ఏపీకి ఎంతో చేశాం.. ఇంకా చేస్తాం!

విశాఖలో ఆదివారం జరిగిన సారథ్యం బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాష్‌ నడ్డా పాల్గొన్నారు.;

Update: 2025-09-14 10:35 GMT
ప్రసంగిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో చేసిందని, మున్ముందు ఎంతో చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన పథకాలు, ప్రాజెక్టులను ఆయన ఏకరువు పెట్టారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ బాధ్యతలు చేపట్టాక సార«థ్య యాత్ర పేరిట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజౖరయ్యారు. సభలో ప్రసంగించిన నడ్డా ఇంకా ఏమన్నారంటే?

సభా వేదికపై నడ్డా, బీజేపీ నేతలు 

మోదీ మదిలో ఏపీ.. మోదీ మదిలో ఏపీ..
‘మోదీ మదిలో ఏపీ ఉంది. ఏపీ మదిలో మోదీ ఉంది. అందుకే చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి మోదీ పాటు పడుతున్నారు. ఏపీకి కేంద్రం నుంచి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో తొమ్మిది వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను, 3,300 గ్రామాల్లో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. కాకినాడ, వైజాగ్‌ హార్బర్ల ఆధునీకరణ పనులు చేపట్టాం. ఫిష్‌ ల్యాండింగు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీని ఎడ్కుకేషన్‌ హబ్‌గా మారుస్తున్నాం. ఐఐపీఈ, ఎన్‌ఐటీ, సీయూ, ఐఐఎం, ఐఐఎఫ్‌టీ, ట్రైబల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు పాటుపడ్డాం. విశాఖపట్నం, విజయవాడ, కడప, కర్నూలు, తిరుపతిల విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ.652 కోట్లు ఇచ్చాం. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికీ పాటుపడుతున్నాం. కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలిచ్చాం. కోటీ 20 లక్షల మందికి ఆయుష్మాన్‌ భారత్‌లో ఆరోగ్య సంరక్షణ జరుగుతోంది. విశాఖ తూర్పు తీరంలో ఓ ఆభరణంగా విరాజిల్లుతోంది.
అమరావతికీ తోడ్పాటునందిస్తున్నాం..
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల గ్రాంటు ఇచ్చాం. హాడ్కో ద్వారా రుణం కూడా మంజూరు చేశాం. విభజన చట్టంలో హామీ మేరకు విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఇచ్చాం. అనకాపల్లి జిల్లా పూడిమడకలో రూ.1,85 లక్షల కోట్లతో గ్రీన్‌ హ్రైడోజన్‌ ప్రాజెక్టు, నక్కపల్లి వద్ద రూ.2 వేల కోట్లతో బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరు చేశాం. రూ.4,800 కోట్ల వ్యయం అయ్యే సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఇచ్చాం.

సభకు హాజరైన బీజేపీ శ్రేణులు

అభివృద్ధిని ఊరూ వాడా చాటండి..
కేంద్రంలోని ఏన్డీయే ప్రభుత్వం ఏపీకి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్న సంగతిని కార్యకర్తలు ఊరూరా, ఇంటింటికి తీసుకెళ్లండి. వైసీపీ హయాంలో అవినీతి, అసమర్థ, అరాచక అరాచక పాలన సాగింది. అంధకారంలో మగ్గిపోయింది. ఏడాదిలోనే కూటమి సహకారంతో అంధకారంలో మగ్గిపోతున్న ఏపీని వెలుగు దిశగా తీసుకొస్తున్నాం. అభివృద్ధిలోకి దూసుకెళ్లేలా చూస్తున్నాం. రాష్ట్రం రూపురేఖలు మారుస్తాం. మీరు (కార్యకర్తలు) ఇలాగే పని చేయండి. ఏపీ ప్రజలు మళ్లీ మళ్లీ మనలను ఆశీర్వదిస్తారు.
మోదీ వచ్చాక మార్పును గుర్తించాలి..
మోదీ ప్రధాని అయ్యాక దేశంలో వచ్చిన మార్పులను అంతా గుర్తించాలి. స్పందించే ప్రభుత్వాన్ని చూస్తున్నారు. చెప్పిన ప్రతి పనిని మోదీ చేసి చూపిస్తున్నారు. ప్రపంచలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. బీజేపీ ఒక సైద్ధాంతిక పునాదులపై నిర్మితమైంది. జమ్మూ కాశ్మీర్‌పై రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేశాం. జీఎస్టీని రెండు స్లాబులకే పరిమితం చేసి దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం. రక్షణరంగంలో ఏడు రెట్లు ప్రగతి సాధించాం,’ అని నడ్డా వివరించారు.

మాట్లాడుతున్న కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ 

ప్యాకేజీతో ఉక్కును నిలబెట్టాంః కేంద్రమంత్రి వర్మ..
సభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ ’నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీనిచ్చి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. మోదీ హయాంలో ఏపీ, విశాఖ అభివృద్ధి సాధిస్తోంది. అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు ఇచ్చారు. నక్కపల్లిలో 1.35 కోట్ల ఆర్సెలార్‌ మిట్టల్‌కు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తోంది’ అని చెప్పారు.
ఫ్రీ బస్సుల్లో వెళ్లి గొడవ పడుతున్నారుః సత్యకుమార్‌
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేసిందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ చెప్పారు. ‘ఉచిత బస్సు పథకం మహిళలకు ఎంతో సంతోషం తెచ్చింది. గతంలో తోటికోడళ్లు, ఆడపడచులతో ఫోన్లో గొడవపడేవారు.. ఇప్పుడు నేరుగా బస్సుల్లో వెళ్లి గొడవ పడి వస్తున్నారు. పూటకో ఊరెళ్లి సీరియల్స్‌ చూసి వస్తున్నారు. ఇవ్వన్నీ చేయమని చెప్పడం లేదు. కానీ అలాంటి సౌలభ్యాన్ని కల్పించామని చెబుతున్నాం. రాష్ట్రానికి విభజన హామీలన్నీ నెరవేరాయి. ఏపీకి అన్ని రంగాల్లో కేంద్ర నిధులొస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌

ఏపీలో బీజేపీ బలోపేతంః మాధవ్‌
‘సారధ్యం యాత్ర బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి బలోపేతానికి ఆరంభమని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. ‘దీపావళి, దసరా ఒకేసారి వచ్చినట్టుగా జీఎస్టీ సరళీకరణ జరిగింది. వస్తువులు, సరకుల ధరలు తగ్గుతాయి. కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలి. కేంద్రం విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చి చిరకాల కలను సాకారం చేసింది. విశాఖ ఉక్కుకు 11,440 కోట్లు గ్రాంటు ఇవ్వడంతో నడుస్తోంది’ అని చెప్పారు. తొలుత జేపీ నడ్డా అరకు కాఫీ స్టాల్‌ను సందర్శించి కాఫీని రుచి చూశారు. పొందూరు ఖద్దరు, ఏటికొప్పాక బొమ్మల స్టాళ్లను సందర్శించారు. సభలో జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Tags:    

Similar News