వైపీపీని భయపెడుతున్న విశాఖ ఉక్కు
వైసీపీ పార్టీకి విశాఖ ఉక్కు ఓ పీడకలలా మారింది. తమ గెలుపుకు అతిపెద్ద అడ్డంకిగా మారింది. విశాఖలో వైసీపీ గెలుపును శాసించే స్థాయికి విశాఖ ఉక్కు సమస్య చేరింది.
(శివరామ్)
సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం వైసీపీ అభ్యర్థులను కలవరపరుస్తోంది. ఇంతకాలం ఉక్కు ప్రైవేటీకరణ గండం వీరిని వెంటాడగా, తాజాగా గంగవరం పోర్టు సమ్మె కారణంగా ఏర్పడిన ముడిసరకు కొరత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు శాపంలా మారింది. విశాఖ ఉక్కును రక్షించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను రెండు రోజుల క్రితం కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నాయకులకు హామీ లభించకపోగా వైసీపీని గెలిపిస్తే తరువాత చూద్దాం అంటూ దాటవేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హామీ ఇవ్వకపోగా అది పెద్ద సమస్య కాదన్నట్టు తేలిగ్గా తీసి పారేయడం ఇప్పుడు అభ్యర్థులను భయపెడుతోంది. తెలివిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి ఎం. శ్రీభరత్ విశాఖ పార్లమెంటు మ్యానిఫెస్టోలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపడమే కీలక అంశమని పేర్కొని ఉక్కు కార్మికులను శాంతిపజేయగలిగారు.
విశాఖ ఉక్కును కాపాడమంటే .. ముందు వైసీపీని గెలిపించమన్న జగన్
సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించాల్సిందిగా విశాఖ ఉక్కుకు ప్రత్యేకంగా ఐరన్ ఓర్ మైన్స్ కేటాయించాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పగా ఓపెన్ మార్కెట్‌లో బాగానే లభ్యమౌతుంది కదా అని ఆయన ప్రశ్నించడంతో నేతలు ఖంగుతిన్నారు. ప్లాంట్‌కు అవసరమైన ముడిసరకు అనుమతులు, ఇసుక లైసెన్సులు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా అది పెద్ద విషయమే కాదని అన్నారు. విజయనగరంలో ఇసుకు క్యారీ లైసెన్స్‌ను ప్రభుత్వం మూడేళ్ల నుంచి పునరుద్దరించకపోవడం వల్ల ప్లాంట్‌పై 80 కోట్ల వరకూ భారం పడిన అంశాన్ని సీఎం లైట్‌గా తీసుకోవడం వీరికి అర్దం కాలేదు. ప్లాంట్ పరిస్థితి బాగాలేక జీతాలకు కూడా ఇబ్బందులు ఎదురౌతున్నాయని చెప్పబోతే ప్లాంట్ లాభాల్లోనే ఉంది కదా అని సీఎం ప్రశ్నించడంతో వీరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మిగిలిన సమస్యలు చెప్పే ప్రయత్నం చేయగా, గాజువాక శాసనసభ్యుడిగా గుడివాడ అమర్నాథ్‌ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని గెలిపించండని ముఖ్యమంత్రి అనడంతో నేతలు ఏం మాట్లాడలేక వెనుదిరిగారు.
అభ్యర్థులపై తీవ్ర ప్రభావం
సీఎంను కలిసిన వారిలో అన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండే కార్మిక సంఘాల నేతలు ఉండడం, ఆయన స్పందన సానుకూలంగా లేకపోవడం ఇప్పుడు విస్తృతంగా ప్రచారం అయింది. కేంద్రం సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తిరిగి వస్తే విశాఖ ఉక్కు మనుగడ ఉండదనే అభిప్రాయం ఉద్యోగులు, కార్మికులకు కలిగింది. దీని ప్రభావం విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, గాజువాక అభ్యర్థి అయిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్ర గుడివాడ అమర్నాథ్‌లపై ప్రత్యక్షంగా పడునుంది. ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారంలో 18 వేల మంది ప్రత్యక్షంగా, మరో 30 వేల మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. విశాఖ ఉక్కు విషయంలో ఆ ప్రాంతంలో సెంటిమెంట్ కూడా ఉంది. విశాఖ ఉక్కుకు వైసీపీ ప్రభుత్వమే శాపమనే అభిప్రాయం కలిగితే అది తమ భవిష్యత్‌ను దెబ్బతీస్తుందని అభ్యర్థులు కలవరపడుతున్నారు.
హమీలు ఇవ్వకుండా సవాళ్లు..
బీజేపీ అనకాపల్లి అభ్యర్థి సీఎం రమేష్, తెలుగుదేశం విశాఖ అభ్యర్థి ఎం. శ్రీభరత్‌లు తాము ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకొంటామని స్పష్టమైన హామీ ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా వైపీపీ ఎటువంటి హామీ ఇవ్వకుండా టీడీపీ కేంద్రంలో బీజేపీని నిలదీయగలదా అంటూ సవాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు. దీంతో రానున్న ఎన్నకలలో ఉమ్మడి విశాఖ జిల్లాలో విశాఖ ఉక్కు సంక్షోభం ఎన్నికల అంశంగా మారనుంది.