ఓటు అభివృద్ధికా.. సంక్షేమానికా..

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు 2024 ఎన్నికల్లో అభివృద్ధి కోరుకుంటారా? లేదా సంక్షేమాన్ని కోరుకుంటారా? ఏ పార్టీకి ఓటేస్తారు.ఏపీలో గెలిచేదెవరు.

Update: 2024-05-03 02:13 GMT

పాలకులు ఎవరైనా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవించగలుగుతారు. అలా కాకుండా ఒకే రంగంపై పాలకులు దృష్టి పెడితే మరో రంగం కుదేలవుతుంది. అలా జరిగితే పాలకులు ప్రజలకు చేరువ కాలేరు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 20వ దశాబ్దం వరకు నిస్వార్థంగా పాలకులు సేవలు అందించారనే చెప్పొచ్చు. 21వ దశకంలో పాలకుల్లో స్వార్థం పెరిగింది. పరిపాలనలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ప్రజల కోసం తయారు చేసిన పథకాలు ఇప్పుడు మటుమాయం అయ్యాయి.

రెండు రూపాలకు కిలో బియ్యం
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఉన్నప్పటికీ మొదటి సారి ఆంధ్రప్రదేశ్‌లో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983 ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వాన ఘన విజయం సాధించి కాంగ్రెస్‌ను మట్టి కరిపించింది. అప్పుడు ఎన్టీఆర్‌ అందుకున్న నినాదం సంక్షేమం. మొదటి సారిగా రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. ఆ తర్వాత నాటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చింది.
ఎన్టీఆర్‌ అనంతరం అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని ప్రైవేటు సెక్టార్లకు ఎక్కువుగా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. 12 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత కూడా ఆయనదే. ఏమి చేయాలనుకున్నా ఐదేళ్ల కాలానికి మాత్రమే ప్రజలు పాలకులను ఎన్నుకుంటారు. ఆలోపు వారు చేయాలన్నది నెరవేర్చాలి. ఆ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తే అవే ప్రేయారిటీలు ఉంటాయి. మరో పార్టీ అధికారంలోకి వస్తే ప్రేయారిటీల్లో మార్పు వస్తుంది. అందుకే విజన్‌ 2020, రానున్న 40 ఏళ్లల్లో అమరావతి ఒక మహానగరం అవుతుంది అంటూ చేసిన ఆలోచనలు గెలిచిన మరో పార్టీకి నచ్చ లేదు. ఇలా అభివృద్ధికి నోచుకోని అప్పుల పాలైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మారిపోయింది.
సంక్షేమం పేరుతో అప్పుల పాలు
కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి గతంలో ఉన్న పథకాలను కొనసాగిస్తూనే విద్య, వైద్యం రంగాలతో పాటు సంక్షేమంపైన దృష్టి పెట్టారు. ప్రధానంగా పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య పథకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. మిగిలిన పథకాలు ఎలాగూ కొనసాగడం, ఆయన హయాంలోనే రైతులకు ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రజల్లో గొప్ప మార్పునకు కారణమైంది. వైఎస్‌ఆర్‌ తర్వాత రాష్ట్ర విభజన జగరగం, కొత్త రాష్ట్రానికి అభివృద్ధికి ఐకాన్‌గా చంద్రబాబు ఉంటే బాగుంటుందని 2014లో గెలిపించారు. అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగ లేదని వైఎస్‌ఆర్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్‌ కాంగ్రెస్‌పార్టీతో రాజకీయాల్లో ఉన్నందు వల్ల ఆయనకు ఒక సారి అవకాశమివ్వాలని ప్రజలు జగన్‌ను గెలిపించారు. జగన్‌ కేవలం సంక్షేమ నినాధంతోనే అధికారంలోకి వచ్చారు. అయన ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రెట్టింపు అప్పులు చేశారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం పక్కన పెడితే సంక్షేమం విషయంలో జగన్‌ సక్సెస్‌ అయ్యారని చెప్పొచ్చు.
మేనిఫెస్టోలు ఎలా ఉన్నాయి
జగన్‌ తన మేనిఫెస్టోను కొత్తగా ఏమీ చెప్పింది లేదు. గతంలో ఉన్న పథకాలనే కొనసాగిస్తామని, మరి కొంత సంక్షేమానికి సంబంధించి పని చేస్తామని మాత్రమే చెప్పారు. చంద్రబాబు నాయుడి మేనిఫెస్టో అభివృద్ధికి ఐకాన్‌గా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ ఎన్నికల్లో ఆయన కూడా సంక్షేమ వరాలనే కురిపిస్తూ హామీలనిచ్చారు. ఇప్పుడు అధికార, ప్రతిపక్షానిది హామీల విషయంలో ఒకే బాటగా మారింది.
ఓటర్ల ముందున్న తీర్పు
పాలక ప్రతిపక్షాలది ఒకే విధమైన హామీల వర్షం. జగన్‌ రూ. 17వేలు అమ్మ ఒడి కింద ఇస్తామంటే, ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 20వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలా హామీలు సంక్షేమంపై పోటా పోటీగా ఉన్నాయి. భవిష్యత్‌లో అభివృద్ధి అనే మాట కూడా కనిపించకుండా పోయింది. సామాజిక సమస్యలను ప్రజలు మరచి పోయారు. వ్యక్తిగత సమస్యల కోసం మాత్రమే నాయకులను అడుగుతున్నారు. ఇలాంటి దశలో రానున్న ఎన్నికల్లో ఎవరిని ఓటర్లు ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News