శ్రీశైలానికి తగ్గిన వరద, గేట్లు మూత
మూడు రోజుల పాటు కనువిందు చేసిన శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు.;
By : The Federal
Update: 2025-07-15 06:19 GMT
మూడు రోజుల పాటు కనువిందు చేసిన శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో ప్రాజెక్టు అన్ని గేట్లు మూసివేశారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 65,985 క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రాలలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు. 68,753 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ నీటిమట్టం 882.50 అడుగులు.. నీటినిలువ 201.582 టీఎంసీలుగా ఉంది.
ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా జూరాల డ్యామ్ నుంచి భారీ వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నాలుగు రోజుల కిందట శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) గేట్లను ఎత్తివేశారు. దీంతో కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోంది. నాలుగు రోజుల కిందట ఎగువ నుంచి శ్రీశైలానికి ఇన్‌ఫ్లో 1,47,696 క్యూసెక్కులు వస్తుండగా ఇప్పుడది 68,753 క్యూసెక్కులకు చేరింది. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మూడు గేట్లు ఎత్తారు. రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా 1,48,734 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 880 అడుగుల వద్ద కొనసాగుతుంది. దిగువన ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ (Nagarjuna Sagar Dam)కు కూడా వరద కొనసాగింది. ఈసారి నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వలకు నీళ్లు వదులుతుండడంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.