అమరావతిలో ‘గ్రామదర్శిని’

అమరావతి రైతుల అసంతృప్తి తొలగింపునకు 'గ్రామదర్శిని' చర్యలు సఫలమవుతాయా?

Update: 2025-10-24 03:50 GMT
గ్రామదర్శినిలో రైతుల సమస్యలు వింటున్న సీఆర్డీఏ కమిషనర్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో పదేళ్లుగా నెలకొన్న అసంతృప్తిని ఇంకా తొలగలేదు. తొలగించేందుకు ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్‌డిఏ) తీసుకుంటున్న చర్యలు ఎంతవరకు సఫలమవుతాయి? అమరావతి గ్రామాల్లో నిర్వహిస్తున్న 'గ్రామదర్శిని' కార్యక్రమం ప్రయత్నాలు రైతుల సమస్యలకు సత్వర పరిష్కారాలు అందిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, చారిత్రక సమస్యలు, ఆలస్యమవుతున్న అభివృద్ధి పనులు, రాజకీయ మార్పుల ప్రభావం వంటివి ఇంకా సవాళ్లుగా మిగిలి ఉన్నాయి.

రైతుల అసంతృప్తి నేపథ్యం

అమరావతి రాజధాని నిర్మాణానికి 2014లో ప్రారంభమైన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (ఎల్‌పిఎస్) కింద సుమారు 30 వేల రైతులు 34 వేల ఎకరాలకు పైగా భూములు అందజేశారు. అప్పటి టిడిపి ప్రభుత్వం రిటర్నబుల్ ప్లాట్లు, పెన్షన్లు, ఉపాధి అవకాశాలు వంటి హామీలు ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకు రావడంతో అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. దీంతో రైతులు ఆర్థిక నష్టాలు, భూముల సరిహద్దు వివాదాలు, మౌలిక సదుపాయాల లోపాలు ఎదుర్కొన్నారు.

2024లో మళ్లీ టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైంది. రైతులు ఇంకా పూర్తి సంతృప్తి చెందలేదు. అక్టోబర్ 13, 2025న రైతులు సిఆర్‌డిఏపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు రైతులు సిఆర్‌డిఏ బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడిబి), వరల్డ్ బ్యాంక్‌లకు ఫిర్యాదు చేశారు.


ల్యాండ్ పూలింగ్ సమస్యలపై గ్రామ దర్శిని కార్యక్రమం

'గ్రామదర్శిని' కార్యక్రమం

సీఆర్‌డిఏ కమిషనర్ కె కన్నబాబు నేతృత్వంలో జరుగుతున్న 'గ్రామదర్శిని' కార్యక్రమాలు రైతుల సమస్యలకు సత్వర పరిష్కారాలు అందించే లక్ష్యంతో ప్రారంభమయ్యాయి. అనంతవరం గ్రామంలో ఇటీవల జరిగిన సమావేశంలో రైతులు ల్యాండ్ పూలింగ్ వివాదాలు, మౌలిక సదుపాయాలు, గ్రామకంఠాలు వంటి సమస్యలు చెప్పగా, కమిషనర్ కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలినవాటికి ప్రాధాన్యతాక్రమంలో హామీ ఇచ్చారు. రూ.904 కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలికవసతుల అభివృద్ధి డిపిఆర్ సిద్ధమవుతోందని, రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేస్తామని ప్రకటించారు. సామాజిక సంక్షేమ విభాగం ద్వారా జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇటీవల పరిణామాల్లో రైతులు స్వచ్ఛందంగా భూములు అందజేస్తున్నారు. ఉదాహరణకు ఉండవల్లి, పెనుమాకలో 40.25 ఎకరాలు ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతులకు ముందుగా ప్రయోజనాలు చేకూర్చాలని, అమరావతి అభివృద్ధిలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రకటించారు. సీఆర్‌డిఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంలో రైతులకు న్యాయం కోసం కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ చర్యలు రైతుల్లో విశ్వాసం పెంచుతున్నాయని, కొన్ని గ్రామాల్లో సానుకూల స్పందన వచ్చిందని సిఆర్‌డిఏ అధికారులు చెబుతున్నారు.

రైతుల్లో చాలా మంది ఇంకా సీఆర్డీఏను నమ్మటం లేదు

సీఆర్డీఏ వారు చెబుతున్న అభివృద్ధి సాధించాలంటే ఇంకా ఎన్నో అడ్డంకులు అధిగమించాలి. రైతులు ఇంకా సీఆర్‌డిఏను నమ్మలేకపోతున్నారు. అక్టోబర్ 2025లో రైతులు సీఆర్‌డిఏను నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలతో ఆందోళనలు వ్యక్తం చేశారు. రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి ఆలస్యం, బ్యాంకు లోన్లు రాకపోవడం, రోడ్లు, నీటి సదుపాయాల లోపాలు వంటివి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ల్యాండ్ పూలింగ్‌లో పాల్గొనని రైతులపై బలవంతపు చర్యలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది రైతుల్లోని విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

ఆలస్యమవుతున్న నిర్మాణాలు

రాజకీయ మార్పులు కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో అమరావతి నిర్మాణాలు ఆగిపోయాయి. ఆ తరువాత ప్రస్తుత ప్రభుత్వం రూ.50,552 కోట్ల టెండర్లు పిలిచి 74 ప్రాజెక్టుల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసింది. అయితే అమలు ఆలస్యమవుతోంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ డిప్ (క్షీణత) కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది. వరల్డ్ బ్యాంక్, ఏడిబి వంటి సంస్థలు పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, రైతులు ఇంకా ఆర్థిక భద్రత కోసం పోరాడుతున్నారు.

ఫలితాలు కీలకం

'గ్రామదర్శిని' లాంటి కార్యక్రమాలు రైతులతో ప్రత్యక్ష సంభాషణకు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి. కొంతమేరకు విశ్వాసాన్ని పునరుద్ధరిస్తున్నాయి. అమరావతి అభివృద్ధిలో రైతులను ముందుంచాలన్న ముఖ్యమంత్రి హామీలు సానుకూలమే. ఈ చర్యలు సఫలమవ్వాలంటే హామీల అమలు, పారదర్శకత, రైతుల సహకారం అవసరం. చారిత్రక గాయాలు మానాలంటే రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు వంటివి త్వరగా జరగాలి. లేకుంటే అసంతృప్తి మరింత పెరిగి రాజధాని అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడవచ్చు. ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు ఆశావహమే కానీ ఫలితాలు మాత్రమే వాటి సఫలతను నిర్ణయిస్తాయి.

Tags:    

Similar News