కూటమిపై విశాఖ జనసేన కుతకుత!

కూటమిలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని నాగబాబు దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని వాపోతున్నారు.;

Update: 2025-08-01 15:10 GMT
విశాఖ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న నాగబాబు

కూటమి ప్రభుత్వంలో తమకు తగిన ప్రాధాన్యత దక్కలేదన్న ఆవేదనతో జన సైనికులు రగిలిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితిలో ఉన్నామని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి పనులకైనా టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వ్యధ చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటివరకు తమ ఇబ్బందులను పంటి బిగువున దాచిపెట్టుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నారు. అధినేత పవన్‌ కల్యాణ్‌తో తమ గోడు వెళ్లబోసుకోవాలని తహతహలాడుతున్నారు. కానీ అది తమకు అంత సులువుగా అయ్యే పనికాదని రానురాను అర్థం చేసుకుంటున్నారు. ఏడాది తర్వాత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవల ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన జస సైనికులతో సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే టీడీపీ నేతలపై ఉన్న అసంతృప్తిని జససేన నాయకులు, కార్యకర్తలు నాగబాబు ముందు వెళ్లగక్కారు. ఇలా విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో క్షేత్ర స్థాయిలో తాము ఎదుర్కొంటున్న అవస్థలను, టీడీపీ నుంచి ఎదురవుతున్న అవమానాలను, తాము నిర్లక్ష్యానికి గురవుతున్న వైనాన్ని, జసనైనికుల ఇబ్బందులను నాగబాబు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కూటమి ప్రభుత్వంలో తమకు తగిన గుర్తింపు లేదని, టీడీపీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారని కుండబద్దలు కొట్టారు.


జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌

నాగబాబు ఎదుట జనసైనికుల గోడు..
సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన జనసేన సమావేశంలో కార్యకర్తలకు తగిన గుర్తింపు దక్కడం లేదని ఓ కార్యకర్త నాగబాబుకు ఫిర్యాదు చేశాడు. దీనిపై నాగబాబు స్పందిస్తూ.. గుర్తింపు అంటే ఏమిటో చెప్పాలని వ్యంగ్యంగా ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు.. పార్టీలో దమ్మున్న వారే ప్రశ్నించాలన్నారు. తనకు అంత దమ్ము ఉన్నందునే ప్రశ్నిస్తున్నానని ఆ కార్యకర్త చెప్పడంతో అసహానానికి గురైన నాగబాబు అతని నుంచి మైక్‌ను లాక్కోవాలంటూ ఆదేశించడంతో లాగేసుకున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో 15వ వార్డు మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతూ ‘కనీసం జీవీఎంసీలో మాకు ఏ పనీ జరగడం లేదు.. మీ వెనక ఎందుకు రావాలని అడుగుతుంటే ఏమీ చెప్పలేకపోతున్నాం. మాకు వార్డు అధ్యక్ష పదవులు ఇచ్చారంటే.. మా వెనకాల తిరిగే వాళ్లకు పనులు చేయించగలగాలి. కానీ మాకు ఆ పరిస్థితి లేదు’ అది నాగబాబుతో గోడు వెళ్లబోసుకుంది.

కూటమిలో తమకే పనులూ జరగడం లేదంటున్న 15వ వార్డు వీర మహిళ

అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి..
ఇలా నాగబాబుతో తమ బాధలు చెప్పుకుంటే పరిష్కారం దొరుకుతుందని గంపెడాశలు పెట్టుకున్న జస సైనికులకు నిరాశే ఎదురైంది. ‘సమస్యలున్నా టీడీపీతో పని చేయాల్సిందే. సమన్వయ కమిటీతో పరిష్కరించుకోవల్సిందే. మరో పదిహేనేళ్లు ఇలాగే ఉంటుంది. ఇష్టం ఉన్నా లేకున్నా తప్పదు. కూటమిని దెబ్బతీసే పని ఎవరు చేసినా సహించం. ఓర్పు కావాలి. గుర్తింపు లేదని చెప్పేవారు కొత్తగా మెంబర్‌షిప్‌ చేర్పించి మీ దమ్మును, సత్తాను నిరూపించుకోండి. దమ్ముతో పనిచేసే వారు గుర్తింపు కోరుకోకూడదు. స్వార్థం తగ్గించుకుని పార్టీ కోసం పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. చాలామందిలో అసంతృప్తి కనిపిస్తుంది. కమిటీల్లో స్థానం వస్తుంది’ అని తేల్చి చెప్పేశారు. దీంతో ఇప్పుడు జనసైనికులు తమ పరిస్థితి ఏమిటి? అంటూ లోలోన మథనపడుతున్నారు.
స్టాండింగ్‌ కమిటీలోనూ మొండిచెయ్యే..
ఈనెల 6న జరగనున్న జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో టీడీపీ జనసేనకు మొండి చెయ్యే చూపింది. ఈ పరిణామం జనసేన కార్పొరేటర్లకు మింగుడు పడని పరిణామంగా మారింది. 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో జనసేన మూడు వార్డుల్లో గెలిచింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నుంచి 11 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం జీవీఎంసీలో జనసేన కార్పొరేటర్ల సంఖ్య 14కి చేరింది. స్టాండింగ్‌ కమిటీలో 10 స్థానాలున్నాయి. ఇందులో టీడీపీకి ఆరు, జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి చొప్పున సర్దుబాటు చేసుకున్నారు. కానీ బీజేపీకి ఒక స్థానం ఇచ్చినా జనసేకు ఒక్కటి కూడా కేటాయించలేదు. ఈ పరిణామాలను జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు.
స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పాల్గొన రా?
దీనిపై జీవీఎంసీలో చురుకుగా ఉన్న జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. ‘జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీలో జనసేనకు స్థానం లేకపోవడం దారుణం. 14 సీట్లున్న జనసేనకు కూటమి ధర్మంలో భాగంగా 3 స్థానాలు కేటాయించాల్సి ఉన్నా ఒక్కటీ ఇవ్వకపోవడం అన్యాయం. జనసేన నుంచి ఒకరు స్టాండింగ్‌ కమిటీకి పోటీ చేసేందుకు నామినేషన్‌ వేస్తే దాన్ని కూడా విరమించుకోవాలని ఆదేశించడం ఆశ్చర్యం. జనసేన నాయకులకు పదవులు ఇవ్వడంలో కుట్ర దాగి ఉంది. జనసేనలో జగన్‌ సేన ఉంది. ఈ విషయంలో జనసేన విశాఖ జిల్లా నాయకత్వ లోపం కనబడుతోంది. వైసీపీ కోవర్టుల వల్ల ఈ పరిస్థితి దాపురించింది. పార్టీని దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. కూటమిలో జనసేనకు అన్యాయం చేయాలని చూసినా, తొక్కేయాలని చూసినా జనసైనికుడిగా ఊరుకునేది లేదు. వచ్చే స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో పాల్గొనబోం’ అని మూర్తి యాదవ్‌ హెచ్చరించారు. గతంలో పోలీసు అధికారుల బదిలీల్లో తాను సిఫార్సు చేసిన వారిని కాకుండా టీడీపీ నేతలు నచ్చిన వారిని తెచ్చుకున్నారంటూ పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు తన గన్‌మెన్లను సరెండర్‌ చేశారు. మరోవైపు కూటమిలో తమకు ఏ పనులు జరగడం లేదని, గుర్తింపు లేదని జనసేన నాయకులు నాగబాబు ఎదుటే అసంతృప్తిని వెళ్లగక్కారు. తాజాగా జీవీఎంసీలో స్టాండింగ్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో ఏకంగా జనసేనకు స్థానమే లేకుండా చేశారంటూ రోడ్డెక్కారు. ఇలా విశాఖలో జనసేన, టీడీపీల మధ్య సిగపట్లు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
Tags:    

Similar News