బార్ లైసెన్సులు మాకొద్దు బాబోయ్...
ఏపీలో బార్ లైసెన్స్ లు పొందేందుకు మద్యం వ్యాపారులు ముందుకు రావడం లేదు. మంగళవారం రాత్రితో గడువు ముగియనుంది.;
ఏపీలో బార్ లైసెన్సుల అప్లికేషన్లకు స్పందన కరువైంది. సోమవారం సాయంత్రం 7 గంటల సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 57 బార్లకు 90 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. సోమవారం సాయంత్రం వరకు 9 బార్లకు మాత్రమే నాలుగు, అంతకంటే ఎక్కువ అప్లికేషన్ లు వచ్చాయి. పాలసీలో డ్రా జరగాలంటే బార్‌కు కనీసం నాలుగు అప్లికేషన్లు రావాలి. ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించినవి పూర్తి అప్లికేషన్లుగా ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. వారు లైసెన్స్ కు దరఖాస్తు చేయవచ్చు. లేదా మానుకోవచ్చు. ప్రాజెసింగ్ ఫీజు రూ. 10వేలు చెల్లించి వివరాలు నమోదు చేసుకున్న వారు 1972 మంది ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం 3.30 గంటల సమయానికి ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు.
కొత్త పాలసీతో బార్లు కుదేల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025–28 కొత్త బార్ పాలసీని ఆగస్టు 13, 2025న ప్రకటించింది. ఈ పాలసీ రాష్ట్ర మద్యం పరిశ్రమలో పారదర్శకత, సామాజిక సమానత, ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ కింద 840 బార్ లైసెన్సులు ఓపెన్ కేటగిరీలో నోటిఫై చేశారు. అదనంగా 10శాతం (84 లైసెన్సులు) గీత కులాల సామాజిక వర్గాల వారికి (కల్లు గీత దారులు) కోసం 50 శాతం రాయితీపై రిజర్వ్ చేశారు. లైసెన్సులు పబ్లిక్ డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా కేటాయిస్తారు. సెప్టెంబర్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2028 వరకు మూడేళ్లు చెల్లుబాటవుతాయి. సంవత్సరానికి ఫీజులు రూ. 35 లక్షల నుంచి రూ. 75 లక్షల వరకు నిర్ణయించారు. (ప్రతి ఏటా 10 శాతం పెరుగుదల) అప్లికేషన్లు ఆగస్టు 18న ప్రారంభమయ్యాయి. డెడ్‌లైన్ ఆగస్టు 26 సాయంత్రం 5 గంటలు. డ్రా ఆగస్టు 28న జరుగుతుంది.
ప్రతి ఏటా 10 శాతం లైసెన్స్ ఫీజు పెంపు
కొత్త విధానంలో ఆకర్షణీయంగా బార్ నిర్వహణలు లేవు. ప్రతి అప్లికేషన్‌కు రీఫండ్ కాని రూ.5 లక్షల ఫీజు రూ. 10,000 ప్రాసెసింగ్ చార్జ్ ఉంటుంది. ఇది భారీ ముందస్తు ఖర్చు. లాటరీలో అవకాశాలు పెంచుకోవడానికి బహుళ ఎంట్రీలు సమర్పించవచ్చు. బార్‌కు నాలుగు అప్లికేషన్లు రాకపోతే ఫీజులు వ్యర్థమవుతాయనే భయం మొదట ఉండేది. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఆగస్టు 22న ఫీజులు రీఫండ్ చేస్తామని స్పష్టం చేసింది. సంవత్సరానికి లైసెన్స్ ఫీజులు (రూ. 35–75 లక్షలు) 10 శాతం సంవత్సరానికి పెరుగుదల చిన్న నిర్వాహకులకు ప్రమాదకరం.
బార్లు రిటైల్ షాపులతో పోలిస్తే మద్యం కొనుగోళ్లపై 15 శాతం అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET) ఎదుర్కొంటాయి. ఇది ఖర్చులు పెంచి లాభాలు తగ్గిస్తుంది. స్టేక్‌హోల్డర్లు ఇది బార్లను ఇబ్బందికర స్థితిలోకి నెడుతుందని వాదిస్తున్నారు. ముఖ్యంగా రూ.99 ధరలో 180 ml మద్యం బాటిళ్లు బార్లలో సర్వ్ చేయకూడదు.
NDA ప్రభుత్వం రిటైల్ మద్యం షాపుల పక్కన 'పర్మిట్ రూములు' అనుమతించింది. వాటి సమయాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10ల వరకు పొడిగించింది. గతంలో షాపులు ఉదయం పది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మాత్రమే పనిచేసేవి. బార్ వ్యాపారాన్ని రిటైల్ వైన్ షాపులు లాగేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. 2024లో 3,396 అవుట్‌లెట్లకు 65,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి.
వేలాల నుంచి లాటరీలకు మార్పు న్యాయబద్ధత లక్ష్యంగా ఉంది. ఇది అనిశ్చితి తెస్తుంది. ఫీజులు చెల్లించినా కేటాయింపు హామీ లేదు. బార్‌కు నాలుగు అప్లికేషన్లు అవసరం. ఇది ఎంతోమంది ఆశావహ బిడ్డర్లను వెనక్కి నెడుతుంది. 2019లో 645 అప్లికేషన్లు 2022లో 1,140 అప్లికేషన్లు వచ్చాయి. అవి వేరే పాలసీల కింద ఫీజులు తక్కువ ఉన్నాయి.
తెలంగాణ షాపుల వైపు ఏపీ మద్యం వ్యాపారుల చూపు
ఆంధ్రప్రదేశ్ మద్యం వ్యాపారులు తెలంగాణ రిటైల్ షాప్ పాలసీ (సెప్టెంబర్ 2025 నుంచి) వైపు చూస్తున్నారు. ఇది 2,620 అవుట్‌లెట్లలో సంవత్సరానికి రూ. 5 లక్షల ఫీజులతో వాక్-ఇన్ స్టోర్లలో ఎక్కువ లాభాలు వచ్చేలా చేస్తుంది. ఈ సరిహద్దు ఆసక్తి అప్లికేషన్లను అటువైపు మళ్లిస్తుంది.
మంచి రోజుల కోసం కొందరు దరఖాస్తులు చేద్దామని ఎదురు చూస్తారు. అశుభ రోజుల్లో (ఆగస్టు 23న అమావాస్య) దరఖాస్తులు చేసేందుకు వెనుకాడతారు. ఆగస్టు 26 దరఖాస్తులకు ఆఖరు రోజు కావడంతో పెరుగుదల ఆశిస్తున్నారు. లేకపోతే డెడ్‌లైన్ పొడిగించవచ్చు.
కమిషనర్ ఆశలు అడియాశలే...
ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ ఆగస్టు 26న "రష్" ఆశిస్తున్నారు. రీఫండ్ స్పష్టత, డెడ్‌లైన్ పొడిగింపు ఈ అంశాన్ని ప్రభావితం చేస్తాయి. మొత్తం బార్లకు కనీసం 3,360 అప్లికేషన్లు అవసరం. కానీ మంగళవారం నాడు సాయంత్రం మూడున్నర వరకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాకపోవడంతో బార్ల కోసం దరఖాస్తులు చేసే వారిని వేళ్ల మీద లెక్కించాల్సిందేనని మద్యం వ్యాపారులు చెబుతున్నారు.
దరఖాస్తు ఫీజులు భరాయించలేక...
కేవలం ఆదాయ లక్ష్యాన్ని దృష్టిలో (ఫీజుల నుంచి రూ. 200 కోట్లు, లైసెన్సుల నుంచి రూ. 5,000 కోట్లు) ఉంచుకుని ప్రభుత్వం ఆలోచనలు చేయడం కూడా దరఖాస్తుల తగ్గుదలకు కారణంగా చెప్పొచ్చు. పాలసీలో సామాజిక రిజర్వేషన్ దారులకు 50 శాతం రాయితీ, షాపులకు రాత్రి పది గంటల వరకు అవకాశం ఇవ్వడం కూడా తమను దెబ్బతీసే అవకాశం ఎక్కువగా ఉందని బార్లకు దరఖాస్తులు చేయాలనుకునే వారు ఆలోచిస్తున్నారు. గత పాలసీలతో పోలిస్తే కొన్ని కేటాయింపులలో బార్‌కు సగటున 131 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుత లాటరీ వ్యవస్థ ఊహాగానాలను తగ్గిస్తుంది. నిజమైన ఆసక్తిని కూడా తగ్గిస్తుంది.
వైన్ షాపులకు పర్మిట్ రూములు బార్లను దెబ్బ కొట్టాయి
వైన్ షాపులకు పర్మింట్ రూములు ఇవ్వడం వల్ల వారు ప్రత్యేకంగా మద్యం ప్రియులు కూర్చొనేందుకు ఫ్యాన్ లు ఏర్పాటు చేసి మంచినీళ్లు అరేంజ్ చేస్తున్నారు. దీంతో బార్లకు వెళ్లే మద్యం ప్రియుల సంఖ్య బాగా తగ్గిందని విజయవాడలోని బార్ యజమాని కె చలపతిరావు (పేరు మార్చాము) (తమ పేర్లు చెబితే ఎక్సైజ్ వారి నుంచి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. అందువల్ల పేరు మార్చాల్సి వచ్చింది) తెలిపారు. విజయవాడ నగరంలో 110 బార్లు ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో ప్రతి బారు కూడా నష్టాల్లోనే ఉందని ఆయన చెప్పారు. వైఎస్ జగన్ మద్యం విధానం వల్ల వైన్ షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండటం, అక్కడ సరైన బ్రాండ్స్ లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో బార్లకు మద్యం సేవించే వారు వచ్చే వారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.
మద్యం ప్రియులకు వైన్ షాపులు హుషారు పుట్టిస్తున్నాయి. అన్ని రకాల బ్రాండ్స్ ఎంఆర్పీ ధరలకు అందుబాటులో ఉన్నాయి. దీంతో కొనుగోలు చేసిన వారు పర్మిట్ రూముల వద్ద కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ మద్యం తాగుతున్నారని బార్ల యజమానులు చెబుతున్నారు.
బార్లపై మోపిన అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ARET) ను రద్దు చేయాలని బార్ల యజమానులు కోరుతున్నారు. దీని వల్ల వైన్ షాప్స్ కంటే ఎంఆర్పీపై 15 శాతం అధికంగా డబ్బులు పెట్టి మద్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. ప్రతి బార్ ఏర్పాటుకు నాలుగు దరఖాస్తులు ఉండాలనే నిబంధనలు ఎత్తివేయాలని బార్స్ లైసెన్స్ కు దరఖాస్తు చేసే వారు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం 10 శాతం లైసెన్స్ ఫీజు పెంపును కూడా రద్దు చేయాలని వారు కోరుతున్నారు.