కుప్పం సవాల్ కు పులివెందులలో వైసీపీపై ట్రయల్ జరిగిందా?
వైఎస్ ఇలాకాలో వాస్తవ పరిస్థితి ఏమిటి?;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-13 10:44 GMT
అధికారంలో ఉండగా వైసీపీ కుప్పం మున్సిపాలిటీని దక్కించుకుని సీఎం ఎన్. చంద్రబాబుకు సవాల్ విసిసింది.
టిడిపి అధికారంలోకి వచ్చాక పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుంది. మరో ఆరు నెలల్లో జరిగే "స్థానిక సంస్థల ఎన్నికలకు పులివెందులలో ఇది ట్రైలర్" అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలో ఏమి జరుగుతోంది. వైసిపి బలం ఎంత? టిడిపికి ఉన్న మద్దతు ఎంత అనే చర్చ ప్రారంభమైంది.
2024 ఎన్నికల్లో "వై నాట్" కుప్పం అని వైసిపి చీఫ్ వైఎస్. జగన్ నినదించారు. టిడిపి కూడా "వై నాట్ పులివెందుల" ఛాలెంజ్ చేసింది. ఇక్కడి నుంచి వైసీపీ చీఫ్ జగన్, టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు, వారి నేతృత్వంలోని పార్టీల మధ్య అగ్గి రాజుకుంది. ఈ విషయం పక్కకు ఉంచితే..
టీడీపీకి దొరికిన అస్త్రం
అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఏడాది తరువాత పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో అస్త్రంగా వాడుకుంది. అర్థ, అంగ బలాలకు తోడుగా అధికారాన్ని ఉపయోగించినట్లు స్పష్టంగా కనిపించింది.
పులివెందుల జెడ్పీటీసీ పదవి కోసం టీడీపీ మాజీ ఎంఎల్సీసీ మారెడ్డి రవీంద్రారెడ్డి (బీటెక్ రవి) భార్య లతారెడ్డిని పోటీ చేయించారు. ఆమెపై దివంగత జెడ్పీటీసీ సభ్యుడు కొడుకు తుమ్మల హేమంతరెడ్డికే మళ్లీ అవకాశం కల్పించారు. ఆరు పంచాయతీల్లోని 10,601 మంది ఓటర్ల కోసం 15 పోలింగ్ కేంద్రాఃలు ఏర్పాటు చేశారు.
పులివెందులలో మంగళవారం ఉదయం నుంచి ఘర్షణల మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
"వైసీపీ మద్దతుదారులను పోలింగ్ కేంద్రానికి సమీపానికి రానివ్వకపోవడం అటుంచి, చివరికి ఏజెంట్లు లేకుండానే పోలింగ్ సాగించారు" అనేది కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణ.
"ఎన్నికలు రద్దు చేసి, కేంద్ర బలగాల సారధ్యంలో అన్ని15 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి" అని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది.
"పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు జరపండి" అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇవ్వడంతో వైసీపీ మద్దతుదారులు ఎవరూ ఓటింగ్ కు వెళ్లని పరిస్థితి. ఈ వ్యవహారాన్ని పక్కకు ఉంచితే..
పులివెందులలో బలం ఎంత
నియోజకవర్గంలో సుమారు 2.12 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 1972 నుంచి 2024 ఎన్నికల వరకు పరిశీలిస్తే, వైఎస్. రాజశేఖరరెడ్డి విజయం సాధించడం ద్వారా నియోజకవర్గంలో పట్టు బిగించారనేది జగమెరిగన సత్యం. ఇప్పటి వరకు ఆయన ఇంటి నుంచి బాబాయ్ వైఎస్. పురుషోత్తం రెడ్డి, తమ్మడు వైఎస్. వివేకానందరెడ్డి, ఆ తరువాత భార్య వైఎస్. విజయమ్మ, ప్రస్తుతం వైఎస్. జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది అందరికీ తెలిసిందే. స్థూలంగా వైఎస్ఆర్ కుటుంబం పులివెందుల అసెంబ్లీ స్థానంలో ఈ స్థాయిలో ప్రాభవం కొనసాగుతోందనే విషయం అర్థం అవుతుంది.
2019 డిసెంబర్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితిని పరిశీలిస్తే, ఆ విషయం అర్థం అవుతుంది. పులివెందుల నియోజకవర్గంలో ఆరు మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు, 101 పంచాయతీలో ఉన్నాయి.
టీడీపీ మాజీ ఎంఎల్సీ బీటెక్ రవి స్వగ్రామం సింహాద్రిపురం మండలం కసనూరుతో సహా వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా సర్పంచ్ లు ఎన్నికయ్యారు. ఈ మండలంలోని పెద్దజూటూరులో మాత్రం టీడీపీ నేత రాఘవరెడ్డి తన ప్రాబల్యాన్ని నిరూపించుకుంటూ టీడీపీ మద్దతుదారుడిని పోటీ చేయించారు.
"ఓటమి చెందినా గట్టి పోటీ ఇవ్వడంలో భయపడలేదు" అనే సందేశం ఇచ్చారనేది ఈ ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసులు రెడ్డి చెప్పే మాట. ఈయన ఇంకా ఏమంటారంటే..
అధికారంలో ఉన్నప్పుడు కుప్పంలో పాగా వేసినంత వరకు బాగానే ఉంది. టీడీపీ వాళ్లకు ఇప్పుడు అవకాశం దొరికింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ ట్రయల్ చూపించింది. ఇందులో సందేహం లేదు" అని శ్రీనివాసులురెడ్డి విశ్లేషించారు.
"ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలతో ఈ పరిణామాలు వాంఛనీయం కాదు. మళ్లీ వర్గ పోరు ప్రారంభం కాకుంటే చాలు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
పులివెందుల నియోజకవర్గంలో 1972 నుంచి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కుటుంబ ఆధిపత్యమే సాగింది. ప్రజలు, వారి సమస్యల పరిష్కారంలో వైఎస్ఆర్, ఆయన తండ్రి రాజారెడ్డి, తమ్ముడు వైఎస్. వివేకానందరెడ్డి తీసుకున్న చొరవ వల్ల వారికి ఆదరణ పెరగడానికి ఆస్కారం కల్పించిందనేది ఆ ప్రాంత ప్రజలు చెప్పే మాట.
దీనిని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులు రెడ్డి తోసిపుచ్చుతున్నారు.
"పులివెందులలో దశాబ్దాల కాలంగా ఎవరు ఓట్లు వారు వేసుకోలేని పరిస్థితి. చివరికి నామినేషన్ వేయడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. ఈ పరిస్థితి కొత్త భాష్యం చెప్పాం. మేము అధికార బలం వాడి ఉంటే నామినేషన్లు వేసి ఉండేవారా?" అని శ్రీనివాసులురెడ్డి మీడియాతో వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే,
పులివెందుల జెడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంతరెడ్డి, ఆయన ఊరిలోని వారు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేని పరిస్థితి. "1200 మంది ఓటర్లు ఉంటే సుమారు 900 మంది టీడీపీ మద్దతుదారులు కర్రలు, రాడ్లు పట్టుకుని మమ్మలిని బయటికి రానివ్వకుండా భయాందోళనకు గురి చేశారు" అని వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఫిర్యాదుల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని రెండు కేంద్రాల్లో రీపోలింగ్ కు ఆదేశించడంపై వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
బందిపోటు దొంగల్లా...?
తాడేపల్లెలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్. జగన్. చిత్రంలో కుడి జగన్ కుడిపక్క పులివెందుల వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి, ఒంటిమిట్ట అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి
పులివెందుల రూరల్ మండలం అనేది చిన్నది. దీనికి ఇంత దాష్టీకం అవసరమా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఘాటుగా అన్నారు.
తాడేపల్లిలో బుధవారం ఉదయం పులివెందుల, ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థులు హేమంత్ రెడ్డి, ముద్దుకృష్ణారెడ్డితో కలిసి వైఎస్. జగన్ మీడియాతో మాట్లాడుతూ,
"టీడీపీ నేతలు బందిపోటు దొంగల్లా మారారు. రాడ్లు, దుడ్డుకర్రలతో భయోత్పాతం సృష్టించారు" అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల మండలానికి సంబంధం లేని వ్యక్తి ఇక్కడ ఎలా పోటీ చేస్తారని జగన్ ప్రశ్నించారు. పోలీసులు టీడీపీ నేతలకు కొమ్ము కాసి, దొంగఓట్లు వేయించారని ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించారు. దీనిపై హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. పులివెందులలో కేంద్ర బలగాల భద్రత మధ్య ఎన్నిక నిర్వహించడానికి సిద్ధమా? అని సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు.
ఈ పరిస్థితికి కారణం ఇదేనా..?
పులివెందులపై టీడీపీ దృష్టి నిలపడానికి ప్రధాన కారణం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకులే కాదు. రాజకీయ పరిజ్ణానం ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పే మాట.
2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలో వచ్చింది. కుప్పంలో పాగా వేయాలనే బాధ్యత చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్. జగన్ బాధ్యతలు అప్పగించారు. చిత్తూరు వైసీపీ మాజీ ఎంపీ ఎన్. రెడ్డెప్పతో కలిసి కుప్పంపై పట్టు సాధించాలని వ్యూహం సిద్ధం చేశారు.
అదే సంవత్సరం డిసెంబర్ లో రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కుప్పంలో వైసీపీ నేతలు పట్టుబిగించారు.
కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డుల్లో ఎన్నికల వేళ టీడీపీ తీవ్ర ప్రతిబంధకాలు ఎదుర్కొంది. నామినేషన్లు కూడా దాఖలు చేయలేని పరిస్థితి కల్పించారనేది వైసీపీపై ఆరోపణలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో 19 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ఆరు స్థానాల్లో టీడీపీ కైన్సిలర్లు విజయం సాధించారు. డాక్టర్ సుధాకర్ ను చైర్మన్ చేయడం ద్వారా టీడీపీకి ప్రధానంగా సీఎం ఎన్. చంద్రబాబుకు గట్టి సవాల్ విసిరారు. దీనిని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి కల్పించారు.
2024 ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతగా ఉన్నఎన్. చంద్రబాబు కుప్పంపై ప్రధానంగా దృష్టి నిలపాల్సిన అనివార్యమైన పరిస్థితి కల్పించారు. 47 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 1989 ఎన్నికల్లో 95,157 మెజారిటీ దక్కింది. 1994లో 1,10,309 ఓట్లు, 1999లో 1,25,512 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు సాధించారు. 2024 ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన చేదుగుళిక మింగినట్టు భావించారు.
అస్త్రం దొరికింది..
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీకార రాజకీయాలు సాగుతున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతున్నది. ఐదేళ్ల పదవీ కాలంలో వైసీపీ సాగించిన వ్యవహారాల్లో అవినీతి, అక్రమాలపై చట్టపరంగానే టీడీపీ ఫోకస్ పెట్టింది. కేసులతో వైసీపీ నేతలను టీడీపీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఇదే సమయంలో
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక టీడీపీ అందివచ్చిన అవకాశంగా మారింది. ఈ అసెంబ్లీ స్థానంలో మాజీ ఎంఎల్సీసీ బీటెక్ రవి. స్థానిక సంస్థల ఎంఎల్సీస రాంభూపాల్ రెడ్డి వైసీపీపై పోరాటం సాగిస్తున్నట్లే ఉంది. ఉప ఎన్నికను ఆసరగా తీసుకుని సర్వశక్తుల ఒడ్డిన టీడీపీ నేతలు వైసీపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా ఆ పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే లక్ష్యంగా ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి లాభిస్తుందనేది జగమెరిగన సత్యం. కానీ, ఈ ఎన్నికను ఆసరగా చేసుకుని, వైసీపీ ప్రధానంగా వైఎస్. జగన్ కుప్పంలో వ్యవహరించిన తీరుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఉవ్విళూరతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
"ఈ ఎన్నికల సమరం రానున్న స్థానిక సంస్థలకు ట్రయల్ రన్ మాత్రమే" అని సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసులురెడ్డి అభిప్రాయపడ్డారు.
అంతర్గత వ్యవహారం ఏమిటి?
పులివెందులలో వైఎస్ఆర్ మరణం, ఆయన తమ్ముడు వైఎస్. వివేకానందరెడ్డి హత్య ఘటనల తరువాత వారి కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కాయి. గతంలో వారి వద్దకు నేరుగా వెళ్లే ప్రజలు సమస్యలు చెబితే విని, పరిష్కరించే వారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు జగన్ వద్దకు ఎవరు వెళ్లినా, మీ ప్రాంత నేత సిఫారసు ఏదీ? ఆయనతో మాట్లాడు అనే మాటలు జీర్ణించుకోలేని పరిస్థితి కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి కోటరీలో పీఏ రాఘవరెడ్డి, దేవిరెడ్డి శంకరరెడ్డి, బయపురెడ్డి, నలగాంపల్లె నేత బలరాంరెడ్డి వల్ల కూడా కార్యకర్తలు, నాయకులను నిర్లక్ష్యం చేశారనే అపవాదు ఉంది.
వైసీపీ అధికారంలో ఉండగా పులివెందులలో నేతలు, కాంట్రాక్టర్లు, పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (పాడా) లో కీలక నాయకులు దాదాపు 400 కోట్ల కాంట్రాక్టు బిల్లులు ఇప్పటికీ పెండింగ్ ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ బిల్లల మంజూరు, రాజకీయ వ్యవహారాలను చక్కదిద్దడంలో జరిగిన నిర్లక్ష్యం కార్తకర్తల్లో అసంతృప్తికి కారణాలుగా భావిస్తున్నారు. ఈ పరిణామాలను టీడీపీ నేతలు నజరానాలతో సొమ్ము చేసుకునేందుకు కార్యాచరణ అమలు చేసినట్లు అంచనా వేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల తరువాత పరిస్థితి మరింత సీరియస్ గా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.