అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మారుస్తాం!

ఏపీ వికాసమే ఎన్డీయే ప్రభుత్వ సంకల్పం. విశాఖ సభలో ప్రధాని మోదీ. రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.;

Update: 2025-01-08 14:51 GMT

ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

అభివృద్ధితో ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రాన్ని మారుస్తున్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామన్నారు. ఏపీ వికాసమే కేంద్రంలోని ఎన్డీయే సర్కారు సంకల్పమని ఉద్ఘాటించారు. బుధవారం సాయంత్రం ఆయన విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వేదికపై నుంచి సుమారు రూ.2.08 లక్షల కోట్ల విలువైన రాష్ట్రంలోని వివిధ పనులు, ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధాని భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. ‘ఆంధ్ర ప్రజల ప్రేమాభినాలకు నా కృతజ్ఞతలు.. నా అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు లభించింది. సింహాచలం నరసింహస్వామికి ప్రణామములు' అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే? 'మీ అందరి ఆశీర్వాదములతో మూడోసారి ప్రధాని అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చెప్పిన అంశాలను గౌరవిస్తూ లక్ష్యాలను సాకారం చేస్తాను.

ఆంధ్ర.. ఎన్నో అవకాశాలున్నా రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ వికాసం మా లక్ష్యం.. ఆంధ్రప్రదేశ్ సేవే మా సంకల్పం. ఏపీకి కేంద్రం చేదోడు వాదోడుగా ఉంటుంది. అందులోభాగంగానే ఈ రోజు రూ. రెండు లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాను. ఇవి ఏపీ అభివృద్ధిని శిఖరాగ్రానికి చేరుస్తుంది. ఏపీ సరికొత్త టెక్నాలజీకి కేంద్ర బిందువు కాబోతోంది. 2023లో దేశంలో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషను ప్రారంభించాం. 2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్నీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యం. అందులో మొదట రెండింటిలో ఒకటి విశాఖ పూడిమడకలో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేశాం. దేశంలో మూడు చోట్ల తరహా పార్కులు ఏర్పాటవుతున్నాయి. అందులో నక్కపల్లి ఒకటి. మా ప్రభుత్వం పట్టణీకరణ ఒక అవకాశంగా చూస్తోంది. ఆ విజన్ సాకారానికి క్రిస్ సిటీకి శంకుస్థాపన చేశాం. ఆంధ్రలో వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి, శ్రీసిటీలో ఉత్పత్తి, తయారీ రంగంలో ముందుకెళ్తంది. విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కల నెరవేరుస్తున్నాం. ఏపీ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుంది. ఇంకా ఏపీలొ 70 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా మారుస్తున్నాం. ఏడు వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాం. శతాబ్దాల ముందు నుంచే విశాఖకు వాణిజ్య, నౌక, మత్స్యరంగాల్లో చాలా ప్రాముఖ్యత ఉంది. అది ఈనాటికీ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి, ఆ ఫలాలు అందరికీ అందాలి.. ఆ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం' అని ప్రధాని తన ప్రసంగాన్ని ముగించారు.

వేదికపైన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

 

మనిద్దరిదీ ఒకటే స్కూలు : చంద్రబాబు

ప్రధాని సభలో చంద్రబాబు ఆసక్తికర ప్రసంగం చేశారు. తొలుత మంత్రి లోకేష్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు మాట్లాడాక చంద్రబాబు ప్రసంగించారు. దేశం మెచ్చే ఏకైక నాయకుడు ప్రధాని మోదీ అని తన ప్రసంగాన్ని ప్రారంభించారు చంద్రబాబు.. ఆయన ఇంకా ఏమన్నారంటే? భవిష్యత్తులోనూ మా కాంబినేషన్ కొనసాగుతుంది. కేంద్రంలో ప్రధానిగా మోదీనే ఉంటారు. మోదీ గారూ.. మేమంతా మీ వెంటే ఉంటాం మోదీ గారు.. ఏపీకి విభజనలో న్యాయం జరగలేదని మోదీ న్యాయం చేస్తున్నారు. ఏడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులకు సహకరించారు. ఎన్నో కష్టాలున్నా. సూపర్ 6 హామీలు అమలు చేస్తాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అరకు కాఫీని మోదీ ప్రమోట్ చేశారు. ప్రపంచం మొత్తం ఫేమస్ బ్రాండ్ అయిందంటే మోదీనే కారణం. మీ నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. మీ ఆశీస్సులతో అమరావతి బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం. పోలవరం కూడా మీ నాయకత్వంలో ముందుకెళ్తాంది. త్వరలో నదుల అనుసంధానం కూడా చేస్తాం. మీకు కృతజ్ఞతలు నక్కపల్లిలో మిట్టల్ స్టీల్స్టాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐరన్ ఓర్ తరలింపునకు పైప్ లైన్ అవసరం ఉంది. దానిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి గూగుల్ సంస్థ రావడానికి మోదీ సహకరిస్తున్నారు. ఇంకేమి కావాలి? మనిద్దరిదీ ఒకటే స్కూలు.. ఒకేలా పయనిస్తున్నాం. ఇండియాకు రైట్ టైంలో రైట్ ప్రధాని వచ్చారు. ఈయన గ్లోబల్ లీడర్. ఎన్డీయే బలంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుంది' అని ముగించారు. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, లోకేష్, కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ నమూనా

 

వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

+ అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబక్కు రూ.1,85,000 కోట్లు.

+ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం రూ.149 కోట్లు

+ రాష్ట్రంలో పది జాతీయ రహదార్ల నిర్మాణం / విస్తరణ ప్రాజెక్టులకు రూ.4,593 కోట్లు

+ కృష్ణపట్నం పారిశ్రామిక పార్కు రూ.2,139 కోట్లు + ఆరు రైల్వే ప్రాజెక్టులు రూ.6,028 కోట్లు

+ నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కు రూ.1,877 కోట్లు

+ 234.28 కి.మీల మేర రోడ్లు (ఏడు ప్రాజెక్టులు) రూ.3,044 కోట్లు

+ 323 కి.మీల మేర మూడు రైల్వే లైన్లు (2 రాయలసీమ ప్రాజెక్టులు) రూ.5,178 కోట్లు.

+ మొత్తం వీటి విలువ రూ.2,08,540 కోట్లు

రోడ్‌షోలు ప్రధాని మోదీ అభివాదం

అంతకుముందు విశాఖలో ప్రధాని రోడ్డు షో

అంతకుముందు ప్రధాని మోదీ విశాఖ నగరంలోని సిరిపురం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం కాలేజీ గ్రౌండ్స్ వరకు కిలోమీటరు మేర రోడ్డు షో నిర్వహించారు. ప్రత్యేక వాహనంపై నుంచి తన కోసం వేచి ఉన్న జనానికి అభివాదం చేస్తూ ముందుకెళ్లారు. దారి పొడవునా ప్రధానికి ప్రజలు పూలవర్షం కురిపించారు. మోదీతో పాటు వాహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిలు ఉన్నారు. మోదీకి ఇరువైపులా చంద్రబాబు, పవన్లు నిలబడగా పురందేశ్వరి వారి వెనక నిల్చున్నారు. ప్రధాని మోదీ ప్రజలకు ఒక చేయిని ఊపుతూ అభివాదం చేయగా చంద్రబాబు తన సహజ శైలిలో రెండు వేళ్లతో, పవన్ కల్యాణ్ రెండు చేతులు జోడించి ప్రజలకు నమస్కరించారు. 

Tags:    

Similar News