కొత్తవారి వల్ల తలనొప్పి వస్తోంది
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు.
తెలుగుదేశం పార్టీ (టీడీపీ ) జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ కొంత మంది ఎమ్యెల్యేల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వీరిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే అధికంగా ఉన్నారు. తొలిసారి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలపై మంత్రుల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ లైన్ ప్రకారంగా ఎలా నడుచుకోవాలి, ప్రజలతో ఎలా మెలగాలి, పార్టీకి ప్రభుత్తానికి మంచి పేరు వచ్చే విధంగా ఎలా నడుచుకోవాలనే అంశాలపై ఆలోచనలు చేయడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇలా మంచిచెడులు తెలియకపోవడం, అవగాహనా రాహిత్యం, అనుభవలేమితో సమన్వయం లోపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులతో జరిపిన సమావేశంలో లోకేశ్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసినట్లు సమచారం.
సమావేశంలో మాట్లాడిన లోకేశ్... తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్ ఎమ్మెల్యేలు, నేతలు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులు, అధిగమించిన సమస్యలు, ఈ స్థాయికి చేరిన విజయ రహస్యాలను కొత్త ఎమ్మెల్యేలకు తెలియజేయాలని ఆయన సూచించారు. వరుస విజయాలు సాధించాలంటే లోటుపాట్లు సరిచేసుకోవాలని కొత్త ఎమ్మెల్యేలకు లోకేశ్ సలహా ఇచ్చారు.
ఈనెల 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సును కలిసికట్టుగా విజయవంతం చేయాలని లోకేశ్ ఆదేశించారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆయన తెలిపారు. ఈ పెట్టుబడులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రతి మంత్రీ తమ శాఖల పరిధిలోని ఒప్పందాలకు సంబంధించి పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని లోకేశ్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించే ఎంఎస్‌ఎంఈ పార్కుల కార్యక్రమంలో అందరు మంత్రులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు. తమ జిల్లాల పరిధిలో సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు, ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత వహించాలని లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీని త్వరగా నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని ఆయన సూచించారు.