నిస్పృహలో ఉత్తరాంధ్ర వైఎస్సార్ సీపీ నేతలు
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వైఎస్సార్ సీపీ నాయకులు పార్టీ కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో వెనుక పడ్డారు. ఎందుకు?;
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థాల నుంచి పోటీ చేసిన వైఎస్సార్సీపీ వారిలో ఇద్దరు మినహా ఎవ్వరూ గత ఎన్నికల్లో గెలవలేదు. 2019 ఎన్నికల్లో మంచి పట్టు సాధించిన వైఎస్సార్ సీపీ ఒక్క సారిగా కుప్ప కూలింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, అరకు నుంచి మాత్రమే అసెంబ్లీకి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్సీపీ మొత్తం 34 సీట్లకు గాను 28 సీట్లు గెలిచి ఘన విజయం సాధించింది.
పట్టీ పట్టనట్లు మాజీలు
వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ మీటింగ్ లు ఏర్పాటు చేసినా అనాసక్తితోనే వస్తున్నారు. కొందరు జగన్ సమావేశానికి రాకుండా డుమ్మా కొట్టారు. తాను జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడతానని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సభలకు జన సమీకరణ పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని, జన సమీకణలో వెనుక బడితే నియోజకవర్గ ఇన్ చార్జిలను జగన్ మారుస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన జరిగింది. ఈ ఆందోళనలో మాజీ ఎమ్మెల్యేలు కనిపించలేదు. చాలా మంది మాజీ ఎమ్మెల్యేలు తమ వ్యపారాల్లో మునిగి పోయారు.
కేసులకు భయపడి..
ఉద్యమ బాట పట్టాలంటే గడుసు ఉండాలి. కేసులకు భయపడ కూడదు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేటప్పుడు కేసులు, పోలీసులను ఎదుర్కోవడాలు సాధారణంగా ఉంటాయి. అన్నింటినీ ఎదుర్కుంటేనే నాయకుడిగా సక్సెస్ అవుతారు. లేకుంటే కార్యకర్తలు నాయకుడితో ఉండే అవకాశం లేదు. విశాఖపట్నం మాజీ ఎంపీ ఎవివి సత్యనారాయణపై ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసుల వల్ల ఆయన బయటకు రాలేక పోతున్నారు. ఇక మిగిలిన నాయకులు ఎవ్వరూ ప్రభుత్వంపై పోరుకు ముందుకు రావడం లేదు. గుడివాడ అమర్ నాథ్ రెడ్డి మాత్రం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి తమ పార్టీ ఉనికిలోనే ఉందని చెబుతున్నారు.
ముఖం చాటేసిన ధర్మాన ప్రసాదరావు
సీనియర్ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో తనకు తానే సాటి అనిపించుకున్న ధర్మాన ప్రసాదరావు ముఖం చాటేశారు. ప్రస్తుతం తన వ్యపారాలు చూసుకుంటూ ఎక్కువగా బెంగుళూరులో ఉంటున్నారు. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా మాత్రమే శ్రీకాకుళం వచ్చి వెళుతున్నారు. ధర్మాన ప్రసాదరావు అన్న ధర్మాన కృష్ణ దాస్ కు ఇస్తున్న ప్రయారిటీ ప్రసాదరావుకు ఇవ్వటం లేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. అందులోనూ నిజం కూడా ఉంది. కృష్ణదాస్ కు మంత్రి పదవి ఇచ్చి ప్రసాదరావును రాయిగా మాత్రమే పార్టీలో నిలబెట్టారు. ఆ తరువాత మంత్రి పదవి ఇచ్చినా ఆయనకు పెద్దగా స్వేచ్ఛ ఇవ్వలేదు. ప్రస్తుతం కృష్ణదాస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కూటమిని తట్టుకుని ముందుకు సాగటం కాస్త కష్టంగానే ఉంటుందని భావించిన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ ఆరు నెలల కాలంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు.
అసెంబ్లీకి వెళ్లక పోవడం కూడా వైఎస్సార్ సీపీకి నష్టమే...
ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఇరువురు ఎమ్మెల్యేలు కొత్తగా గెలిచిన వారు. రాష్ట్ర అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నారు. వారి కలలను పార్టీ అధ్యక్షుడు జగన్ కల్లలు చేశారు. అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించడంతో మీరు గెలిచీ ఉపయోగం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అరకు, పాడేరుల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారే ప్రస్తుతం గెలిచిన వారుగా చెలామణి అవుతున్నారని, అయినా పార్టీ నుంచి ఎటువంటి డైరెక్షన్ లు లేవని ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇరువురూ విద్యావంతులే ఒకరు టీచరు ఉద్యోగానికి రాజీనామా చేసి రాగా, మరొకరు రిటైర్డ్ టీచర్. ఇలా ఇద్దరూ మంచిగా చదువుకున్న వారు కావడం వల్ల వారి సేవలు గిరిజనులకు ఉపయోగపడేలా చేయాలనుకున్నారు. కానీ అవేవీ ఇప్పుడు జరగటం లేదు. దీంతో వారు కూడా పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. బయటకు మాత్రం మేము పార్టీ మారేది లేదని చెబుతున్నా పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.
ఉత్తరాంధ్ర నాయకులు జనసేనలోకి జంప్ చేస్తారా?
ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు ఎక్కువ మంది జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆముదాలవలస నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్, అలాగే హోం శాఖ మాజీ మంత్రి తానేటి వనిత జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లా నుంచి టీడీపీ వారు పార్టీలోకి ఎవరిని తీసుకోవాలన్నా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పర్మిషన్ తప్పని సరి అనే చర్చ జరుగుతోంది. వీరి అనుమతి లేకుండా ఎవరిని పార్టీలోకి తీసుకున్నా పార్టీలో అంతర్గత పోరుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
టీడీపీలోకి అవకాశాలు తక్కువగా ఉన్నందున జనసేన పార్టీలోకి చేరేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ నుంచి మొత్తంశెట్టి శ్రీనివాసరావు, (అవంతి శ్రీనివాస్) వైఎస్సార్ సీపీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు అవకాశం రాలేదు. పైగా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. అందువల్ల తిరిగి ఆయన తమ్ముడు స్థాపించిన జనసేనలో చేరాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. అవంతికి విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వంలో చేరటం ఎంతో ముఖ్యమని భావిస్తున్నారు. ఈయన బాటలోనే మరికొందరు నాయకులు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.