కేంద్రమంత్రులు కిషన్, బండి చేయగలిగిందేమిటి ? చేయాల్సిందేమిటి ?

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఇద్దరికీ కేటాయించిన శాఖలతో వీళ్ళు తెలంగాణాకు చేయగలిగిందేమిటి ?

Update: 2024-06-11 09:08 GMT

కేంద్రమంత్రివర్గంలో తెలంగాణా నుండి ఇద్దరికి చోటు దొరికింది. గంగాపరం కిషన్ రెడ్డి గనులు, బొగ్గు శాఖ మంత్రిగాను, బండి సంజయ్ హోంశాఖ సహాయమంత్రిగాను బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇద్దరికీ నరేంద్రమోడి 3.0 ప్రభుత్వంలో మంత్రులుగా అవకాశం దొరకటం సంతోషించాల్సిన విషయమే. వాళ్ళ మద్దతుదారులు పండగచేసుకుంటున్నారు కూదా.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. అదేమిటంటే ఇద్దరికీ కేటాయించిన శాఖలతో వీళ్ళు తెలంగాణాకు చేయగలిగిందేమిటి ? దేశానికి వీళ్ళు చేయగలిగిన సేవలను పక్కనపెట్టేద్దాం. ముందు తమ సొంతరాష్ట్రమైన తెలంగాణాకు తమ శాఖల ద్వారా ఏమిచేయగలరు ? అన్నదే అసలైన పాయింట్. ముందుగా కిషన్ వ్యవహారం చూస్తే శాఖాపరంగా తెలంగాణాకు చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే బొగ్గు, గనుల శాఖంటే తెలంగాణాలో అందరికీ గుర్తొకొచ్చేది ముందు సింగరేణి కాలరీస్ మాత్రమే. సింగరేణి సంస్ధను నరేంద్రమోడి ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేస్తోంది. మోడి నిర్ణయాన్ని అడ్డుకోగలిగేంత సీన్ కిషన్ కు లేదు. సింగరేణి సంస్ధను ప్రైవేటుపరం చేయటంలో మొదటి మెట్టు ఏమిటంటే గనులకు ఓపెన్ టెండర్లు పిలవాలని తీసుకున్న నిర్ణయమే. 2015కి ముందు తెలంగాణాలోని బొగ్గు గనులపై సింగరేణిదే గుత్తాధిపత్యం.

బొగ్గు నిల్వలపైన, తవ్వకాలు, ఉత్పత్తి, సరఫరా, కొత్తగనులకోసం అన్వేషణ, తవ్వకాలకు దరఖాస్తు చేసుకోవటం అంతా సింగరేణే చూసుకునేది. ఎప్పుడైతే మోడి ప్రభుత్వం 2015లో క్యాపిటల్ మైనింగ్ యాక్ట్ తెచ్చిందో అప్పటినుండి సింగరేణి సంస్ధకు బొగ్గుగనులపై గుత్తాధిపత్యం పోయింది. బొగ్గు గనులను సొంతంచేసుకోవాలంటే ప్రైవేటుసంస్ధలతో పోటీపడాల్సిందే వేరేదారిలేదు. ఆల్రెడీ నాలుగు గనులకు కేంద్రం 2022లోనే ఓపెన్ టెండర్లు పిలిచింది. ఇందులో రెండింటిని అరబిందో సంస్ధ దక్కించుకున్నది. మిగిలిన రెండింటిపైన ఏ సంస్ధ కూడా ఆసక్తి చూపనికారణంగా టెండర్లను కేంద్రం రద్దుచేసింది. బొగ్గుగనులపై సింగరేణికే గుత్తాధిపత్యం కట్టబెట్టకపోతే ప్రైవేటుసంస్ధలతో సింగరేణి పోటీపడలేందు. అందుకనే సింగరేణికి కొత్తగనులు దక్కవు. గనులు లేకపోతే తవ్వకాలు, సరఫరా, అమ్మకాలుండవు. ఇవేవీలేకపోతే సంస్ధలో ఉద్యోగులండరు. తవ్వకాలకు అవకాశంలేక, ఉద్యోగులను భరించలేక సింగరేణి యాజమాన్యం సంస్ధను మూసేస్తుంది. కాబట్టి ఇప్పుడు కాకపోయినా మరో 10 ఏళ్ళ తర్వాతైనా సింగరేణి మూసేయాల్సిందే.

ఈ నేపధ్యంలో బొగ్గు, గనుల శాఖకు క్యాబినెట్ మంత్రయిన కిషన్ సింగరేణికి, తెలంగాణాకు చేయగలిగేదేముంటుంది ? ఏముండదు. కాకపోతే తనకు ఏమన్నా పలుకుబడుంటే ఇతర శాఖల మంత్రులతో మాట్లాడుకుని తెలంగాణాలో పరిశ్రమలు, ఐటి సంస్ధలతో పాటు ఇతరత్రా అభివృద్ధి చేయాలంతే.

అలాగే బండి సంజయ్ విషయాన్ని చూస్తే ఈయన కూడా సేమ్ టు సేమ్. హోంశాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు. హోంశాఖంటే పూర్తిగా శాంతి, భద్రతలు, పోలీసులు, దర్యాప్తు సంస్ధలకు సంబంధించిన శాఖ. క్యాబినెట్ మంత్రి ఎవరంటే అమిత్ షా. క్యాబినెట్ మంత్రులున్నపుడు సహాయమంత్రులకు శాఖలో ఏమీ పనుండదు. శాఖాపరమైన సమీక్షలు, నియామకాలు, బదిలీలు మొత్తం నిర్ణయాలను క్యాబినెట్ మంత్రులే చూసుకుంటారు. సహాయమంత్రులంటే కేవలం అలంకారప్రాయమే. సమీక్షలకు క్యాబినెట్ మంత్రి రమ్మంటేనే వెళ్ళాలి లేకపోతే ఆ విషయాలు కూడా సహాయమంత్రులకు తెలీవు. దేశంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే తాను వెళితే ఇబ్బంది అవుతుందని అనుకున్నపుడు క్యాబినెట్ మంత్రులు సహాయమంత్రులను పంపుతారు.

అమిత్ షా లాంటి క్యాబినెట్ మంత్రుండగా ఇక బండికి చేయటానికి పనికూడా ఏమీ ఉండదు. బండి చేయగలిగింది ఏమిటంటే కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేయటం, లేకపోతే అమిత్ షా ఏదైనా పనిచెబితే దాన్ని పూర్తిచేయటం అంతే. తనకు ఏమన్నా పలుకుబడుంటే ఇతర మంత్రులతో మాట్లాడి తెలంగాణాకు లేకపోతే తన నియోజకవర్గం కరీంనగర్ అభివృద్ధికి ప్రయత్నించటం. తెలంగాణాలో ఏదన్నా డెవలప్ చేయాలన్నా సొంతంగా బండికి సమస్యే. ఎందుకంటే క్యాబినెట్ మంత్రిగా కిషన్ ఉన్నపుడు తనిష్టారాజ్యంగా బండి చేసేందుకు లేదు. కిషన్ కు తెలీకుండా తెలంగాణా మొత్తానికి బండి చేయగలిగిన అభివృద్ధి కూడా ఏమీ ఉండదు. తెలంగాణాలో హాట్ టాపిక్ అయిన టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా సంజయ్ చేసేందుకు ఏమీలేదు. ఏదన్నా ఉంటే అమిత్ షా తో చెప్పుకుని పని చేయించుకోవాలంతే. కాబట్టి ఇద్దరు మంత్రులు ప్రత్యక్షంగా తమ శాఖల ద్వారా తెలంగాణాలో చేయగలిగే అభివృద్ధి అంటు ఏమీ ఉండదు. ఇతర శాఖల మంత్రులతో చెప్పి లేదా నరేంద్రమోడిపై ఒత్తిడిపెట్టి ఏమి అభివృద్ధి చేయగలరు అన్నది చూడాలి.

Tags:    

Similar News