ప్రత్యేక హోదాకు ప్యాకేజీ సరిపోదు.. లోక్‌సభలో వైసీపీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ప్రత్యేక హోదా కూడా ఉందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల్లో ప్రత్యేక హోదా కూడా ఉందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు వరకు ప్రతి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీలు ఇచ్చాయని, కానీ ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ అనడం సరికాదంటూ ఆయన లోక్‌సభలో వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేటీ ఏ కోశాన సరితూగదని, ఆంధ్రకు ప్రత్యేక హోదానే కావాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు, చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కూడా మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తానన చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పరిస్థితులు చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా అన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.
చంద్రబాబు చెప్పాలి..
ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ అంటే చంద్రబాబు ఎలా అంగీకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు మిథున్ రెడ్డి. అదే విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఏవిధంగా ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం అవుతుందో కూడా చంద్రబాబు వివరించాలని కోరారు. ఈరోజు ఢిల్లీ పర్యటనలో మిథున్ రెడ్డి.. ఆంధ్రకు ప్రత్యేక హోదాపై వ్యాఖ్యానించారు. కాగా లోక్‌సభలో కూడా ఆయన పలు కీలక అంశాలను లేవనెత్తారు. బడ్జెట్‌పై జరిగిన చర్చ సందర్భంగా చంద్రబాబు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలను కూడా లేవనెత్తారు.
సూపర్ సిక్స్ ఎక్కడ
ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలకు మభ్యపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి అమలు విషయంలో మిన్నుగుండిపోయారని విమర్శించారు మిథున్ రెడ్డి. తాజాగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. తామిచ్చిన సూర్ సిక్స్ హామీలను చూస్తే తమకే భయమేస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారని, అలివిమాలిన హామీలు ఎవరు ఇవ్వమన్నారంటూ మండిపడ్డారు. సూపర్ సిక్స్ హామీలను సారీ సిక్స్‌గా మార్చవద్దని, ప్రజలకు ఇచ్చి ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సూపర్ సిక్స్ హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో కూడా చంద్రబాబు వెల్లడించాలని చెప్పారు. వీటి అమలు కోసం ప్రజలకు కళ్ళలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారని చెప్పారు.
అమరావతికి కావాల్సింది రుణం కాదు..
అదే విధంగా కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణం కోసం కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పిన విషయాన్ని మిథున్ రెడ్డి లేవనెత్తారు. అమరావతికి రూ.15వేల కోట్ల రుణం వద్దని, అదే మొత్తం గ్రాంట్‌గా కావాలని కోరారు. దాంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధి కోసం విశాఖ స్టీల్‌కు గనులు కేటాయించి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాటిపోయినా విశాఖ మెట్రో, కడప స్టీల్ ఊసే లేదని, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బడ్జెట్లో రూ.11లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను తగ్గించొద్దు’’ అని సూచించారు.