విశాఖపైకి మళ్ళీ సాగరుడి దూకుడు!
కొన్నాళ్లుగా కోతకు గురవుతున్న సముద్ర తీరం. కడలిలో కలిసిపోతున్న బీచ్‌లో కట్టడాలు, చెట్లు. హుద్ హుద్ తర్వాత ఇప్పుడు అలాంటి పరిస్థితి.
సరిగ్గా పదేళ్ల క్రితం విశాఖ తీరం అతలాకుతలమైంది. హుద్ హుద్ తుపాను సృష్టించిన బీభత్సంతో కకావికలమైంది. కిలోమీటర్ల మేర కోతకు గురై బీచ్ నామరూపాల్లేకుండా పోయింది. పదేళ్ల తర్వాత ఇప్పుడు విశాఖ సాగరతీరానికి మళ్లీ అలాంటి కష్టమే వచ్చినట్టు కనిపిస్తోంది. కొన్నాళ్ల నుంచి తీరం అదే పనిగా కోతకు గురవుతోంది. దీంతో విశాఖ వాసులతో పాటు పర్యాటక ప్రియుల్లోనూ అలజడి రేపుతోంది. ఎందుకిలా?
విశాఖ సాగరతీరం ఎంతో అందంగా ఉంటుంది. మరే రాష్ట్రంలోనూ లేని సౌందర్యం ఈ తీరం సొంతం చేసుకుంది. ఒకపక్క అంతస్తుల భవనాలు, మరోపక్క ఉరకలెత్తే సముద్రం.. వీటి మధ్య నుంచి బీచ్ రోడ్డు చీల్చుకుని పోతుంది. పాల నురగలు కక్కుతున్నట్టు ఎగసి పడే కెరటాలు బీచ్ వైపునకు దూసుకొస్తూ వెనక్కి తగ్గుతాయి. ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరిసి పోతుంటాయి. వాటిపై కూర్చుని తీరానికి ఏదో పని ఉన్నట్టు వచ్చి వెళ్లిపోయే అలలు సందర్శకులను, పర్యాటక ప్రియులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తుంటాయి. అలాంటి వైజాగ్ బీచ్ తరచూ కడుపు కోత బెడద పట్టుకుంది. పదేళ్ల క్రితం 2014 అక్టోబర్లో సంభవించిన సూపర్ సైక్లోన్ హుద్ హుద్ విశాఖలోనే తీరాన్ని దాటింది. దాని ధాటికి ఉత్తర కోస్తాంధ్ర అతలాకుతలమైంది.
విశాఖ నగరం విలవిల్లాడిపోయింది. హుద్ హుద్ తుపాను ప్రభావానికి సముద్రం బీచ్ వైపు ఉధృతంగా దూసుకొచ్చింది. అలలు ఉవ్వెతున్న ఎగసి పడ్డాయి. దీంతో సాగరతీరం ఛిద్రమైంది. సముద్రం చాలావరకు బీచ్లోడ్డును తనలో కలిపేసుకుంది. అప్పట్లో చాన్నాళ్లు బీచ్ రోడ్డు రాకపోకలకు వీలు కాకుండా పోయింది. బీచ్ రోడ్డు పునరుద్ధరణకు చాలా సమయమే పట్టింది. హుద్ హుద్ తీవ్రతకు తీరంలో ఉన్న వేల టన్నుల ఇసుక సముద్రం లోపలకు లాక్కుపోయింది. అందువల్ల నేరుగా కెరటాలు తీరాన్ని తాకడంతో బీచ్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో అప్పట్లో సముద్రంలో మేట వేసిన ఇసుకను డ్రెడ్జింగ్ చేసి తీరంలో వేసి కోతకు కట్టడి వేయగలిగారు. అప్పట్లో ఇందుకు భారీగానే వెచ్చించారు. అప్పట్నుంచి అప్పుడప్పుడు విశాఖ తీరం కోతకు గురవుతూనే ఉన్నా అది స్వల్పంగానే ఉంటోంది. కానీ కొన్నాళ్ల నుంచి కడలి మళ్లీ కన్నెర్ర చేస్తోంది. మొదట్లో కొద్దిగా మొదలైన తీరం కోత.. క్రమంగా తీవ్రతరమవుతోంది. ఇంతలో అల్పపీడనాలు ఏర్పడితే సంద్రం దూకుడు మరింత అధికమవుతూ విశాఖ బీచ్ రోడ్డు వరకు చొచ్చుకు వస్తోంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొననసాగుతున్న వాయుగుండం ప్రభావంతో అలల ఉధృతి మరింతగా పెరిగింది. ఫలితంగా బీచ్ కు అనుకుని ఉన్న తేలికపాటి కట్టడాలు, కొబ్బరి చెట్లు సముద్రంలో కూలుతున్నాయి. ఇలా ఆర్కే బీచ్, గోకుల్ పార్క్, వైఎంసీఏ, కురుసుర సబ్మెరైన్ మ్యూజియం ప్రాంతాలు భారీ కోతకు గురవుతున్నాయి. బీచ్ రోడ్డు కూడా కొన్ని చోట్ల దెబ్బతింటోంది. ప్రస్తుతం విశాఖ సాగరతీరం కోతకు గురవడంతో సందర్శకులు మునుపటిలా బీచు పోటెత్తే పరిస్థితి కనిపించడం లేదు. కొద్ది మంది ఆస్వాదించడానికి వెళ్లినా రాకాసి అలలు పైపైకి వస్తున్నాయి. బీచ్ కు ఆనుకుని ఉన్న కొబ్బరిచెట్లు, చిన్న చిన్న కట్టడాలు కళ్లెదుటే ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ఈ పరిస్థితిని చూసిన వారు బీచ్లో ఎంజాయ్ చేయడానికి వెళ్లడం లేదు. దీంతో ఎప్పుడూ రద్దీగా కనిపించే బీచ్ వెలవెలబోతూ కనిపిస్తోంది.
తీరం మళ్లీ కోత ఎందుకంటే?
విశాఖ సాగరతీరం మళ్లీ కోతకు గురవుతుండడానికి వాతావరణ పరిస్థితులే కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడినప్పుడు కెరటాల ఉధృతి పెరగడంతో పాటు సముద్రం ముందుకు చొచ్చుకు వస్తుంది. దీంతో తీరం కోతకు గురవుతుంది. ఈ ఏడాది శీతాకాలం సీజనులో అల్పపీడనాలు, వాయుగుండాలు సాధారణంకంటే ఎక్కువగా ఏర్పడ్డాయి. ఈ ఏడాది సమ్మర్లో అధిక వేడితో 31.2 డిగ్రీలుండే సముద్ర ఉష్ణోగ్రతలు 32.8 డిగ్రీల వరకు చేరాయి. వేసవిలో సముద్ర ఉష్ణోగ్రతల ప్రభావం శీతాకాలంలో పైకి వస్తాయి. దీంతో ఈ సీజనులో సాధారణానికి మించి అల్పపీడనాలు/ వాయుగుండాలు ఏర్పడటానికి కారణమైంది. వీటి ప్రభావంతో కెరటాలు దూసుకు వచ్చి తీరంలో వదులు ఇసుక ప్రాంతం కోతకు గురవుతుంది. తీరంలో ఇసుక సముద్రంలోకి లాక్కుపోతుంది. సముద్రంలోకి లాక్కుపోయిన ఇసుకను తిరిగి డ్రెడ్జింగ్ ద్వారా తీరంలో వేస్తేనే కోత నివారణ అవుతుంది. ప్రస్తుత వాతావరణ అంచనాల ప్రకారం మరికొద్ది రోజుల పాటు కెరటాల ఉధృతి ఉంటుందని, అప్పటి వరకు తీరం కోత కొనసాగవచ్చని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ చీఫ్ సైంటిస్ట్ వీవీఎస్ఎస్ శర్మ 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు.