మహిళలకు ఉచిత బస్ పై ఆర్టీసీ ఎండీ ఏమన్నారంటే...

ఏపీలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై ప్రభుత్వం తరపున ఒక్కోరు ఒక్కో మాట చెబుతున్నారు.;

Update: 2025-07-29 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఆగస్ట్ 1 నుంచి ప్రభుత్వం కల్పించనున్న ఉచిత బస్ ప్రయాణంపై నేటికీ ఆర్టీసీ అధికారులు, పాలకుల్లో స్పష్టత లేదు. వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితం అన్నవరంలో మాట్లాడుతూ రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉంటుందని చెప్పారు. ఈనెల మొదటి వారంలో నిర్వహించిన ఆర్టీసీ సమీక్షలో ముఖ్యమంత్రి పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల పరిధిలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఉంటుందని చెప్పారు.

ఆర్టీసీ ఎండీ తిరుమల రావు ఏమన్నారు?

అయితే సోమవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాల పరిధిలోనే ఉచిత ప్రయాణాలు ఉంటాయని, ఉమ్మడి జిల్లాలకు విస్తరించే విషయం పరిశీలనలో ఉందని చెప్పారు. అంటే ఉచిత బస్ ప్రయాణం ఏ ప్రాంతంలో పర్యటించాలనే అంశంపై స్పష్టమైన వైఖరి ప్రభుత్వం వద్ద లేదు. దీంతో చాలా మంది మహిళల్లో ఉచిత బస్ ప్రయాణంపై అయోమయం నెలకొంది. ఆగస్ట్ 15 నుంచి పథకాన్ని ప్రారంభిస్తున్నారంటే కేవలం 16 రోజుల సమయం మాత్రమే ఉంది.

సమన్వయం ఎందుకు లేదు?

అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి సమన్వయంతో పనిచేయడం లేదని అర్థం అవుతోంది. ఆర్టీసీ బస్ ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేసేందుకు తలో మాట మాట్లాడుతున్నారు. ప్రయాణికులను అయోమయంలో పడేసి ఏదో ఒకటి అములు చేస్తున్నారు? అంతవరకు చాలు అనే పరిస్థితి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అర్థమవుతోందిని ఒంగోలుకు చెందిన అలుగుల సులోచన అనే మహిళ వ్యాఖ్యానించారు.

ఉచిత ప్రయాణాలకు 74 శాతం బస్ లు

ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ డిపోలకు కొత్తగా 1,350 బస్ లు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే 750 బస్ లు నూతనంగా మంజూరు అయినట్లు తెలిపారు. మరో 600 బస్ ల కోసం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. మొత్తం 11వేల బస్ ల్లో 74 శాతం బస్ లు ఉచిత ప్రయాణాలకు కేటాయిస్తున్నామని, ఉచిత బస్ ప్రయాణాలు జిల్లాలకు పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు ఉండేలా చూస్తామన్నారు.

Tags:    

Similar News