పెట్టుబడుల పండుగకు వైజాగ్ రెడీ!
రు.9.8 లక్ష కోట్ల పెట్టబడుల ఎంవొయులకు సంతకాలు జరుగుతాయని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం
Byline : బొల్లం కోటేశ్వరరావు
Update: 2025-11-10 08:26 GMT
దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 400కు పైగా అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) లక్ష్యంగా చేసుకున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2025కు విశాఖ మహా నగరం సన్నద్ధమవుతోంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు భాగస్వామ్య సదస్సుల పేరిట పలుమార్లు ఇలాంటివి నిర్వహించారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయనకు ఆ అవకాశం రాలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక తనకు అలవాటైన పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు మళ్లీ సంకల్పించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ సదస్సుకు వేదికగా విశాఖనే ఎంచుకున్నారు.
ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు చేస్తున్న ఇతర టెంట్లు
ఎప్పుడు? ఎక్కడ? ఎలా?
గతంలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులను బీచ్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఏపీఐఐసీ స్థలంలో నిర్వహించేవారు. ఇప్పుడా స్థలాన్ని లూలూ మాల్ కోసం కేటాయించారు. దీంతో ఈసారి ఆం్ర«ద విశ్వవిద్యాలయం (ఏయూ) ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేస్తున్నారు. లులూ మాల్‌కు కేటాయించిన స్థలం దాదాపు తొమ్మిది ఎకరాలుంటే.. ఏయూ గ్రౌండ్ 25 ఎకరాలుంది. సువిశాలమైన ఈ మైదానానికి ఎదురుగా ఉన్న ఏయూ ఖాళీ స్థలాన్ని కార్ల పార్కింగ్ కోసం కేటాయించారు. ఈనెల 14, 15 తేదీల్లో జరిగే ఈ భాగస్వామ్య సదస్సు నిర్వహణ బాధ్యతను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) చూస్తోంది. సీఐఐకి ఇది 30వ సదస్సు.
ఎవరెవరు వస్తున్నారు?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి నిర్వహిస్తున్న ఈ భాగస్వామ్య సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తొలుత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని భావించినా ఎందుకో వీలు పడలేదు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఆహ్వానించారు. అందుకు సమ్మతించిన ఆయన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అన్నపూర్ణాదేవి, కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అశ్వనీ వైష్ణవ్‌లు వస్తున్నారు. సమ్మిట్ చైర్మన్‌గా కేంద్రమంత్రి పీయూష్ గోయల్, కో చైర్మన్ సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తారు. వీరితో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్; రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్ధన్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొంటున్నారు.
విదేశాల నుంచి మంత్రులు, ప్రతినిధులు..
పార్టనర్ షిప్ సమ్మిట్‌కు దాదాపు 45 దేశాల మంత్రులు, ముఖ్య అధికారులు హాజరవుతారని భావిస్తున్నారు. వీరితో పాటు మరో రెండు వేల మంది డెలిగేట్లు వస్తారని అంచనా. కీలక అతిథుల్లో ఆర్మేనియా ఆర్థిక శాఖ మంత్రి జివార్గ్ పపోయాన్, బహ్రెయిన్ వాణిజ్య శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ అడెల్ ఫక్రో, సైప్రస్ వాణిజ్య మంత్రి జియార్గస్ పపనస్టాసియో, మారిషస్ వాణిజ్య శాఖ మంత్రి సిక్ యూయెన్, మొజాంబియా ఆర్థిక మంత్రి ముహాతె, నేపాల్ పరిశ్రమల మంత్రి అనిల్‌కుమార్ సిన్హా, న్యూజిలాండ్ వర్తక, పెట్టుబడుల శాఖ మంత్రి టాడ్ మెక్‌క్లే, పపువా న్యూగునియా అంతర్జాతీయ వర్తక, పెట్టుబడుల వ్యవహారాల మంత్రి రిచర్డ్ మరు, సింగపూర్ నేషనల్ సెక్యూరిటీ మంత్రి కె.షణ్ముగం, సౌదీ అరేబియా పెట్టుబడుల శాఖ మంత్రి అబ్దుల్ అజీజ్ అల్ ఫలీ, యూఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అల్ మర్రీ, స్విట్జర్లాండ్ డైరెక్టర్ జనరల్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఒకంజో–ఐవేలా, ఘనా డిప్యూటీ ట్రేడ్ మినిస్టర్ సాంప్సన్ అహిలతో పాటు థాయ్‌లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, రష్యా, అమెరికా, బ్రిటన్, స్పెయిన్, ఈజిప్ట్, జక్తరాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతారు. 72 మంది అంతర్జాతీయ స్పీకర్లు పాల్గొంటున్నారు. ఇంకా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరవుతారు.
రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడుల అంచనా..
విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 410 ఎంవోయూలు కుదుర్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ సమ్మిట్ వేదిక నుంచే వీటిలోని రూ. 2.7 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.
ముఖ్య అతిథుల కోసం తెస్తున్న బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడి కార్లు ఇలాంటివే..
అతిథులకు బీఎండబ్ల్యూ, బెంజి కార్లు..
దేశ, విదేశాల నుంచి పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వస్తున్న అతిరథ మహారథుల కోసం 40 వరకు బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లను రప్పిస్తున్నారు. అత్యంత ఆధునిక, విలాసవంతమైన ఈ కార్లు విశాఖలో అందుబాటులో లేవు. దీంతో వీటిని భారీగా అద్దె చెల్లించే ప్రాతిపదికన హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు. ఈ కార్లలో ప్రయాణిస్తే ఎలాంటి కుదుపుల్లేకుండా విమానంలో విహరించిన అనుభూతి కలుగుతుంది. మరికొంతమంది ఇతర ముఖ్యుల కోసం ఇన్నోవా హైక్రాస్ కార్లను సమకూరుస్తున్నారు.
హోటళ్లలో రూమ్‌లు ఫుల్..
సదస్సుకు వచ్చే విదేశీ అతిథులు, ప్రతినిధులు, ప్రముఖులు, ఉన్నతాధికారుల కోసం విశాఖలో అధికారులు ముందుగానే హోటళ్లలో రూమ్‌లను బుక్ చేశారు. ఇలా ఇప్పటివరకు 1500 వరకు స్టార్ హోటళ్లలోని రూమ్‌లను సిద్ధం చేశారు. ఇతర హోటళ్లలో మరో 500 వరకు రూమ్‌లను రిజర్వు చేస్తున్నారు.
మైదానంలో ఎనిమిది హాళ్లు..
ఇక సదస్సు జరిగే ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మొత్తం ఎనిమిది హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి హాలులో డెలిగేట్ల రిజిస్ట్రేషన్, రెండో హాలులో కంపెనీలు, ప్రభుత్వ శాఖల స్టాళ్లు, మూడో హాలును డెలిగేట్ల భోజన ఏర్పాట్లకు కేటాయించారు. అలాగే నాలుగో హాలులో మూడు మినీ హాళ్లలో డెలిగేట్లు, ప్రభుత్వ ప్రతినిధులతో ముఖాముఖీకి వీలు కల్పిస్తారు. ఇక ప్రధాన వేదికైన ఐదో హాలులో 1600 మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఆరో హాలులో ముఖ్యమంత్రి లాంజ్, భద్రతా, ఇతర సిబ్బందికి గదులు, ఏడులో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ లాంజ్, ఎనిమిదో హాలులో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కోసం కేటాయించారు.