చిత్తూరు జిల్లాలో 'అజ్ఞాత పోరు'

పేరుకే అభ్యర్థులు పోటీలో ఉంటారు. దీర్ఘకాలంగా బద్ధ శత్రువులైన ఇద్దరు నేతల మధ్య అజ్ఞాత యుద్ధం జరుగుతోంది. వీరికి మరొకరు తోడయ్యారు.

Update: 2024-04-17 15:02 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: బలమైన కేడర్ ఉంది. నాయకులు సమర్థులే. వీరంతా క్షేత్రస్థాయి వరకే. మిగతాదంతా ఇద్దరు చిరకాల రాజకీయ ప్రత్యర్థుల మధ్య పోరాటం. 2024 ఎన్నికలకు మరో చిరకాల రాజకీయ ప్రత్యర్థి తెరపైకి వచ్చారు. ఎన్నికలకు కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలుకు గడువు సమీపించింది. చిత్తూరు జిల్లాలో ఆధిపత్యం చాటాలని ఒకరు. పట్టు నిలుపుకునేందుకు ప్రతిపక్షం. వీరిద్దరి మధ్యకి సుధీర్ఘ విరామం తర్వాత మరో రాజకీయ ప్రత్యర్థి ఎంట్రీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ హోరాహోరీగా మారింది.

 బలమైన క్యాడర్, నాయకులు ఉన్నప్పటికీ టిడిపిలో రగులుతున్న ఇంటిపేరు ఇంతవరకు కొలిక్కి రాలేదు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల జోక్యంతో సమసినట్లు కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా, దెబ్బ తీసుకునే పరిస్థితిలో వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త అధికార పార్టీ అభ్యర్థులకు లభించే అవకాశం లేకపోలేదు అనేది పరిశీలకుల అంచనా. టిడిపిలో స్వయంకృత తప్పులే ఎదురు దెబ్బలుగా తగిలే పరిస్థితి ఏర్పడింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మాజీ సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈయన రాజకీయ ప్రత్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పుంగనూరు నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఏమాత్రం పొడగిట్టని మాజీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్ల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో రాజకీయాలు కాక మీద ఉండడమే కాదు. దీనిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో..

గత సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం మినహా 13 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు స్థానాల్లో.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే విజయం సాధించారు. ఇందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక పాత్ర వహించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారికి అవసరమైన సంపత్తి మొత్తం సమకూర్చడంలో మంత్రి పెద్దిరెడ్డి భాగస్వామ్యం అవుతారనేది ఆయన అనుచరుల నుంచి వినిపించే మాట.

 ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే..

తిరుపతి శాసనసభ స్థానంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు తిరుపతి నగరం అభివృద్ధి చేసిన మాస్టర్ ప్లాన్ అవినీతి ఆరోపణలు, నష్టపోయిన పేదలకు న్యాయం చేయడంలో జరిగిన వ్యవహారం వెంటాడుతోంది. కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఆరణి శ్రీనివాసులు యువకుడితో పోటీ పడుతున్నారు. కూటమిలో సంపూర్ణంగా లభించని సహకారమే శాపం. ఇదే తమకు కలిసి వస్తుందనేది వైఎస్ఆర్సిపి అభ్యర్థి భావన.

చంద్రగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రత్యేక రోజుల్లో అన్ని వర్గాలకు తాయిలాల పంపిణీ, ఓట్లను మచ్చిక చేసుకున్న వ్యూహం ఉంది. పాకాల జడ్పిటిసి కొందరు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడం పెద్ద దెబ్బ. టిడిపి అభ్యర్థిగా ఇక్కడి నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని ఈసారి ఎన్నికల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చిత్తూరు శాసనసభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా రూపానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. టికెట్ దక్కక తిరుపతి జనసేన నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గం, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, సీకే జై చంద్రారెడ్డి ( సీకే బాబు) అండదండలు టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్‌కు అందిస్తున్నారు. వీరి అండదండలే టిడిపికి పెద్ద ప్లస్ పాయింట్.

పూతలపట్టు ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానం నుంచి త్రిముఖ పోటీ ఏర్పడింది. మ్మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌తో టిడిపి అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎం మురళి మోహన్ పోటీ చేస్తున్నారు. టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ వైఎస్ఆర్సిపి, టిడిపి అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఏర్పడింది. పలమనేరు నియోజకవర్గంలో టిడిపి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఎన్ అమర్నాథ్‌రెడ్డితో వైఎస్సార్‌సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటే గౌడ తలపడుతున్నారు. ఇద్దరూ తమ పట్టు సాధించుకోవాలనే దిశగా హోరాహోరీగా సమీకరణలు సాగిస్తున్నారు.

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా ఒకనాటి చిరకాల ప్రత్యర్థి చల్లా రామచంద్రారెడ్డితో పాటు, బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్నారు. ఫ్రీ పోలింగ్ జరిగితే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని ప్రత్యర్థి పార్టీల నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసురుతున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే షేక్ షాజహాన్ బాష.. టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపిలో కొన్ని వర్గాలు జనసేన నుంచి ఆయన సహాయ నిరాకరణకు గురవుతున్నారు. ఇది తమకు లాభించే అంశమే అని వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ ఆశాభావంతో ఉన్నారు.

పీలేరు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తండ్రి ఎం అమర్నాథరెడ్డి కాలం నుంచి 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గంతో అనుబంధం ఉంది. రాజంపేట ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. (పీలేరు రాజంపేట ఎంపీ పరిధిలో ఉంది) వీరిద్దరికి పరస్పర సహకారం కలిసి వచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఇక్కడ వారితో తలపడుతున్నారు.

 తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి పెద్దిరెడ్డి

రామచంద్రారెడ్డి సోదరుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. టిడిపి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కు టికెట్ దక్కలేదు. కొత్తగా ఎన్నారై దాసరపల్లి జై చంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న గిల్లికజ్జాలు వైఎస్ఆర్సిపికి మరింతగా లభించే అవకాశం లేకపోలేదనీ భావిస్తున్నారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం కే నారాయణస్వామి కుమార్తె కృపారాణి పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా ఎంపిక చేసిన థామస్‌కు వ్యతిరేకతతో పాటు న్యాయ సంబంధమైన చిక్కులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా కోనేటి ఆదిమూలం పోటీ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు టిడిపిలో టికెట్ దక్కినా ఆ పార్టీలోని అనేక వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది.

వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా సీనియర్ మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మకు కొడుకు వరసైన మేకతోటి రాజేష్ బరిలో ఉన్నారు. టిడిపిలో ఉన్న లోకల్ ఈయనకు లభించే అవకాశం లేకపోలేదు అనేది విశ్లేషకుల అంచనా. నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజా పోటీ చేస్తున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గంలోని ఐదు మండలాల పార్టీ నాయకులు, అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఐదేళ్లుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈసారి కూడా ఆమెకే టికెట్ ఇస్తే ఓటమికి తమ బాధ్యత కాదని కూడా ఎప్పుడో అల్టిమేటం ఇచ్చారు. ఈ వ్యవహారం టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్‌కు లాభించే అవకాశాలను పరిశీలకులు తోసిపుచ్చడం లేదు. శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై టిడిపి సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు భజన సుధీర్ రెడ్డి ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు. మిత్రపక్ష బిజెపి నాయకుడు కోలా ఆనంద్, జనసేన పార్టీ నాయకులు కోట వినూత దంపతుల సహకారంపై ఈయన విజయ అవకాశాలు ఆధారపడి ఉంటాయని అంటున్నారు.

పెద్దిరెడ్డి ఆశీస్సులతో..

చిత్తూరు పార్లమెంటు స్థానం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఎన్ రెడ్డప్ప మళ్లీ పోటీ చేస్తున్నారు. టిడిపి అభ్యర్థిగా బాపట్ల నుంచి చిత్తూరుకు వచ్చిన దగుమల్ల ప్రసాదరావుకు స్థానికేతర సమస్యతో పాటు పూర్తిగా ఈ ప్రాంత నాయకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి.

 డైరెక్ట్ టు సీఎం...

తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో నేరుగా సంబంధాలు కలిగిన సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో పట్టుతోపాటు అందరితో తలలో నాలుగు మెలగడమే ఎంపీ గురుమూర్తికి ఉన్న ప్లస్ పాయింట్. కూటమి నుంచి బిజెపి అభ్యర్థిగా వరప్రసాదరావు పోటీ చేస్తున్నారు. గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈయనకు వైఎస్ఆర్సిపి మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఈయనపై అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి లాభిస్తుందని భావిస్తున్నారు.

రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మూడోసారి ఎంపీ కావాలని తహతహలాడుతున్నారు. తమ కుటుంబానికి చిరకాల ప్రత్యర్థి, బిజెపి అభ్యర్థిగా వస్తున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో తలపడుతున్నారు. రాజంపేట అసెంబ్లీ స్థానంలో తగిలిన ఎదురుదెబ్బ టిడిపికి, రాయచోటిలో టిడిపికి తగిలిన దెబ్బ వైఎస్ఆర్సీపీకి ప్రతిఫలించే అవకాశం ఏర్పడింది. మొత్తం మీద రాజంపేట పార్లమెంటు పరిధిలో పోరు ఆషామాషీగా ఉండదని భావిస్తున్నారు.

మొత్తానికి చిత్తూరు జిల్లాలో పక్కా సీట్లలో మెజార్టీ తగిన కుప్పం ఆ తర్వాత చిత్తూరు, పలమనేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరుపై టిడిపి గంపెడు ఆశతో ఉంది. చంద్రగిరి, తిరుపతి పూతలపట్టు నియోజకవర్గ వర్గాల్లో గట్టి పోటీనే ఏర్పడిందని చెప్పక తప్పదు. సత్యవేడులో టిడిపికి, నగరిలో వైఎస్ఆర్సిపికి, జీడి నెల్లూరులో టిడిపికి ఎదురుదెబ్బలు తగిలే వాతావరణం నెలకొన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. టిడిపి స్వయంకృతం వల్ల కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఎన్నికల్లో మాదిరే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. నష్ట నివారణ చర్యలు కంటి తుడుపు చర్యగా మారాయి. దీనిని సొమ్ము చేసుకోవాలని వైఎస్ఆర్సిపి భావిస్తోంది. ఇక నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో త్వరలోనే ప్రత్యక్ష సమరం కూడా జరుగుతుంది. ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూద్దాం.

Tags:    

Similar News