అన్నా.. ఆంధ్రలో ఎవరు గెలుస్తారో చెప్పవా!
ఆంధ్ర ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇరు పారటీలకు ఉన్న ప్లస్‌లు, మైనస్‌లు ఒకసారి చూద్దాం.
ఏపీలో రాజకీయం వేడెక్కింది. ప్రచారం ముమ్మరమైంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు వంటి అనేక ప్రశ్నలు వినవస్తున్నాయి. అయితే వీటికి సమాధానం చెప్పడం చాలా కష్టమనే చెప్పాలి. పూటకో సర్వే రోజుకో పుకారు వస్తున్న తరుణంలో జవాబులు చెప్పడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఏ సర్వే చూసినా తాము ప్రజల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నామనే చెబుతున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ నాయకులు తమకు అనుకూల వాదనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మేధావులు చెబుతున్న మాటలు ఇలా ఉన్నాయి.
వైసీపీకి సంబంధించి చెబుతున్న మాటేమిటంటే...
ఈ ఎన్నికల్లో జగన్‌కు అనుకూల అంశాలు ఏమిటంటే.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఓటు బ్యాంకుగా ఉన్నారు. బీసీలు విడివడి ఉన్నారు. అందులో సగ భాగమైనా వైసీపీ వస్తాయన్నది జగన్ అంచనా. పటిష్టమైన వాలంటీర్ల వ్యవస్థ చేసిన సేవలు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు, ఇక చివరిగా అతి ముఖ్యమైన ఆర్థిక వనరులు.
మరి లోపాలు ఏమిటంటే...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వైసీపీకి పెద్ద ఆటంకంగానే ఉంది. సుమారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఈ అప్పులు ఆర్ధికాభివృద్ధికి ఆటంకంగా మారతాయనే విమర్శలు, మూడు రాజధానులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసహనం, ఇసుక, మద్యం, మైనింగ్ దోపిడీ అంటూ ఆరోపణలు. కాపులు దూరమయ్యారన్న వాదన, ప్రభుత్వ ఉద్యోగ వర్గాలలో అసహనం వంటివి అవరోధాలుగా ఉన్నాయి.
టీడీపీకి సంబంధించిన సానుకూల అంశాలు...
టీడీపీ మహాకూటమిగా ఏర్పడి జనసేన, బీజేపీతో జట్టు కట్టింది. మూడు రాజధానుల ప్రతిపాదనను కొన్ని వర్గాలు వ్యతిరేకించడం, అమరావతి ప్రాంత రైతుల నిరసన వంటివి కలిసి వస్తాయని టీడీపీ అంచనా వేస్తోంది. దీనికి తోడు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్న విమర్శలు చేస్తున్న మధ్యతరగతి వర్గాలు ఓట్లు వేస్తాయని ఆశిస్తోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్న గ్యాప్ సుమారు 14 లక్షల ఓట్లు. అంటే వీటిలో ఇప్పుడు ఇందులో సగం చీల్చగలిగితే కచ్చితంగా గెలవవచ్చుననే ధీమా టీడీపీలో వ్యక్తమవుతోంది. ఈ ఏడు లక్షల ఓట్లకు సంబంధించి జనసేన, బీజేపీకి ఉన్న అనుకూల వర్గాలు ఈసారి ఎన్నికల్లో తమవైపు వస్తే గెలుపు సునాయాసమనే వాదన చేస్తున్నాయి టీడీపీ మేధావి వర్గాలు. వైసీపీకి గత ఎన్నికల్లో కోటిన్నరకుపైగా ఓట్లు వస్తే టీడీపీకి కోటీ 23 లక్షల ఓట్లు వచ్చాయి. జనసేనకు 17.30 లక్షల ఓట్లు బీజేపీకి 2 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడినందున టీడీపీకి వచ్చిన ఓట్లకు జనసేన, బీజేపీ ఓట్లు కలిస్తే వైసీపీకి మించి ఓట్లు రావొచ్చునని భావిస్తున్నాయి టీడీపీ వర్గాలు.
టీపీడీ బలహీనతలు ఏమిటంటే...
చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో ఎంతో మార్పు వచ్చిందని భావించిన టీడీపీకి ఈసారి మహాకూటమిలోకి బీజేపీ రావడమే పెద్ద మైనస్‌గా చెబుతున్నారు. మైనారిటీ ఓట్లు ఈసారి టీడీపీకి రాకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది. సీట్ల పంపకంలోనూ నాన్చుడు ధోరణి, జనసేన, బీజేపీలోనూ తమ వర్గం వారికే చంద్రబాబు సీట్లు ఇప్పించుకున్నారన్న ఆరోపణలు మైనస్‌గా ఉన్నాయి. వీటన్నింటికి మించి చంద్రబాబు ప్రకటించిన ఆరు సూత్రాల పథకం అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు గతంలో చెప్పిన రుణమాఫీ పెద్ద ప్లాప్ పథకంగా రైతులు భావిస్తుంటారు. అటువంటి వ్యక్తి ఈసారి తాను చెప్పిన వన్నీ అమలు చేస్తారా అనే సందేహం ప్రజల మనసులో నెలకొని ఉంది. విశ్వసనీయత పెద్ద సమస్యగా మారింది.
జనసేన ఓట్లు టీడీపీకి మరలుతాయా..
జనసేన గతంలో ఒంటరిగా పోటీ చేసినప్పుడు సుమారు 17.30 లక్షల ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో జనసేన 153 సీట్లలో పోటీ చేసింది. కానీ ఈసారి కేవలం 21 సీట్లలోనే పోటీ చేస్తోంది. మిగతా నియోజకవర్గాలలోని జనసైనికులు ఈసారి టీడీపీకి ఓట్లు వేస్తారా అనే ప్రశ్న వెంటాడుతోంది. జనసేనను మొదటి నుంచి అంటిపెట్టుకున్న వర్గం ఏదైనా ఉందంటే అది కాపు సామాజికవర్గమే. ఇప్పుడా వర్గంలో చీలిక వచ్చినట్టుగా పరిశీలకులు చెబుతున్నారు. అయినప్పటికీ వైసీపీని నమ్ముతారా, కాపులకు రిజర్వేషన్ల విషయంలో తానేమీ చేయలేనని చెప్పిన జగన్‌ను నమ్ముతారా అనేవి ఇప్పటికిప్పుడు బయటపడే అంశాలు కావు.
ఈ నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు ఓటములు అంచనాలు వేయడం సాహసమేనని చెప్పాలి. జోస్యం చెప్పడమంటే కోరి తగవు తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. వైసీపీకి మహాకూటమికి మధ్యలో ఈసారి షర్మిల రూపంలో కాంగ్రెస్ మధ్యలోకి వచ్చింది. ఈసారి ఆ పార్టీ చీల్చే ఓట్లు ఎవరికి చేటు తెస్తాయనే దానిపై చర్చ సాగుతోంది. జనాభిప్రాయం కూడా రోజుకో తీరుగా మారుతున్న తరుణంలో ఓటరు మనసులో ఏముందో కనిపెట్టడం కష్టంగా ఉందని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో అన్ని పార్టీలు ఎవరి ధీమాలో వారున్నారు.