జగన్‌ అక్రమాస్తుల కేసులో తాజా ఆప్‌డేట్స్‌–సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను అందిస్తే తగిన ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.;

By :  Admin
Update: 2024-12-02 07:44 GMT

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబందించిన పూర్తి వివరాలను సమర్పించాలని సీబీఐ, ఈడీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. కింది కోర్టులో ఉన్న డిశ్చార్జి పిటీషన్‌ల వివరాలను అందించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్‌ దరఖాస్తుల వివరాలను కూడా సుప్రీం కోర్టుకు అందించాలని వెల్లడించింది. సీబీఐ, ఈడీ కేసుల వివరాలను విడివిడిగా ఒక చార్ట్‌ రూపంలో సమర్పించాలని, జగన్‌ అక్రమాస్తుల కేసులకు సంబంధించి అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్లను రెండు వారాల్లోగా దాఖలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

జగన్‌ అక్రమాస్తుల కేసులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు వేసిన పిటీన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. రఘురామకృషరాజు గతంలో జగన్‌ అక్రమాస్తులపై సుప్రీం కోర్టులో కేసు వేశారు. జగక్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఆలస్యం అవుతుందని, విచారణ వేగవంతం చేసి తీర్పును వెల్లడించాలని కోరుతూ గతంలో రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. దీంతో పాటుగా ఆ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటీషన్‌లో కోరారు. దీనిపై తాజాగా సోమవారం జస్టిస్‌ ఎస్‌ ఓకా సుప్రీం కోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏళ్ల తరబడి విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నించింది. దీనికి డిశ్చార్జ్, వాయిదా పిటీషన్లు, ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉండటమే కారణమని న్యాయవాదులు సుప్రీం కోర్టుకు తెలిపారు. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల వివరాలను సమర్పిస్తే తగిన ఆదేశాలను జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు, ట్రయల్‌ కోర్టు, పెండింగ్‌ కేసుల వివరాలను సమర్పించాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబరు 13కు వాయిదా వేసింది.
Tags:    

Similar News