'విశాఖ ఉక్కు'లో ఏం జరుగుతోంది?

ప్రైవేటీకరణపై పెరుగుతున్న ఆందోళన ఇప్పటికే వేధిస్తున్న కోకింగ్ కోల్ కొరత. కొన్నాళ్లుగా నిలిచిన ఉద్యోగ నియామక ప్రక్రియ. ఏడాదిలో సగానికి తగ్గిపోనున్న ఉద్యోగుల సంఖ్య. 500 మందిని డిప్యూటేషన్పై మరో ప్లాంట్కు పంపే ఆలోచన.

By :  Admin
Update: 2024-09-10 12:33 GMT

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

ప్రతిష్టాత్మక విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏం జరుగుతోంది? దాని భవితవ్యం ఏం కానుంది? ప్రభుత్వరంగంలోనే నడుస్తుందా? లేక ప్రైవేటీకరణ జరిగి తీరుతుందా? కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలతో ఈ సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రకటన చేసినప్పుడు మొదలైన ఆందోళన ఇంకా పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు బీజేపీ నాయకులు ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదంటూ హామీలిచ్చినా కేంద్రం నుంచి అలాంటి ప్రకటన

వెలువడ లేదు. అందుకనుగుణంగానే ఈ కర్మాగారంలో నిర్ణయాలు జరుగుతూ వస్తున్నాయి. ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండడం, ఉన్న వారిని ఏదోలా వదిలించు కోవడం, కొత్తగా నియామకాలు నిలిపివేయడం, కోకింగ్ కోల్ కొరతతో ఉత్పత్తి తగ్గిపోవడం, వేల కోట్ల అప్పులు, నష్టాలు వంటి పరిణామాలు ప్లాంట్ ప్రైవేటీకరణకు కాక మరిదేనికన్న ఆందోళన కార్మికుల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది.

ఉద్యోగులను వదిలించుకుంటోందిలా..

ఒకప్పుడు ఈ కర్మాగారంలో 20 వేల మందికి పైగా ఉన్న కార్మికులు ఇప్పుడు 13 వేలకు పడిపోయింది. ఈ ఏడాది ఆఖరుకి 1025 మంది, 2025 ఆఖరికి 1200 మంది, 2026 డిసెంబర్కు 1400 మంది చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఇంకా వచ్చే డిసెంబర్ నాటికి 2500 మందికి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఇచ్చి ఇంటికి పంపేయనున్నారు. అలాగే చత్తీస్గఢ్ నాగర్నర్ కొత్తగా నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్కు ఇక్కడ నుంచి 500 మంది సాంకేతిక నిపుణులను డిప్యూటేషన్పై పంపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఇలా రెండేళ్లలో ప్లాంట్ కార్మికుల సంఖ్య ఎనిమిది వేలకంటే తక్కువకు పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మరోవైపు ప్రైవేటీకరణ ప్రకటన చేసిన 2021 నుంచి ఈ ప్లాంట్లో ఉద్యోగ నియామకాలను కూడా నిలిపివేశారు. ఇలా యాజమాన్యం పదవీ విరమణ చేసిన వారి స్థానంలో రిక్రూట్మెంట్ చేయకుండా, ఉన్న వారిని ఏదోలా వదిలించుకుంటూ వస్తోంది. కొత్తగా ఏర్పాటైన ప్రైవేటు స్టీల్ ప్లాంట్లతో పోల్చుకుని విశాఖ ప్లాంట్లో కార్మికులను తగ్గించుకుంటోందని, కానీ అక్కడున్న ఆధునిక యంత్ర పరికరాలను దృష్టిలో ఉంచుకోవడం లేదని చెబుతున్నారు.




 


అస్తవ్యస్తంగా జీతాల చెల్లింపు..

ఇక ఈ స్టీల్స్టాంట్లో కార్మికులకు జీతాల చెల్లింపు కూడా కొన్నాళ్లుగా అస్తవ్యస్తంగా మారింది. గతంలో నెలలో ఆఖరి రోజునే జీతాలు బ్యాంకులో జమయ్యేవి. కానీ ఇప్పుడు నెలలో ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం నెలలో రెండు దఫాలుగా జీతాల చెల్లింపులు జరుపుతోంది. మరోవైపు తాజాగా అధికారులకు ఇచ్చే అలవెన్స్ ల్లోనూ కోత విధించింది. వీరికిచ్చే 46 శాతం అలవెన్స్లను 6 శాతం తగ్గించేసింది. ఇలా సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో తమ భవితవ్యమేమిటన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తమవుతోంది. 'యాజమాన్యం ఒకపక్క ఉత్పత్తిని, మరోపక్క ఉద్యోగులను తగ్గించుకుంటూ పోతోంది. ఇది ముమ్మాటికీ ప్రైవేటీకరణ దిశగా వెళ్లడానికే'నని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి రామస్వామి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధికి చెప్పారు.

లాభాల నుంచి నష్టాల్లోకి..

విశాఖ స్టీల్స్టాంట్ దశాబ్దాల తరబడి లాభాల్లోనే నడిచింది. 2021లో ఈ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రకటన వెలువడే నాటికి రూ.920 కోట్ల లాభాల్లో ఉండేది. గత ఏడాది లాభాల నుంచి రూ.4500 కోట్ల నష్టాల్లోకి జారుకుంది. అంతేకాదు.. ఈ మూడేళ్లలో ఈ ప్లాంట్ రూ.20 వేల కోట్ల అప్పుల్లోనూ కూరుకుపోయింది. ప్రైవేటీకరణ వార్తల తర్వాత యాజమాన్యం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, అలవిమాలిన ఎంఓయూలు ప్లాంట్ను ఈ పరిస్థితికి దిగజార్చాయని కార్మికులు ఆవేదన చెందుతున్నారు.

పుణ్యం కట్టుకున్న న్యాయస్థానం..

కొన్నాళ్లుగా వైజాగ్ స్టీల్స్టాంట్ కోకింక్ కోల్ కొరతను ఎదుర్కొంటోంది. దీంతో మూడు బ్లాస్ట్ ఫర్నేస్ ల్లో ఒక దానితోనే నడుస్తోంది. రోజుకు అవసరమైన దానికంటే నాలుగో వంతు కూడా లభ్యం కాకపోవడంతో ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదంలో పడింది. సర్వత్రా అందోళన రేకెత్తిస్తున్న తరుణంలో అదానీ గంగవరం పోర్టులో ఆరు నెలలుగా అటాచ్మెంట్లో చిక్కుకుపోయిన 1.50 లక్షల టన్నులు, విశాఖ పోర్టులో ఉన్న 80 వేల టన్నుల విదేశీ కోకింగ్ కోల్ విడుదలకు రాష్ట్ర హైకోర్టు అనుమతిచ్చి పుణ్యం కట్టుకుంది. లేదంటే ప్లాంట్ ఇప్పటికే పెను సంక్షోభంలో చిక్కుకుని ఉండేది.

ఆందోళన.. ఆరణ్య ఘోష!

విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తామన్న ప్రకటన వెలువడినప్పట్నుంచి కార్మిక సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు వంటి చేపట్టి నిరసనలను వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికి వీరి ఆందోళనలు 1307 రోజులకు చేరుకున్నాయి. మంగళవారం వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో రాస్తారోకోలు నిర్వహించాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ యోచనను తక్షణమే విరమించుకోవాలని, సొంత గనులు సమకూర్చాలని, సెయిల్లో విలీనం చేసి పూర్తి స్థాయిలో ప్లాంట్ ఉత్పత్తి నడిచేలా చూడాలని నినాదాలు చేశారు.




 


ఉక్కు మంత్రితో సమావేశం రద్దు..

విశాఖ ఉక్కు కర్మాగారంలో ముడి పదార్థాల / సరకు కొరత వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు నాలుగు రోజుల క్రితం ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన డిప్యూటి సెక్రటరీ, డిప్యూటి డైరెక్టర్ ఈ ప్లాంట్కు వచ్చారు. వీరు ఢిల్లీ వెళ్లి ఇక్కడ పరిస్థితిని నివేదించారు. దీనిపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర ఉక్కు మంత్రి డీకే కుమారస్వామితో ఉన్నతాధికారుల సమావేశం ఉంటుందని ప్రకటించారు. అయితే ఆఖరి నిమిషంలో ఆ మీటింగ్ను రద్దు చేశారు. దాని స్థానంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, కుమారస్వామిల నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కేబినెట్ సబ్ కమిటీ జరగనుంది. ఈ భేటీలో విశాఖ స్టీల్ ప్లాంట్ భవితవ్యం, ప్రైవేటీకరణ వంటి వాటిపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి వీరి భేటీపైనే ఉంది. 

Tags:    

Similar News