ఇలాంటి మీటింగ్‌లు గత ప్రభుత్వంలో పెట్టారా
ప్రజల ఆలోచనలను తీసుకొని సంస్కరణలు తేవాలనే ఏకైక ధ్యేయంతో పని చేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.;
By : Admin
Update: 2025-03-15 09:02 GMT
గతంలో ఏ ముఖ్యమంత్రైనా ఈ మాదిరిగా వచ్చారా? మీటింగ్‌లు పెట్టారా? మాట్లేందుకు మీకు మైక్‌లు ఇచ్చారా? అసలు ఇలాంటి మీటింగ్‌లో గత ప్రభుత్వంలో జరిగాయా? ఒక వేళ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినా.. పరదాలు కట్టుకుని వచ్చే వారు. విమానంలో వస్తే చెట్లన్నీ నరుక్కుంటూ వచ్చే వాళ్లు. మాట్లాడేందుకు ఎవరికీ మైక్ ఇచ్చే వాళ్లు కాదు. మీటింగ్‌లో మీరెక్కడో కూర్చుంటే.. వాళ్లు ఎక్కడో కూర్చునే వాళ్లు. ఆకాశంలో ఉండే వాళ్లు. నేనలా కాదు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం. ప్రజలు చెప్పింది విని పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చే ప్రభుత్వం. అలా సంస్కరణలు తీసుకొని రావాలనే ఏకైక ధ్యేయంతోనే ఈ వాళ మీ మందుకొచ్చానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని కోరారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. అందులో భంగాగంగా తణుకు జడ్పీ బాలుర హైస్కూల్‌లో లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రజలతో సీఎం ముఖా ముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు కొన్ని ప్రశ్నలు సీఎం చంద్రబాబుకు వేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద కొన్ని పరీక్షలు చేయడం లేదని ఓ మహిళ సీఎం దృష్టికి తీసుకెళ్లింది. పెన్షన్ కోసం సదరం సర్టిఫికేట్ ఇవ్వడం లేదని మరో మహిళ సీఎంకు తెలిపింది. ఇలా మహిళలు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానలు చెప్పారు. సభలో ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పది లక్షల కోట్ల అప్పులు చేసిందని, దానికి ఇప్పుడు ఆ అప్పులు తీర్చండంతో పాటు వడ్డీని కట్టాల్సి వస్తోందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కసీనం మురికి కాల్వల్లో పూడిక కూడా తీయించలేదని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి పోయిందని, దానిని తొలగించే పనులు తమ ప్రభుత్వం చేస్తోందన్నారు. మీకు బాధ్యతలు గుర్తు చేయడానికి ఇక్కడకు వచ్చానన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాళ్లల్లో చేపట్టాలనేదే తన లక్ష్యమని వెల్లడించారు. గత ఎన్నికల ఫలితాలను కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. 2004లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎక్కడికో వెళ్లిపోయేదని పేర్కొన్నారు. అదేవిధంగా 2014లో గెలిపించినట్లు 2019లో తమను గెలిపించి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో అభివృద్ధి జరిగి ఉండేదన్నారు. 2019లో ఓడిపోవడానికి తన తప్పు కూడా ఉందన్నారు. 2019లో వైసీపీ అధికారమిస్తే ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టేశారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లల్లో విపరీతంగా అప్పులు చేశారని మండిపడ్డారు.
స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర పర్యటన కోసం తణుకు వెళ్లిన సీఎం చంద్రబాబుకు మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే పట్టాభిరామ్, జిల్లా కలెక్టర్ చదవలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అశ్వి, ఎమ్మెల్యేలు రాధాకృష్ణ, పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తణుకు బాయ్స్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ సీఎం చంద్రబాబు తిలకించారు. పర్యావరణానికి మేలు చేకూర్చే డిస్పోజబుల్ వస్తువులు ప్రదర్శనను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం చంద్రబాబు సత్కరించి మెమెంటోలను అందజేశారు.