చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం
కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.;
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఐదేళ్లు, వైసీపీ ప్రభుత్వంలో భయానక పరిస్థితుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా జీవిస్తున్నారని అన్నారు. డెవలప్‌మెంట్, వెల్ఫేర్‌లతో పాటు సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా పని చేస్తున్నట్లు తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వివాళులు అర్పించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆయన తిలకించారు. పీ–4 క్యాక్రమాల లబ్ధిదారులతో సీఎం సమావేశం అయ్యారు. మార్గదర్శులు, బంగారు కుటుంబం లబ్ధిదారులతో సీఎం చంద్రబాబు నాయుడు ముఖా ముఖి నిర్వహించారు. అలాగే సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులకు చెందిన మహిళలతో సీఎం సంభాషించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ వర్గాల ప్రజలతో ఆయన మాట్లాడారు. విదేశీ విద్య దీవెన పథకం కింద లబ్ది పొంది ఇతర దేశాలలో చదువుకుంటున్న యువతీ యువకులతో జూమ్ లో సీఎం చంద్రబాబు సంభాషించారు. అనంతరం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అంబేద్కర్ హక్కులను పొందుపరిచారని, ప్రజలందరూ స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి రాజ్యాంగమే కారణమని అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ జీవితాంతం పోరాటాలు సాగించారని అన్నారు. అంబేద్కర్ చూపిన మార్గంలో అందరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో దళితులకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. దళిత వర్గానికి చెందిన జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. అంతేకాకుండా దళితులు దాదాపు 8లక్షల ఎకరాల భూమిని పంచిన ఏకైక పార్టీ కూడా టీడీపీనేనని సీఎం చంద్రబాబు అన్నారు. నాడు ఎన్టీఆర్ దళితుల గురించి ఆలోచన చేసి, వారి కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలను నెలకొల్పారని గుర్తు చేశారు.