'మా బిడ్డలకైనా నీరు దక్కుతుంది' అని ఆశపడ్డాం

భూసేకరణకు సార్థకత కలిగించండి..రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి అంటూ రైతులు సమావేశం నిర్వహించారు.

Update: 2025-10-24 13:05 GMT

భూసేకరణకు సార్థకత కలిగించండి..రాయలసీమ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీరు అందించండి అన్న నినాదంతో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక భాగస్వామ్యంతో శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్ నందు బహిరంగసభ జరిగింది. ఈ బహిరంగసభకు ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక నాయకులు, ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి ప్రజా, రైతుసంఘాలు, రైతు నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా బహిరంగసభకు అద్యక్ష్యత వహించిన రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ.. ​శ్రీశైలం నిర్మాణానికి 60 వేల ఎకరాలు త్యాగం చేశాం. మా ఊళ్లు, మా భూములు, మా జీవితాలు నీట మునిగాయి. గుండెల నిండా బాధను దిగమింగుకుని, 'మా బిడ్డలకైనా నీరు దక్కుతుంది' అని ఆశపడ్డాం. ​కానీ... ఏం జరిగింది..? ​శ్రీశైలం గేట్లు ఎత్తితే ఒక్క చుక్క నీరు కూడా మా రాయలసీమకు రాదు. చరిత్రలోనే ఇంతకంటే పెద్ద అన్యాయం ఉంటుందా? అని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
శ్రీశైలం ప్రాజెక్టు వలన రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాం అని నాలుగు దశాబ్దాల కిందట పాలకులు హామీ ఇచ్చినా నేటికీ ఏ ప్రభుత్వం కూడా ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. ఇది రాయలసీమ ప్రజలకు ​దశాబ్దాల నిరీక్షణ... తీరని ఆశగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. SRBC, HNSS, GNSS, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులు మొదలుపెట్టారు. ​మా ప్రాణంగా చూసుకున్న 3 లక్షల ఎకరాల భూమిని మళ్ళీ ప్రాజెక్టుల కోసం మళ్లీ ఇచ్చాం. 80-90% పనులు పూర్తయ్యాయి... కానీ ఆగిపోయాయి. ​14 లక్షల ఎకరాలకు నీరు దక్కాల్సిన చోట... కాలువల ద్వారా నేరుగా నీరు అందుతున్నది కేవలం 2 లక్షల ఎకరాలకే. ​మరో రెండు లక్షల ఎకరాలకు మోటార్లు పెట్టి, అప్పులు చేసి, ఎకరాకు రూ. 20-40 వేలు ఖర్చు చేసి... గుండె ఆగినంత పనిగా నీళ్లు ఎత్తిపోసుకుంటున్నాం. ​మిగిలిన రైతులేమో ఆకాశం వైపు చూస్తూ... కన్నీరు కారుస్తూ... మానసిక వేదనతో కుమిలిపోతున్నాం. రైతుల కష్టం పాలకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
రాయలసీమలో​ పూర్తవ్వాల్సిన 10-20% పనులను పూర్తి చేయని ప్రభుత్వం మళ్లీ కొత్తగా భూసేకరణలకు ప్రణాళికలు రచిస్తోందనీ, ​పోతిరెడ్డిపాడు నుంచి మాకు రావాల్సిన నీటిని... నిప్పుల వాగు, గాలేరు, కుందూ నదుల మార్గంగా సముద్రంలోకి తరలించే కుట్ర జరుగుతోంది...ఇది మా నీటిపై ద్రోహం తలపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ​మాకు కావాల్సింది బిచ్చం కాదు..మాకు చట్టబద్దంగా సంక్రమించిన హక్కులను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ​పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ప్రాజెక్టు పనులను, పంట కాలువల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి...​శ్రీశైలం ప్రాజెక్టులో రాయలసీమకు బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన హక్కులను అమలుపరచాలనీ, నిప్పుల వాగు, గాలేరు, కుందూ నది విస్తరణ పనులను వెంటనే ఆపాలి, ​రాజోలి, జోలదోరాశి రిజర్వాయర్ల కోసం భూములు ఇచ్చిన రైతులకు తక్షణమే పరిహారం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక కన్వీనర్ మహాదేవ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ని అమ్మకాలప్రదేశ్ గా పాలకులు మార్చారని ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అంధకార దిశగా మారే ప్రమాదం పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం నుంచి లాగేశారు...ఇప్పుడు సొమ్ములు సంపాదించడానికి బనకచర్లను తెరపైకి తీసుకొచ్చారు.. ఇది ప్రజల కోసం కాదు...నాయకుల జోబులు నింపడానికే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవాలో భాగమైన పందికోన రిజర్వాయర్ కింద ఆయకట్టు కాలువలకు రెండు వందల కోట్లను విడుదల చేయడానికి మనసొప్పని ప్రభుత్వం ఎనభైవేల కోట్ల రూపాయలతో పోలవరం బనకచర్ల ను చేపట్టడం ఇది ప్రజల కోసం కాదనీ కేవలం ప్రభుత్వ పెద్దల కోసమేనని దుయ్యబట్టారు. రాయలసీమ సమాజానికి ఆంధ్ర ఉద్యమాల వేదిక సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తోందని అన్నారు.
ఈ బహిరంగసభలో గన్నవరం విమానాశ్రయ బాధిత సంఘం నాయకురాలు వేదవతి, రైతుకూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి.వి.రమణయ్య, ప్రజా పరిరక్షణ సమితి నాయకులు హరిక్రిష్ణ, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ రామక్రిష్ణారెడ్డి, జలసాధన సమితి కన్వీనర్ శేషాద్రిరెడ్డి, అనంతపురం జలసాధన సమితి నాయకులు గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News