విశాఖ ఉక్కును కాపాడుకుంటాం
కూటమి సర్కార్‌పై విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతోంది.
By : The Federal
Update: 2025-09-29 08:47 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం కాకుండా కాపాడు కోవడం కోసం కార్మికుల ఉద్యమం కూటమి ప్రభుత్వంపై మరింత ఉధృతమైంది. ఈ ఉద్యమం మలి దశకు చేరుకుంటూ, ఈ నెల 30న అమరావతిలో భారీ సమావేశానికి పోరాట కమిటీ ప్రణాళిక సిద్ధం చేసింది. విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టేందుకు పోరాట కమిటీ ప్రయత్నిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ సంస్థ అయిన ఆర్సెలర్ మిట్టల్‌కు కూటమి ప్రభుత్వం సేవలు అందిస్తోందని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో ఆర్సెలర్ మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చూపడం లేదని జేఏసీ నేతలు విమర్శించారు. ఈ వైఖరి ప్రజలను వంచించడమేనని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని వారు ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం మరింత తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.