‘సూపర్-6లో మొదటిది ఆడబిడ్డ నిధి’

తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు.. తమ సూపర్ 6 పథకాలను ప్రకటించారు. కూటమి ప్రభుత్వం తప్పకుండా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.

Update: 2024-04-10 17:37 GMT
ఆంధ్ర ఎన్నికల్లో కూటమి నిర్దిష్టమైన అజెండాతో ముందుకు వస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ సూపర్-6 అజెండాతో ప్రజల ముందు వస్తుందని, అందులో మొదటిది ఆడబిడ్డ నిధి అని తణుకులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను యథాతథంగా కొనసాగిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ప్రజలకు తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆడబిడ్డ ఉన్న స్త్రీలకు నెలకు రూ.1500 అందిస్తాం. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే రూ.3000, ముగ్గురు ఉంటే రూ.4,500, నలుగురు ఉంటే రూ.6వేల ఇస్తామని, ఈ డబ్బును ప్రతి నెల ఒకటో తేదీనే ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
సూపర్-6 హామీలివే
వీటిలో మొదటిది ఆడబిడ్డ నిధి కాగా రెండోది ‘తల్లికి వందనం’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘‘తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15,000 ఇస్తాం. ఈ పథకంలో కూడా ఒకరు ఉంటే రూ.15వేలు, ఇద్దరు ఉంటే రూ.30వేలు, ముగ్గురు ఉంటే రూ.45వేలు, ఐదుగురు ఉంటే రూ.75వేలు అందిస్తాం’’ అని వెల్లడించారు. ‘‘మూడో హామీ కింద ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితంగా ఇస్తాం. నాలుగోది.. మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం. ఐదోది.. అన్నదాతలకు రూ.20 వేల వ్యవసాయ సహకారం అందిస్తాం. ఆరోది.. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగవకాశాలు కల్పిస్తాం. వీటన్నింటినీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం’’అని భరోసా ఇచ్చారు.
వాలంటీర్లకు ఢోకా లేదు
తమ ప్రభుత్వం వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగిస్తామని కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ‘‘వాలంటీర్ల జీతాలను తమ ప్రభుత్వం వస్తే రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం. ఈ దెబ్బతో జగన్‌కు ఏం చేయాలో పాలుపోవట్లేదు. అందుకే మంత్రి ధర్మాన.. రాష్ట్రంలో వాలంటీర్లనే వారే లేరని, అందరూ రాజీనామా చేశారని చెప్తున్నారు. నేను వాలంటీర్లకు ఒక్కటే చెప్తున్నా.. ఎవరు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దు. మీకు మేము అండగా ఉంటాం. మీ చేత తప్పుడు పనులు చేయించి మీ జీవితాలు నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్ యోచిస్తున్నారు. జగన్‌ను వాలంటీర్లు గుడ్డిగా నమ్మకుండా ఆలోచించండి. రాష్ట్రాభివృద్ధిలో కీలక భూమిక పోషించండి. అవసరమైతే మీకు రూ.10 వేలు కాదు రూ.1 లక్ష సంపాదించుకునే మార్గం చూపుతా’’అని చంద్రబాబు వెల్లడించారు. రూ.10 ఇచ్చి రూ.100 లాక్కునే దొంగలు కావాలో, మీ సంపదను పెంచే కూటమి కావాలో ఆలోచించుకోండి అని సూచించారు చంద్రబాబు.
Tags:    

Similar News