Revanth-chandrababu water war|రేవంత్-చంద్రబాబు మధ్య ‘వాటర్ వార్’
చంద్రబాబు(Chandrababu) ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల(జీబీ) ప్రాజెక్టుపై రేవంత్(Revanth) తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు.;
చంద్రబాబునాయుడు-రేవంత్ రెడ్డి మధ్య వ్యవహారం ‘ఎక్కడైనా బావకాని వంగతోట దగ్గర కాద’నే సామెతలాగ తయారైంది. వ్యక్తిగతంగా ఇద్దరూ అత్యంత సన్నిహితులన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇపుడు ఇద్దరూ రెండు తెలుగురాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. కాబట్టి రాష్ట్రప్రయోజనాల ముందు వ్యక్తిగత స్నేహాన్ని పక్కనపెట్టాల్సొస్తోంది. విషయం ఏమిటంటే చంద్రబాబు(Chandrababu) ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల(జీబీ) ప్రాజెక్టుపై రేవంత్(Revanth) తీవ్రస్ధాయిలో మండిపోతున్నారు. కేంద్ర జలసంఘం అనుమతిలేకుండా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పకుండా, ఆమోదం తీసుకోకుండానే చంద్రబాబు గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును చేపట్టడంపై రేవంత్ అభ్యంతరం వ్యక్తంచేశాడు. చంద్రబాబు నిర్ణయంపై తెలంగాణప్రభుత్వం అభ్యంతరాలను, నీటికేటాయింపుల్లో రాష్ట్రవిభజన చట్టంలోని సెక్షన్లను ఉదహరిస్తు వెంటనే కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, గోదావరి, కృష్ణానదీ నీటి యాజమాన్య బోర్డులకు లేఖలు రాయాలని ఆదేశించాడు.
విభజన చట్టం ప్రకారం ఏ రాష్ట్రమైనా, ఏ నదిపైన అయినా ప్రాజెక్టు నిర్మించాలంటే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బేసిన్(జీఆర్ఎంబీ), కృష్ణా-రివర్ మేనేజ్మెంట్ బేసిన్(కేఆర్ఎంబీ) అనుమతి తీసుకోవటంతో పాటు తెలంగాణకు సమాచారం ఇవ్వాలన్న విషయాన్ని లేఖలో స్పష్టంగా ప్రస్తావించాలని చెప్పాడు. తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీజలాల వివాదచట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే బలమైన వాదనను వినిపించాలని రేవంత్ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులకు గుర్తుచేశాడు. విభజనచట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టులవారీగా నీటికేటాయింపులు జరగాల్సుంటుందని రేవంత్ గుర్తుచేశాడు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రింకోర్టును ఆశ్రయించినా స్టే దొరకలేదన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించాలని చెప్పాడు. తాజాగా రేవంత్ తీసుకున్న స్టాండుతో గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ముందుకు అడుగుపడుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ముంపు విషయమై హైదరాబాద్ ఐఐటితో అధ్యయనం అంశాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయించాలని కూడా ఆదేశించాడు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దాదాపు పదిహేనేళ్ళ క్రిందట మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు(Polavaram Project) ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. ఈ ప్రాజెక్టు పూర్తవ్వటానికి ముందు చంద్రబాబు తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇపుడు చంద్రబాబు చాలా డెడ్ లైన్లు విధించినవిషయం అందరికీ గుర్తుండేఉంటుంది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే పనిచూడకుండా ప్యారలల్ గా గోదావరి-బనకచర్ల నదుల అనుసంధానం ప్రాజెక్టును టేకప్ చేయటంలో అర్ధంలేదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే చంద్రబాబు ఇపుడు ఎన్డీయేలో కీలక భాగస్వామి కాబట్టి అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏపీ యాంగిల్లో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు ఓకేనే కాని తెలంగాణకు తీరని నష్టం తప్పదని రేవంత్ మాటల్లోనే స్పష్టమవుతోంది.
రేవంత్ అడ్డుకోగలడా ?
తెలంగాణ ప్రయోజనాలకు తీవ్రవిఘాతం కలిగించే గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును రేవంత్ అడ్డుకోగలడా ? అన్నదే పెద్ద సందేహం. గ్రౌండ్ లెవల్లో జరగుతున్నది ఏమిటంటే ఏ రాష్ట్రప్రయోజనాలను ఆరాష్ట్రం చూసుకుంటోంది తప్ప పొరగురాష్ట్రం ఏమైనా తమకు అనవసరం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర(Maharashtra), కొన్ని ప్రాజెక్టుల విషయం తెలంగాణ, ఆల్ మట్టి, కావేరి ప్రాజెక్టుల విషయంలో కర్నాటక(Karnataka) అనుసరిస్తున్న విధానాలే ఇందుకు ఉదాహరణ. పైరాష్ట్రాలవల్ల టెయిల్ ఎండ్ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్(AP) అన్నీరకాలుగా నష్టపోతోంది. అయితే ప్రాజెక్టులను పూర్తిచేయటంలో పాలకుల్లో చిత్తశుద్ది లేకపోవటమే ఏపీకి పెద్ద శాపంగా తయారైంది. ఇపుడు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునే విషయంలో చంద్రబాబుతో రేవంత్ పోరాటం చేయాల్సుంటుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చంద్రబాబుతో రేవంత్ పోరాటం మొదలుపెడితే ఇద్దరి మధ్యా వాటర్ వార్ తప్పేట్లులేదు.
ఇద్దరి మధ్య వాటర్ వార్ మొదలైతే బీఆర్ఎస్, బీజేపీలు ఎలాగూ వార్ ను ఎగదోయటానికి సిద్ధంగా ఉంటాయనటంలో సందేహంలేదు. నిప్పును ఎగదోయటంలో బీఆర్ఎస్ ఎంతవీలైతే అంత ప్రయత్నిస్తుంది. సమస్యంతా బీజేపీకే అన్నది వాస్తవం. ఎలాగంటే అనుసంధాన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది బీజేపీ(BJP) నాయకత్వంలోని ఎన్డీయే(NDA)నే అని అందరికీ తెలుసు. కేంద్రంలో బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టుపై తెలంగాణలో కొట్లాడుతామంటే జనాలు బీజేపీని నమ్మరు. అందుకనే ఔట్ ఎండ్ ఔట్ చంద్రబాబు మీద రేవంత్ ఫైట్ చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. బీఆర్ఎస్(BRS) ఒత్తిడిని తట్టుకునేందుకు అయినా చంద్రబాబు మీద రేవంత్ ఫైట్ చేయాల్సిందే. మరి ఫైట్ ఎప్పుడు, ఏస్ధాయిలో మొదలుపెడతాడో, కంటిన్యుచేసాడో చూడాల్సిందే.