ఆటోలో తిప్పుతూ బాలికపై సామూహిక అత్యాచారం..నిందితుల్లో తండ్రీకొడుకులు
మంత్రి నారా లోకేష్ సొంత అసెంబ్లీ నియోజక వర్గం మంగళగిరిలో ఈ దారుణం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం, మంత్రి నారా లోకేష్ సొంత అసెంబ్లీ నియోజక వర్గం కేంద్రమైన మంగళగిరి పట్టణంలో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణం చోటు చేసుకుంది. ఒక మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బాధితురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో, ముగ్గురు నిందితులు ఆమెను మాయమాటలతో నమ్మించి ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు.
వరుస అకృత్యాలు
నిందితులు బాలికను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి క్రూరంగా ప్రవర్తించారు. షేక్ ఖాదర్ బాషా (50), షేక్ సలీమ్ (42), షేక్ రబ్బానీ (39) మొదట బైపాస్ రోడ్డు వెంబడి బాలికపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత సలీమ్ అనే నిందితుడు బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్లి మళ్లీ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో వదల్లేదు. తండ్రి కొడుకులైన ఖాదర్ బాషా, అతని కుమారుడు కమల్ సాహెబ్ (25) కలిసి బాలికను తాడేపల్లికి తీసుకెళ్లి అక్కడ కూడా అఘాయిత్యానికి ఒడిగట్టారు.
స్థానికుల అప్రమత్తతతో విముక్తి
చివరికి నిందితుడు రబ్బానీ బాలికను మరో సారి అత్యాచారం చేసేందుకు ఆటోలో తీసుకెళ్తుండగా, ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆటోను అడ్డుకున్నారు. నిందితుల నుంచి బాలికను విడిపించగా, ఆమె నేరుగా ఇంటికి వెళ్లి తల్లికి జరిగిన దారుణాన్ని వివరించింది. వెంటనే తల్లి మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తీవ్ర గాలింపులు చేపట్టారు. సీఐ వీరాస్వామి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి డాన్ బోస్కో ప్రాంతంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు: షేక్ ఖాదర్ బాషా, షేక్ సలీమ్, షేక్ రబ్బానీ, కమల్ సాహెబ్.
చర్యలు: నిందితులపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.
బాధితురాలిని మెరుగైన వైద్యం పరీక్షల నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. నిందితులను మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లి సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పుతున్న మంత్రి నారా లోకేష్ సొంత నియోజక వర్గమైన మంగళగిరిలో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడంతో స్థానికుల్లో ఇది తీవ్ర చర్చగా మారింది.