణమని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నిత్యం విద్యాశాఖలో సమీక్షలు నిర్వహిస్తున్నట్టు లోకేశ్ కనిపిస్తుంటారు. కానీ చేయకూడని, జరగకూడని తప్పులు జరుగుతూనే వుండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది . పదో తరగతి విద్యార్థుల మూల్యాంకనం మొదలుకుని, ప్రతి సందర్భంలోనూ విద్యాశాఖ విమర్శలపాలవుతోంది. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ సందర్భంలోనూ ఆలస్యం చేసి, వారికి తీవ్ర నష్టాన్ని, దుఃఖాన్ని మిగిల్చారు. దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థి లోకానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
తాజాగా ఈఏపీ సెట్ (Engineering, Agricultural and Pharmacy Common Entrance టెస్ట్) సీట్ల కేటాయింపులో భాగంగా చేపట్టిన వెబ్ కౌన్సెలింగ్‌లో ‘రూల్ ఆఫ్ రిజర్వేషన్’ పాటించకపోవడంతో విద్యార్థుల తలరాతలే మారిపోయాయి. దాదాపు 40 వేల మంది అమ్మాయిలు నష్టపోయినట్టు ఓ అంచనా. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ(ఈఏపీ) సెట్‌కు సంబంధించి మొదటి విడత వెబ్ కౌన్సెలింగ్ తీవ్ర తప్పిదాల మధ్య పూర్తయింది. ఓసీ విద్యార్థుల కంటే మెరుగైన ర్యాంకులొచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు జనరల్ కోటాలో సీట్లు దక్కకపోవడం... తాజా ఈఏపీ వెబ్ కౌన్సెలింగ్ ప్రత్యేకత. సదరు విద్యార్థులకు రిజర్వేషన్ కోటాలోనే సీట్లు కేటాయించడం గమనార్హం. దీంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిని తిట్టిపోస్తున్నారు.
ఇవాళ్టి నుంచి రెండో విడత కౌన్సెలింగ్ మొదలైంది. ఈ నెల 31వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే లా, ఆగష్టు 1 వతేదీ వెబ్ అషన్స్ లో మార్పులు ఉంటే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. వచ్చే నెల 4వ తేదీ సీట్ల కేటాయింపు జరగనుంది. అయితే ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ఆటోమేటిక్‌గా సీట్ల కేటాయింపు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను సాంకేతిక విద్యాశాఖ రూపొందించి ఉంటుంది. అయితే ఈ దఫా కొన్ని మార్పులు చేశారని చెబుతున్నారు. ఇక్కడే సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది.
ముఖ్యంగా 33.3 శాతం మహిళా రిజర్వేషన్లు, అలాగే ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి అమ్మాయిలకు దక్కాల్సిన సీట్లు సాఫ్ట్‌వేర్ వ్యవస్థలోని లోపభూయిష్టం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగింది. ఈడబ్ల్యూఎస్ ఉమెన్ ఆప్షన్ కనిపించడం లేదని బాధిత విద్యార్థినులు లబోదిబోమంటున్నారు. దీంతో వెబ్ ఆప్షన్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఫలానా మంచి కాలేజీలో సీటు కావాలని ఆప్షన్ పెట్టుకున్నప్పటికీ, సాంకేతిక విద్యాశాఖ అధికారుల తీవ్ర తప్పిదంతో అసలుకే మోసం జరిగింది. విద్యార్థినులు కోరుకున్నట్టు ఏదీ జరగలేదు. 100కి 80 సీట్లు అబ్బాయిలకే సాఫ్ట్‌వేర్ పుణ్యమా అని కేటాయింపు జరిగింది.
సాంకేతిక విద్యా శాఖ ఏమి చెప్పిందంటే...
ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపులో జరిగిన రిజర్వేషన్ల గందరగోళంపై సాంకేతిక విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు చెబుతున్న విషయాన్ని అంగీకరించింది. రాష్ట్ర విభజన జరక్క ముందు 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎం ఎస్ నంబర్ 74 తేదీ 28-7-2011 ఆధారంగా సీట్ల కేటాయింపు జరిపినట్లు వివరించింది. మహిళా అభ్యర్థులు 33.3 శాతం కంటే ఎక్కువ మంది మెరిట్ సాధించినా వారికి అంతకు మించి సీట్లు కేటాయించడం కుదరదని స్పష్టం చేసింది. అంటే విద్యార్థినులు మంచి ర్యాంక్ సాధించినా ఓపెన్ కేటగిరీ లో సీటు కేటాయించలేదని వెల్లడించింది. దీన్ని బట్టి మహిళా అభ్యర్థులకు అన్యాయం జరిగిందనే విషయం స్పష్ఠంగా అర్థం అవుతోంది. ఎంసెట్ కన్వీనర్ చెబుతున్న ప్రకారం 33.3 శాతం మంది మహిళలు తప్ప 100 శాతం మహిళలకు చదువకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం లేదని స్పష్టమవుతోంది.