ప్రోటెమ్ స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రోటెం స్పీకర్‌గా ఎవరిని నియమిస్తారు. రేస్‌లో ఇద్దరు సీనియర్‌ సభ్యులు ఉన్నారు.

Update: 2024-06-17 07:27 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ప్రోటెమ్ స్పీకర్‌ పదవి చర్చనీయాంగా మారింది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడటం, నాలుగో సారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఇతర మంత్రుల ప్రమాణ సీకారం కూడా అయిపోయింది. మంత్రులకు శాఖల నియామకాలు కూడా పూర్తి అయ్యాయి. మంత్రులు బాధ్యతలు తీసుకుంటున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక చేపట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటెం స్పీకర్‌గా ఎవరికి అవకాశం కల్పిస్తారనేది కూటమి శ్రేణుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

సహజంగా సీనియర్‌ సభ్యులకు ప్రోటెం స్పీకర్‌గా అవకాశం కల్పిస్తారు. 2014లో సీనియర్‌ సభ్యులైన పతివాడ నారాయణ స్వామి, 2019లో సీనియర్‌ సభ్యులైన శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు ప్రోటెం స్పీకర్‌లుగా వ్యవహరించారు. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఇద్దరు సీనియర్‌ ప్రోటెం స్పీకర్‌ రేస్‌లో ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్నపాత్రుడు అందరి కంటే సీనియర్‌ సభ్యులుగా ఉన్నారు. వీరిద్దరిలో ఒకరికి ప్రోటెం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. ఏడు పర్యాయాలు బుచ్చయ్య చౌదరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలి సారి 1983లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత 1985, 1994, 1999, 2014, 2019, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో 1987లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పని చేసిన బుచ్చయ్య చౌదరి 1994లో ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో మంత్రి గా కూడా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. తాజాగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వంలోనైనా మంత్రిగా చాన్స్‌ వస్తుందని ఎదురు చూశారు. కానీ చంద్రబాబు అవకాశం కల్పించ లేదు.
రేస్‌లో ఉన్న మరో నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా సీనియర్‌ సభ్యుడే. ఈయన కూడా టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి గెలుపొందిన అయ్యన్నపాత్రుడు 1985, 1994, 1999, 2004, 2014, 2024లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మంత్రి వర్గాల్లో మంత్రిగా పని చేశారు. ఇద్దరూ సీనియర్‌ సభ్యులే కావడంతో ఎవరికి ప్రోటెం స్పీకర్‌ గౌరవం వరిస్తుందనేది ఆ పార్టీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
అయితే వీరిలో చింతకాలయ అయ్యన్నపాత్రుడుని అసెంబ్లీ స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశం ఉందని, అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడివైపే చంద్రబాబు కూడా మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నారు. బీసీ నేతకు అసెంబ్లీ స్పీకర్‌ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాభయంలో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది. మరో వైపు స్పీకర్‌ రేస్‌లో నక్కా ఆనందబాబు, కళా వెంకట్రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో అయ్యన్నపాత్రుడు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు చర్చ సాగుతోంది. ఒక వేళ అయ్యన్నపాత్రుడిని అసెంబ్లీ స్పీకర్‌గా ఖరారు చేస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ప్రోటెం స్పీకర్‌గా ఖరారు చేసే అవకాశం ఉంటుందనే టాక్‌ నడుస్తోంది.
కూటమి ప్రభుత్వంలో టీడీపీకి అసెంబ్లీ స్పీకర్‌ పదవి ఇస్తే, డిప్యూటీ స్పీకర్‌ పదవిని టీడీపీ తర్వాత అధిక స్థానాలు కైవసం చేసుకున్న పెద్ద పార్టీగా అవతరించిన జనసేనకు కేటాయించే చాన్స్‌ ఉంది. దీని కోసం అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ నుంచి గెలుపొందిన మండలి బుద్ద ప్రసాద్‌ పేరు వినిపిస్తోంది. ఈయన 2014లో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. నెల్లిమర్ల నుంచి గెలుపొందిన లోకం మాధవి పేరును కూడా డిప్యూటీ స్పీకర్‌గా పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
Tags:    

Similar News