వీఐపీలకు ఏడాదికోసారే శ్రీవారి దర్శనం

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అద్భుతమయిన సూచన;

Update: 2025-07-28 12:00 GMT

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరుమల దర్శనాలకు సంబంధించి అద్భుతమయిన సూచన చేశారు. ఆయన చేసిన సూచన సామాన్యులకు కాదు.  విఐపిలకు. ఎందుకంటే ఈ విఐపి లనే వాళ్ల బెడద ఈ మద్య ఆలయాల్లో ఎక్కువయింది. వీళ్ల దర్శనాల వల్ల సామాన్యుకుల సమస్యలు ఎదురవుతున్నాయి.  అసలు దేవుడి దగ్గిర ఈ విఐపిలు , సామాన్య ప్రజలు అని ఏమిటో అర్థం కాదు.  ఈ వేదాంతంలోకి వెళ్లొద్దు గాని, వెంకయ్యనాయుడు ఈ విఐపి లదర్శనాల మీద ఆంక్షలు విధించాల్సిందే అంటున్నారు. 

సామాన్య భక్తుల సౌలభ్యం కోసం వీఐపీలు ఏడాదికి ఒకసారి మాత్రమే తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకోవాలని భారత ఆయన సూచించారు.

సోమవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు.  టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి స్వామివారి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో బయట ఎంత మంచి ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తుల రద్దీ కారణంగా సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.
ఈ నేపథ్యంలో వీఐపీలు ఏడాదికోసారి మాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను తీసుకువస్తే దేవస్థానం నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని అన్నారు.
ప్రజా ప్రతినిధులందరూ బాధ్యతతో హుందాగా ఈ సూచనను పాటించాలని వెంకయ్యనాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్‌ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్‌ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వెంకయ్య నాయుడు చేసిన ఈ సూచనను తిరుమలకు వచ్చ విఐపి భక్తులు పాటిస్తే,  లక్షలాది సామాన్యభక్తులకు మేలు జరుగుతుంది.
Tags:    

Similar News