కలెక్టర్ గారు..పోతిరెడ్డిపాడు–బనకచర్ల లక్ష్యం కోసం చర్యలు తీసుకోండి
బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి రాయలసీమ నీరు అందించాల్సిన వ్యవస్థ పూర్తిగా దారితప్పిన విషయాన్ని సవివరంగా కలెక్టర్ కి వివరించారు.
By : The Federal
Update: 2025-12-06 11:30 GMT
రాయలసీమ సాగునీటి అవసరాల కోసం కీలకంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు – బనకచర్ల కాంప్లెక్స్ అసలు లక్ష్యానికి విరుద్ధంగా నడుస్తున్న నేపథ్యంలో, దీన్ని సక్రమ దిశగా నడిపించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి విజ్ఞప్తి చేశారు. శనివారం నాడు సమితి కార్యవర్గ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ని కలిసి, బనకచర్ల కాంప్లెక్స్ నుండి కృష్ణాజలాల పంపిణీకి సంబంధించిన సంక్షిప్త వినపతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కాంప్లెక్స్ నుండి రాయలసీమ నీరు అందించాల్సిన వ్యవస్థ పూర్తిగా దారితప్పిన విషయాన్ని సవివరంగా ఆయన కలెక్టర్ కి వివరించారు.
కృష్ణా జలాలను రాయలసీమ పంటపొలాలకు అందించాల్సిన ప్రాజెక్టుల నిర్మాణ, నిర్వహణలను అలక్ష్యం చేయడం వల్ల, బనకచర్ల కాంప్లెక్స్ కుందూనదిలోకి జలాలను మళ్లించే వ్యవస్థలుగా మారిపోయిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 44,000 క్యూసెక్కులను తీసుకొని 30 రోజుల్లో 120 టిఎంసీల నీటిని రాయలసీమ ప్రాజెక్టులైన ఎస్ఆర్బిసి, తెలుగుగంగ, గాలేరునగరి, మైలవరం, పైడిపాలెం, చిత్రపతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల ద్వారా 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి అవసరమైన ప్రధాన కాలువలలో ఉన్న అడ్డంకుల తొలగింపు, పంటకాలువల నిర్మాణాలను ప్రాధాన్యతతో చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందించడానికి అవసరమైన చర్యలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తానని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు ఎర్రం శంకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి నిట్టూరి సుధాకర్ రావు, సభ్యులు భాస్కర్ రెడ్డి అడ్వకేట్ అసదుల్లా మియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.