మంచి మందు ఇస్తాం.. మీ భర్తలు తాగకుండా చూసుకోండి
కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్నాం. మంచి బ్రాండ్లుంటాయి. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడే కొనుక్కోవచ్చని సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళఃలకు చెప్పారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-10-01 13:18 GMT
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కర్నూలు జిల్లాలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఏవేవో మద్యం బ్రాండ్లు తెచ్చి అమ్మి అందరి ఆరోగ్యం పాడు చేశారు. మన ప్రభుత్వం అలా కాదు. అన్ని రకాల బెస్ట్ బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయి. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం అందిస్తారు. కాబట్టి మద్యం పాలసీ అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. గత ప్రభుత్వ విధానం వల్ల ఒక పద్దతీ పాడు లేకుండా పోయిందని, మద్యం పేరుతో కోట్లు దోచుకున్నారని విమర్శించారు.
ఇదే సమయంలో డ్వాక్రా మహిళలకు ఒక ప్రత్యేక సూచన కూడా చేశారు. మంచి బ్రాండ్లు ఇస్తున్నాం.. వేరే రాష్ట్రాలకు వెళ్లకుండా చేస్తున్నాం. అందరీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మద్యం పాలసీని తీసుకొస్తున్నాం. అయితే మీరొక పని చేయాలి. మీ భర్తలను మద్యానికి దూరంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. మద్యం దుష్ప్రభావాలపై డ్వాక్రా సమావేశాల్లో చర్చించండి. తగిన నిర్ణయాలు తీసుకోండి. అంటూ డ్వాక్రా మహిళలకు ఉచిత సలహా కూడా ఇచ్చారు. ఈ మాటలు డ్వాక్రా మహిళల్లో చర్చకు దారి తీసాయి. కొనుక్కోనేందుకు దుకాణాల్లో మద్యం పెట్టి మా మొగోళ్లను పోవద్దంటే ఊరుకుంటారా? అంటూ అక్కడకు వచ్చిన వారంతా నోరెళ్లబెట్టం విశేషం.
ఏదైతేనేం.. రాష్ట్రంలో నాణ్యమైన మద్యాన్ని తాము తక్కువ ధరకు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పకనే చెప్పారు. గత ప్రభుత్వం నాశిరకం మద్యాన్ని విపరీతమైన ధరలకు విక్రయించి మద్యం ప్రియులను పీల్చి పిప్పి చేసిందనే ఆలోచనలు రేకెత్తించే విధంగా సీఎం వ్యాఖ్యలు చేశారు.
దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తాం: సీఎం
ప్రతి ఇంటికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసే పథకానికి దీపావళికి శ్రీకారం చుడతామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, తానే ఇళ్లకు వచ్చి వంట చేస్తానని సీఎం చెప్పడంతో సభలో నవ్వులు విరిచాయి. మహిళలు ప్రభుత్వం వచ్చి నాటి నుంచి ఉచిత సిలిండర్లు ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు ఏడాదికి 3 సిలిండర్ల కంటే ఎక్కువ వినియోగించుకునే అవకాశం లేదు. ఒక వేళ ఎక్కువ వాడారనుకుంటే మరొక సిలిండర్ అవసరం అవుతుంది. పేద మధ్యతరగతి వర్గాలకు ఈ పథకం వరం వంటిది. ఇంకా నెల రోజులు సిలిండర్ల పథకం కోసం మహిళలు ఎదురు చూడాల్సిందే.