వీఎల్‌జీసీ శివాలిక్‌ షిప్‌ విశాఖ వచ్చేస్తోంది..

షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవల కొనుగోలు చేసిన అతి పెద్ద గ్యాస్‌ క్యారియర్‌ నౌక (వీఎల్‌జీసీ) శివాలిక్‌ దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్టుకు వస్తోంది.

Update: 2025-10-05 16:28 GMT
విశాఖ రానున్న వీఎల్‌జీసీ శివాలిక్‌ నౌక

మధ్య ప్రాచ్యం నుంచి భారతదేశానికి ఎల్పీజీ (లిక్విఫైడ్‌ పెట్రోలియం గ్యాస్‌) రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి వీఎల్‌జీసీ (వెరీ లార్జ్‌ గ్యాస్‌ కారియర్‌) నౌక ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం దక్షిణ కొరియాలో నిర్మించిన ఈ నౌకను షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌సీఐ) సెప్టెంబర్‌ 10న కొనుగోలు చేసి తన ఫ్లీట్‌లో చేర్చుకుంది. దీని పొడవు 225 మీటర్లు. వెడల్పు 36 మీటర్లు. 82 వేల క్యూబిక్‌ మీటర్ల కార్గోను రవాణా చేసే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. దీనికి హిమాలయాల్లోని శివాలిక్‌ పర్వత శ్రేణిలో ఒకటైన శివాలిక్‌ అనే పేరును పెట్టారు. ఎస్‌సీఐ తన ఫ్లీట్‌లో చేర్చుకున్నాక తొలిసారిగా సోమవారం విశాఖ పోర్టుకు వస్తోంది. ఈ శివాలిక్‌ నౌక భారత్‌కు పర్షియన్‌ గల్ఫ్‌ నుంచి ఎల్పీజీ వంటి కీలక ఇంధన సరఫరాలను రవాణా చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది దేశ ఇందన భద్రతను మరింతగా పెంపొందించడానికి సహాయ పడుతుంది.

దేశంలోనే తొలిసారిగా వైజాగ్‌ పోర్టుకు..
షిపింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా యాజమాన్యంలోకి వచ్చాక ఈ వీఎల్‌జీసీ శివాలిక్‌ నౌక దేశంలోనే తొలిసారిగా సోమవారం విశాఖపట్నం పోర్టుకు వస్తోంది. భారత సముద్ర రవాణా రంగంలో ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుంది. భారత గ్యాస్‌ లాజిస్టిక్స్‌ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా ‘ఆత్మ నిర్భర్‌ భారత్, మారిటైమ్‌ అమృత్‌ కాల్‌ విజన్‌ 2047’ లక్ష్య సాధనలో కీలక అడుగుగా మారుతుంది. ఈ శివాలిక్‌ నౌక తన తొలి ప్రయాణంలో విశాఖకు ఎల్‌పీజీ సరుకును తీసుకువస్తోంది.
స్వాగతం పలకడానికి కేంద్రమంత్రి..
వీఎల్‌జీసీ శివాలిక్‌ నౌకకు స్వాగతం పలకడానికి కేంద్ర పోర్టులు, నౌక, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ వైజాగ్‌ వస్తున్నారు. ఈ నౌకకు సాదర స్వాగతం పలికిన అనంతరం అధికారులు, సిబ్బందిని అభినందిస్తారు. దీని ద్వారా భారతదేశం శక్తి, రవాణా, సముద్ర భద్రత, ప్రపంచవ్యాప్తంగా పోటీ సామర్థ్యాల్లో వేగంగా ఎదుగుతోందని చాటినట్టవుతుంది. అలాగే తూర్పు తీరంలో సముద్ర వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ విశాఖ పోర్టును శక్తి, సరకు రవాణాకు ప్రధాన ద్వారంగా నిలబెడుతుంది. శివాలిక్‌ నౌక రాక సందర్భంగా విశాఖ పోర్టు అథారిటీ (వీపీఏ) సమగ్ర ఏర్పాట్లు చేస్తోంది. మంత్రిత్వ శాఖ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, విశాఖ పోర్టు అథారిటీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Tags:    

Similar News